Remdesivir: సూత్రధారులే.. పాత్రధారులు
close

తాజా వార్తలు

Updated : 16/05/2021 08:13 IST

Remdesivir: సూత్రధారులే.. పాత్రధారులు

బ్లాక్‌ మార్కెట్‌లో రూ.లక్షలు పలుకుతున్న వైనం

ప్రైవేటు ఆస్పత్రుల కేంద్రంగానే రెమ్‌డెసివిర్‌ దందా

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ మహిళ కొవిడ్‌ బారినపడ్డారు. నాలుగు రోజులు హోం ఐసోలేషన్‌ తర్వాత ఆయాసం రావడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజుల వైద్యం తర్వాత ఆమెకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఇవ్వాలని వైద్యులు నిర్ణయించారు. అయితే.. ఆ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో బయట తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు. ఓ దళారి తారసపడి ఇంజక్షన్‌ సమకూర్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొత్తం ఆరు డోసులకు ఏకంగా రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని తేల్చి చెప్పాడు. అడిగినంత డబ్బు ఇచ్చి ఇంజక్షన్లు కొనుగోలు చేశారు. వీరే కాదు.. ఈ ఇంజక్షన్‌ అవసరమైన చాలామంది బాధిత కుటుంబాలదీ ఇదే పరిస్థితి.

ఈనాడు డిజిటల్‌, ఖమ్మం: కొవిడ్‌ రెండోదశ విజృంభణతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ బ్లాక్‌ దందాకు అడ్డుకట్ట పడటంలేదు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు వైద్యం పేరిట బాధిత కుటుంబాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ఈ ఇంజక్షన్‌ పేరిట సరికొత్త వ్యాపారానికి తెర లేపుతున్నాయి. కరోనా రోగికి అత్యవసర పరిస్థితిలో వినియోగించే ఈ ఇంజక్షన్‌ పేరుతో కాసులు దండుకుంటున్నాయి. దళారులను రంగంలోకి దించి వారి ద్వారా కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో వీటి విక్రయాలు సాగిస్తున్నారు. సుమారు రూ.3 వేలు ఉండే ఇంజక్షన్‌ రూ.30-50 వేలు వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.

జిల్లాలో రెమ్‌డెసివిర్‌కు కొరత లేదని ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశాల్లో చెబుతున్నా.. బ్లాక్‌ దందా మాత్రం ఆగడంలేదు. కృత్రిమ కొరత సృష్టించి బాధితుల నుంచి భారీగా సొమ్ము చేసుకొంటున్నారు. టాస్క్‌ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దించినా.. ప్రయోజనం కనిపించడంలేదు. అధికారుల ప్రకటనలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. బాధితులకు వైద్యం అందిస్తూనే.. ఇంజక్షన్‌ అవసరమైనప్పుడు తమకు ఏమాత్రం సంబంధం లేనట్లు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. రోగి అవసరాన్ని కొందరు అవకాశంగా మలుచుకుంటున్నాయి. ఎవరిని ఆశ్రయిస్తే ఇది దొరుకుతుందో చెప్పి మరీ పంపుతున్నారు. ఖమ్మంలో ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపించేందుకు ఇబ్బడిముబ్బడిగా దళారులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దళారులు-ప్రైవేటు ఆస్పత్రుల మధ్య పరస్పర ఒప్పందంతోనే ఈ దందా జోరుగా సాగుతోంది. ఖమ్మం జిల్లాలో ఈ ఇంజక్షన్‌ కోసం కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొన్న ఆస్పత్రులు 17 ఉన్నాయి. కానీ 6 ఆస్పత్రులకు మాత్రమే ప్రస్తుతం సరఫరా అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా కొనసాగుతోంది. రూ.2.30 లక్షల డీడీ కడితే ఆయా ఆస్పత్రులకు కంపెనీ నుంచి ఇంజక్షన్‌ సరఫరా అవుతుంది. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం పట్టణాల్లోనూ నల్లబజారులో రెమ్‌డెసివిర్‌ దందా జోరుగా సాగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

డోసు ఇవ్వకున్నా..

మరికొన్ని ఆస్పత్రులు చేయని వైద్యాన్ని చేసినట్లు చూపి రోగి బంధువులను బురిడీ కొట్టిస్తున్నాయి. అచేతన స్థితిలో ఉన్న రోగికి మందులు ఏం ఇస్తున్నారో.. ఏ సూదిమందు ఇస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. దీనిని కూడా కొందరు సొమ్ము చేసుకుంటున్నట్లు ఇటీవల ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చిన ఉదంతమే నిదర్శనం. ఆరోగ్యం క్షీణించి మెరుగైన వైద్యం కోసం వచ్చిన ఓ బాధితుడి ఉదంతం ఈ తరహా సంఘటనను బయటపెట్టింది. వారంరోజులు చికిత్స పొందిన బాధితుడిని వదిలించుకునేందుకు ఓ ప్రైవేటు ఆస్పత్రి మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించింది. రెమ్‌డెసివిర్‌ ఇచ్చామని డబ్బులు సైతం వసూలు చేసింది. తర్వాత పరిస్థితి విషమిస్తుందని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో కుటుంబీకులు బాధితున్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకు అందిన వైద్యానికి సంబంధించిన మందులు, ఇంజక్షన్లు ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బందికి అందజేశారు. బాధితుడికి అందిన వైద్యాన్ని సిబ్బంది పరీక్షించగా అతనికి అసలు రెమ్‌డెసివిర్‌ ఇవ్వలేదని తేల్చారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి యాజమాన్యాన్ని గట్టిగా నిలదీయగా నిజం అంగీకరించి డబ్బులు తిరిగి ఇచ్చేశారు. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రానివి ఎన్నో ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు

విష్ణు ఎస్‌.వారియర్‌, ఖమ్మం సీపీ

ఖమ్మం జిల్లాలో సరిపడా రెమ్‌డెసివిర్‌ అందుబాటులో ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ ధరలకు విక్రయించినట్లు గుర్తించినా, ఎవరినైనా ఇబ్బందులకు గురిచేసినా డయల్‌ 100కు కాల్‌ చేసి సమాచారం అందించండి. కొన్ని ఆస్పత్రుల్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న సమాచారం ఉంది. ఎక్కడ దొరుకుతుందో వాళ్లే ఏజెంట్లను పంపి పది, ఇరవై రెట్లు ధరలు పెంచి విక్రయిస్తున్నట్లు తెలిసింది. అలాంటి వారిపై చర్యలు తప్పవు. బ్లాక్‌ మార్కెట్‌ దందాను అరికట్టేందుకు టాస్క్‌ ఫోర్స్‌ బృందం నిరంతరం పనిచేస్తుంది. టాస్క్‌ ఫోర్స్‌ ఏసీపీ నంబరు 79011 37072ను సంప్రదించి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని