close
సీఎం హుజూర్‌నగర్‌ సభ రద్దు

  భారీ వర్షంతో చిత్తడిగా మారిన సభా ప్రాంగణం
  హెలికాప్టర్‌ ప్రయాణానికి  అనుమతి నిరాకరణ

ఈనాడు, హైదరాబాద్‌- ఈనాడు డిజిటల్‌, సూర్యాపేట: ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం జరగాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ పర్యటన భారీవర్షం కారణంగా రద్దయ్యింది. హైదరాబాద్‌, హుజూర్‌నగర్‌లలో రెండుచోట్లా అనుకూల వాతావరణం లేనందున హెలికాప్టర్‌లో సీఎం ప్రయాణానికి వైమానికశాఖ అనుమతించలేదు. ఫలితంగా హోంమంత్రి మహమూద్‌అలీ, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావులతో కలసి ప్రయాణానికి సిద్ధంగా ఉన్న సీఎం తమ పర్యటనను రద్దు చేసుకున్నారు.

ప్రచారం ముగింపు దశలో..
ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో.. తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం హుజూర్‌నగర్‌లో జరగాల్సిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉప ఎన్నిక పార్టీ ఇన్‌ఛార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. సరిగ్గా మధ్యాహ్నం 2గంటలకు కేసీఆర్‌ వస్తారని నాయకులు ప్రకటించారు. గ్రామాల నుంచి వాహనాల ద్వారా ప్రజల రాక ముమ్మరమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 1.45గంటలకు హుజూర్‌నగర్‌ చుట్టూ కారుమబ్బులు కమ్ముకున్నాయి. 1.50 గంటలకు ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో సుమారు అరగంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో సభాప్రాంగణం చిత్తడిగా మారింది. సభాస్థలిలోని ప్రజలు, నాయకులు వాన బారి నుంచి తప్పించుకునేందుకు కుర్చీలను తలలపై పెట్టుకొని నిరీక్షించారు. మరోవైపు వాతావరణం అనుకూలంగా లేదని, మార్గమధ్యలో దట్టమైన మేఘాలున్నాయని, పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ సీఎంవోకు సమాచారం అందించింది. ఆ నివేదిక ఆధారంగా వైమానికశాఖ సీఎం హెలికాప్టర్‌ ప్రయాణానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీఎం పర్యటన రద్దయినట్లు 2.27గంటలకు వేదిక మీద నుంచి ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి తన సందేశాన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందిస్తారని జగదీశ్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. సీఎం సభ రద్దుతో తెరాస నాయకులు, సభాస్థలికి తరలివచ్చిన ప్రజలు నిరుత్సాహంతో వెనుదిరిగారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.