కోల్‌కతా ఐఐఎంలో 61 మందికి కరోనా పాజిటివ్
close

తాజా వార్తలు

Published : 12/04/2021 19:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోల్‌కతా ఐఐఎంలో 61 మందికి కరోనా పాజిటివ్

కోల్‌కతా: ఐఐఎం-కోల్‌కతా క్యాంపస్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. గత పదిరోజుల వ్యవధిలో 61 మంది విద్యార్థులకు మహమ్మారి సోకినట్లు అధికారులు వెల్లడించారు. మరో 30 మంది విద్యార్థుల రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు వైరస్‌ వ్యాప్తి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని, కొవిడ్‌ లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని ఇన్‌స్టిట్యూట్‌ అధికారులు చెబుతున్నారు. వైరస్‌ సోకిన విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగానే ఉందని, వారి కోసం క్యాంపస్‌లోనే ప్రత్యేక గదులు ఏర్పాటు చేశామని వివరించారు. అత్యవసర సమయంలో వీరికి సేవలు అందించేందుకు ముగ్గురు వైద్యులను నియమించారు.

దేశవ్యాప్తంగా కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ మొదటి వారంలోనే దాదాపు 570 మందికి పైగా విద్యార్థులు క్యాంపస్‌ నుంచి స్వస్థలాలకు వెళ్లిపోయారు. 335 మంది మాత్రమే క్యాంపస్‌లో ఉన్నారు. తాజాగా వారిలోనే 61 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ‘ అదృష్టవశాత్తు విద్యార్థులకు చిన్నపాటి లక్షణాలే కనిపించాయి. ఆస్పత్రిలో చేర్పించాల్సిన పరిస్థితికి ఎవరికీ లేదు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేందుకు అంబులెన్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచాం’’ అని ఐఐఎం-కోల్‌కతా కొవిడ్‌-19 కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ప్రశాంత్‌ మిశ్రా వెల్లడించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐఐఎం-కోల్‌కతా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. స్వస్థలాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి క్యాంపస్‌లోకి రావాలంటే ఆర్టీపీసీఆర్‌ టెస్టులను తప్పనిసరి చేసింది. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో గత జనవరిలో దాదాపు 900 మంది విద్యార్థులు తిరిగి క్యాంపస్‌కు చేరుకున్నారు. వారందరికీ నెగటివ్‌ రిపోర్టు వచ్చిన తర్వాతనే లోపలికి అనుమతించారు. తాజాగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడానికి ఏ ఒకరిద్దరో కారణమై ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్‌ 2న 7 కేసులు, ఏప్రిల్‌ 4న మరో 6, ఏప్రిల్‌ 5న 12, ఏప్రిల్‌ 6న 19 కేసులు నమోదైనట్లు క్యాంపస్ అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని