close

తాజా వార్తలు

కాల్‌ ఛార్జీల మోత తప్పదా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: గంటల కొద్దీ కబుర్లు.. వందల కొద్దీ మెసేజ్‌లు.. రోజంతా ఇంటర్నెట్‌తోనే కాలక్షేపం.. మొబైల్‌ వదిలితే పాపం. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఏ ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి. ఇంతగా వాటికి బానిసలవడానికి కారణం.. తక్కువ ధరకే కాల్‌, డేటా సేవలు అందుబాటులో ఉండటం. జియోకు ముందు ఓ లెక్క, వచ్చాక మరో లెక్క. అంతకు ముందు 1జీబీ డేటా కోసం వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అతి తక్కువ ధరలకే డేటా, కాల్‌ సేవలు ఇచ్చిన జియో దెబ్బతో ఇతర సంస్థలు అదే బాట పట్టాయి. ఫలితంగా ఇంటర్నెట్ విప్లవం ప్రారంభమైంది. పోటీ తట్టుకునేందుకు జియో మార్గాన్నే అనుసరించిన సంస్థలు ఇప్పుడు ఎటూ తోచని స్థితిలో ఉన్నాయి. చౌక ధరలకే సేవలందించి కాస్తో కూస్తో పేరు మూటగట్టుకున్నా ఆర్థికంగా కుదేలవ్వాల్సి వచ్చింది. ఐడియా, వొడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ సంస్థలు వేల కోట్ల రూపాయలు నష్టపోవడమే ఇందుకు నిదర్శనం. అందుకే ఈ నష్టాన్ని పూడ్చుకునే పనిలో పడ్డాయి ఆయా సంస్థలు. డిసెంబర్‌ నుంచి కాల్‌, డేటా ఛార్జీలు పెంచుతున్నట్లు వినియోగదారులకు పిడుగులాంటి వార్త చెప్పాయి. 

35 నుంచి 40 శాతం పెరగనున్న ధరలు

చౌకగా వస్తున్నాయని వందల కాల్స్‌ చేస్తున్నారా! ఇంటర్నెట్‌లో పొద్దస్తమాను మునిగి తేలుతున్నారా! అయితే ఈ అవకాశం ఈ నెల వరకే. ఇకపై ఆచితూచి కాల్స్‌ చేయాల్సి ఉంటుంది. డేటా కూడా పరిమితంగా వాడుకోక తప్పదు. డిసెంబర్‌ ఒకటో తేది నుంచి ఛార్జీల మోత మోగనుంది. ఈ మేరకు సంయుక్తంగా ప్రకటన చేశాయి వోడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థలు. ధరలు పెంచుతామని ప్రకటించాయే తప్ప ఎంతా అని స్పష్టంగా ప్రకటించలేదు ఈ సంస్థలు. ప్రస్తుతం ఉన్న ధరలకు 35 నుంచి 40 శాతం వరకు అదనంగా వసూలు చేస్తారని తెలుస్తోంది. అసలు ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటీ? అందరీ మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇదే! ఇందుకు ఆయా సంస్థలు చెబుతున్న ఒకే ఒక కారణం భారీగా నష్టపోయామని. జులై - సెప్టెంబర్‌ త్రైమాసికానికి వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థలు సంయుక్తంగా రూ.73వేల కోట్ల మేర నష్టాన్ని ప్రకటించాయి. ఈ ఫలితాలు వెల్లడైన కొన్ని రోజులలోనే ధరల పెంపునకు కంపెనీలు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఓ రకంగా టెలికాం సంస్థల మధ్య తీవ్ర పోటీ కూడా ఈ పరిస్థితికి కారణంగా చెప్పొచ్చు. జియో వచ్చాక టెలికాం రంగంలో విప్లవమే వచ్చింది. అతి తక్కువ ధరలకే అపరిమిత కాల్స్‌, డేటా అందించడంతో చాలా మంది ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియోకు మారారు. పోటీ పెరిగింది. జియో తరహాలోనే ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా ఛార్జీలు తగ్గించాయి. ఈ క్రమంలోనే కార్యకలాపాల విస్తరణ కోసం భారీగా రుణాలు తీసుకోవల్సి వచ్చింది. అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. జులై-సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో వొడాఫోన్‌ రూ.50వేల 921 కోట్లు నష్టాలుగా ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ రూ.23వేల 45 కోట్లు నష్టాలు వచ్చాయని పేర్కొంది. ఈ నష్టాలు భర్తీ చేసుకొనేందుకు ఛార్జీలు పెంచాల్సి వస్తుందని టెలికాం కంపెనీలు అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించాలంటే ఛార్జీలు పెంచక తప్పదని ఈ రంగంలో చాలా పెట్టుబడులు అవసరమవుతాయని చెబుతున్నాయి. డిజిటల్‌ ఇండియా స్వప్నం సాకారం కావాలంటే టెలికాం పరిశ్రమ సహకారం ముఖ్యమని వాఖ్యానించింది.

సుప్రీంకోర్టు కీలక తీర్పు

వినియోగదారులకు ప్రపంచస్థాయి డిజిటల్‌ సేవల అనుభూతి కొనసాగుతుందని హామీ ఇస్తున్నట్లు వోడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. టెలికాం రంగం బలోపేతం అవ్వాలంటే కేంద్రం సహాయ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాయి టెల్కోలు. పోటీ సంస్థల ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని, వాటికి బాకీలు కట్టే స్థోమత ఉందని ముఖేశ్‌ అంబానీ సంస్థ రిలయెన్స్‌ జియో వాదిస్తోంది. ఈ భిన్న వాదనల మధ్య ఆ అంశం నలుగుతోంది. ఈ సమయంలో సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) అంశం తెరపైకి వచ్చింది. నిజానికి ఈ వివాదం 16 ఏళ్లుగా కొనసాగుతోంది. టెలికం సేవల కోసం లైసెన్సులు పొందిన టెల్కోలు.. తమకు వచ్చే ఆదాయంలో నిర్దిష్ట శాతం లెసెన్సు రుసుము, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆదాయం లెక్కించే విషయంలోనే టెలికాం సంస్థలు, కేంద్ర టెలికాం విభాగం మధ్య వివాదం సాగుతోంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన ఆదాలు టెల్కోలకు ఆదాయమేనన్నది కేంద్రం వాదన. అందుకు తగినట్లు సవరించిన స్థూల ఆదాయం ఏజీఆర్‌ ప్రాతిపదికన టెలికాం సంస్థలు లైసెన్సు రుసుములు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు కట్టాలని నిర్దేశించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెల్కోలు న్యాయ పోరాటానికి దిగగా ఇటీవలే వాటికి ఎదురు దెబ్బ తగిలింది. ఏజీఆర్‌ లెక్కింపుపై టెలికాం శాఖ రూపొందించిన ఏజీఆర్‌ నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. టెలికం సంస్థల వాదనలు తోసిపుచ్చింది. ఆయా కంపెనీలు ఫెనాల్టీ, వడ్డీ చెల్లించాల్సిందేనని ఆదేశించింది. తదుపరి వాదనలకు అవకాశం లేదని స్పష్టం చేసింది. నిర్దేశించిన గడువులోగా చెల్లించాలని పేర్కొంది. సుమారు రూ.92 వేల కోట్ల ఏజీఆర్‌ వసూలుకు కేంద్రానికి అనుమతించింది. 

ఎయిర్‌టెల్‌ అసహనం

నూతన టెలికం విధానం ప్రకారం కంపెనీల తాలుకు సవరించిన స్థూల రాబడిలో వాటా ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు అదనంగా రేడియో ఫ్రీకెన్సీ స్పెక్ట్రం కేటాయించినందుకు టెలికం కంపెనీలు స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. సుప్రీం కోర్టు తీర్పుపై ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్‌ అసహనం వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పు టెలికం రంగాన్ని బలహీనపరిచేలా ఉందని ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరింది.  నిజానికి ఏ ఏటికాయేడు టెల్కోలు కేంద్రం నిర్వచనం మేరకు ఏజీఆర్ లెక్కించి ఛార్జీలు చెల్లిస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే కేంద్రానికి చెల్లించాల్సిన మొత్తంలో దాదాపు 75 శాతం వడ్డీలు, పెనాల్టీల రూపంలో పోగుపడినవే. అసలు బకాయి 25 శాతమే. సుప్రీం తీర్పు నేపథ్యంలో భారీగా బకాయిలు కట్టాల్సిన టెలికం కంపెనీలు కొంత వెసులుబాటును కల్పించాలంటూ కేంద్రాన్ని పదేపదే అభ్యర్థిస్తున్నాయి. చెల్లింపులపై మూడేళ్ల మారటోరియం ఇవ్వాలని, మొత్తం బకాలన్నీ కట్టేందుకు గడువు మరింత పొడిగించాలని, వడ్డీ రేటు తక్కువ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. సాధారణంగా రుణం తీసుకున్న మరుసటి నెల నుంచే ఈఎంఐలు మొదలవుతాయి. కొన్నాళ్లపాటు కట్టకుండా వెసులుబాటు కల్పించడాన్ని మారటోరియంగా వ్యవహరిస్తారు. ఈ మారటోరియం కాలానికి కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.  

