అంకురాలకు రూ.100 కోట్ల భరోసా

ప్రధానాంశాలు

అంకురాలకు రూ.100 కోట్ల భరోసా

వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ఏర్పాటుకు నిర్ణయం
టీఎస్‌ఐడీసీ ద్వారా చేయూతకు రాష్ట్ర ప్రభుత్వ యోచన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని అంకుర సంస్థలకు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐడీసీ)ద్వారా సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 కోట్లతో ఒక వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో పెద్దఎత్తున అంకుర సంస్థలు ఏర్పాటవుతున్నాయి. దాదాపు ఆరు వేలకు పైగా ఇప్పటికే కార్యరూపం దాల్చగా.. మరో పది వేలకు పైగా ఆలోచనల దశలో ఉన్నాయి. అంకుర సంస్థల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నిధుల కోసం అన్వేషిస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం టీహబ్‌, వీహబ్‌ల ద్వారా పేరొందిన పారిశ్రామిక సంస్థలు, రుణ సంస్థల ద్వారా సాయం అందిస్తోంది. రోజురోజుకూ అంకుర సంస్థలు పెరుగుతున్నందున ప్రభుత్వం సహకారం కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ఐడీసీ ద్వారా వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు నిర్ణయించారు. వెంటనే దీనిని ఆచరణలోనికి తేవాలని సూచించారు. రూ.100 కోట్ల మూల నిధిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను సమకూరుస్తుంది. మిగిలిన రూ.90 కోట్లను ఇతర ప్రైవేటు సంస్థల ద్వారా సమీకరిస్తారు. ఈ నిధుల వినియోగం, సాయం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇందులో టీహబ్‌, వీహబ్‌, టీవర్క్స్‌, హైదరాబాద్‌ పరిశోధన, ఆవిష్కరణ మండలి తదితర సంస్థలు భాగస్వామిగా ఉంటాయి.

రూ. 5లక్షల సాయం

అంకుర సంస్థలకు రూ.5 లక్షల వరకు లేదా ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం వరకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థల ఎంపికతో పాటు అర్హతలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో ఖరారు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అంకురాలున్న రాష్ట్రాల్లో వెంచర్‌ క్యాపిటల్‌్ సంస్థలే సాయం అందిస్తున్నాయి. ప్రభుత్వపరంగా చేయూత దేశంలో ఇదే ప్రథమమని భావిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని