close

ప్రధానాంశాలు

కుటుంబ సభ్యులకూ దూరంగా వృద్ధులు

భారీ ఆస్పత్రులుగా మారుతున్న ఎగ్జిబిషన్‌ సెంటర్లు
కరోనాపై పోరులో బ్రిటన్‌ పటిష్ఠ చర్యలు
‘ఈనాడు’తో డాక్టర్‌ రమేశ్‌ పొట్లూరి

ఈనాడు - హైదరాబాద్‌

కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే 1400 దాటిపోయిన బ్రిటన్‌లో దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా గట్టి ప్రయత్నం చేస్తోందని ఆ దేశంలోని స్టోక్‌-ఆన్‌-ట్రెంట్‌ పట్టణంలో జాతీయ ఆరోగ్య సేవా వ్యవస్థ(నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌)కు అనుబంధంగా జనరల్‌ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ రమేశ్‌ పొట్లూరి తెలిపారు. ఆయన ‘ఈనాడు’ ప్రతినిధితో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. రాబోయే మూడు నాలుగు వారాల్లో బ్రిటన్‌లో కరోనా ప్రభావం గరిష్ఠ స్థాయికి చేరుతుందనే అంచనాతో అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.

పది రోజులుగా బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ అమలవుతోందని, అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు కూడా ఒకరికొకరు రెండు మీటర్ల వ్యక్తిగత ఎడం పాటించేలా చూస్తున్నారని.. ప్రజల నుంచి కూడా బాగా సహకారం ఉందని డాక్టర్‌ రమేశ్‌ వివరించారు. వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ ఉన్న దాదాపు 15 లక్షల మంది వృద్ధులు, హృద్రోగులు, కేన్సర్‌ పీడితులు వంటి వారిని కుటుంబ సభ్యులు కూడా కలవకుండా తాజాగా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని వివరించారు. ఇది 12 వారాల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఇలా ఏకాంతంలో ఉండే వారి అవసరాలను తీర్చేందుకు స్వచ్ఛంద కార్యకర్తల సేవలు ఉపయోగించుకుంటున్నదని వివరించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగస్వాములయ్యేందుకు ప్రభుత్వ పిలుపు మేరకు 7.5 లక్షల మంది స్వచ్ఛంద కార్యకర్తలుగా పనిచేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. అలాగే రిటైరైన.. విశ్రాంతి తీసుకుంటున్న వైద్యులు, నర్సుల వంటి ఆరోగ్య సిబ్బంది 20 వేల మంది విధుల్లోకి చేరారని చెప్పారు.

అత్యుత్తమ ప్రమాణాలతో ఐసీయూ పడకలు
బ్రిటన్‌లో ఐసీయూ పడకల నిర్వహణ అత్యుత్తమ ప్రమాణాలతో ఉంటుందని, ఒక్కో పడకకు అనుబంధంగా ఆరు నుంచి పన్నెండు మంది సిబ్బంది ఉంటారని డాక్టర్‌ రమేశ్‌ వివరించారు. కరోనా రాక ముందు ఇలాంటి ఐసీయూ పడకలు 4500 ఉండేవని వాటిని ప్రస్తుతం 8 వేలకు పెంచారని తెలిపారు. ఇక లండన్‌లోని ప్రఖ్యాత ఎక్సెల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను ‘నైటింగేల్‌ హాస్పిటల్‌’గా మారుస్తున్నారని.. ఇప్పటికే అక్కడ 500 పడకల ఏర్పాటు పూర్తి కావచ్చిందని చెప్పారు. త్వరలో మరో 3500 పడకలనూ అక్కడ ఏర్పాటు చేయనున్నారని వివరించారు. బర్మింగ్‌హామ్‌లోని నేషనల్‌లో ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను కూడా 5000 పడకల ఆస్పత్రిగా మారుస్తున్నట్లు ఆయన తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.