ఐయూసీ ఛార్జీల కోసం వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ పట్టు

ఏజీఆర్‌ తర్వాత తెరపైకి వస్తున్న మరో అంశం ఇంటర్‌ కనెక్ట్‌ యూసెజ్‌ ఛార్జీలు (ఐయూసీ). అంటే ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్‌చేసినప్పుడు కాల్‌ అందుకున్న నెట్‌వర్క్‌కు కాల్‌ చేసిన నెట్‌వర్క్‌ నిమిషానికి 6పైసలు చెల్లించాలి. ఫలితంగా జియో నికరంగా ఇతర టెల్కోలకు కొంత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అందుకే వీటిని తొలగించాలని జియో మొదటి నుంచి వాదిస్తోంది. ఎయిర్‌టెల్‌, ఐడియా మాత్రం ఉంచాలని కోరుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి తొలగించడానికి గతంలో కేంద్రం సమ్మతించింది. కానీ ఇటీవల పరిణామల మధ్య వీటిని తొలగించకూదడని వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ మరింత పట్టుపట్టాయి. ఫలితంగా త్వరలో కొత్త విధానం తెస్తామని ట్రాయ్‌ ప్రకటించింది. భారీ నష్ట్రాలు, పేరుకుపోయిన రుణాలు, సుప్రీంకోర్టు తీర్పు, కేంద్రానికి వేల కోట్లు చెల్లించాల్సి రావడంతో ఆయా సంస్థలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే వినియోగదారులపై భారం మోపాల్సిందేనని టెలికం కంపెనీలు భావిస్తున్నాయి. టెలికం రంగంలో ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గించేలా క్యాబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కార్యదర్శుల కమిటీ పరిశీలిస్తోందని చెబుతుంది వోడాఫోన్‌ ఐడియా.

వోడాఫోన్‌ ఇండియా, ఐడియా విలీనం

ఛార్జీలు పెంచిన సంస్థల పరిస్థితి గమనిస్తే.. జియో నుంచి ఎదురవుతున్న టారిఫ్‌ల పోటీ తట్టుకునేందుకు వోడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులర్లు తమ వ్యాపారాన్ని విలీనం చేశాయి. తద్వారా 40.08 కోట్ల మంది వినియోగదార్లతో దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఈ సంస్థ అవతరించింది. విలీనానంతరం కూడ సంస్థను సమస్యలు వెంటాడుతున్నాయి. విలీనం నాటి నుంచి 10 కోట్లకు పైగా చందాదాలను సంస్థ కోల్పోయింది. ఇది లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపింది. వీటికి తోడు నెట్‌వర్క్‌ అభివృద్ధిపై పెట్టుబడులు పెడుతున్నా టారిఫ్‌లపై వస్తున్న ఆదాయం పరిమితంగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు కొనసాగాయి. అందుకే వీటన్నింటికి ఛార్జీల పెంపు పరిష్కారంగా భావించి ఆ దిశగా వోడాఫోన్‌ ఐడియా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వొడాఫోన్‌ ఐడియాలో వొడాఫోన్‌కు 45.39శాతం వాటా ఉంది. ఇందలో కొత్త పెట్టుబడులు పెట్టబోమని వొడాఫోన్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ కూడ ఇప్పటికే ఈ తరహా నిర్ణయం తీసుకుంది.  ఫలితంగా ఇక నుంచి అంతర్గంగా సమీకరించే ఆదాయంపైనే వొడాఫోన్‌ ఐడియా ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది. ఛార్జీలు పెంచితే ఆదాయం పెరుగుతుందని సంస్థ ఆలోచనగా తెలుస్తోంది.

జియో రాకతో మారిన ముఖచిత్రం

రిలయెన్స్‌ జియో రాకతో భారతీయ టెలికం రంగం ముఖచిత్రమే మారిపోయింది. అసలు సమస్య అంత అక్కడి నుంచి మొదలైంది. టెలికం పరిశ్రమలో ధరల యుద్ధం మొదలైంది. ఈ ధరల యుద్ధం ఎదుర్కొనేందుకే వొడాఫోన్‌ ఐడియా ఒక్కటయ్యాయి. ఉచిత డేటా, కాల్స్‌, మెసేజ్‌లతో 4జీ సేవల సంస్థగా అడుగుపెట్టిన జియో సంచలనాలకు కేంద్ర బిందువైంది. చౌక ఇంటర్నెట్‌ ప్యాకేజీలతో పెద్ద ఎత్తున వినియోగదారులను ఆకర్షించింది. ఫలితంగా అప్పటికే ఉన్న ఎయిర్‌టెల్‌,  వోడాఫోన్‌, ఐడియా సంస్థల ఆదాయం తల్లకిందులైంది. జియోకు పోటీగా ఛార్జీలు తగ్గించడం వల్లే ఆయా సంస్థలకు నష్టాలు వాటిల్లాయి. డేటా ధరలు ఒకప్పటితో పోలీస్తే దాదాపు 95శాతం పడిపోయి ఒక జీబీ విలువ రూ.11.78 పైసలకు పరిమితమైందని ట్రాయ్‌ తెలిపింది. మొబైల్‌ కాల్స్‌ ఛార్జీలూ సుమారు 60 శాతం తగ్గి జూన్‌ 2016, డిసెంబర్‌ 2017 మధ్య నిమిషానికి దాదాపు 19 పైసలకు చేరాయని వివరించింది. ప్రస్తుతం జియో తన అన్ని ప్యాకేజీల్లో అపరమిత వాయిస్‌ కాల్స్‌ అందించింది. ఇటీవల ఇతర నెట్‌వర్క్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు చొప్పున ఐయూసీ వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ సైతం ఛార్జీలు పెంచడంతో ప్రైవేటు నెట్‌వర్క్‌ల వినియోగదారులందరిపైన భారం పడినట్లయింది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, వొడాపోన్‌ ఐడియా కనీస ఛార్జీలు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. 

 Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.