భారత్‌-చైనా మధ్య పెద్ద సమస్య: ట్రంప్‌

తాజా వార్తలు

Updated : 21/06/2020 15:16 IST

భారత్‌-చైనా మధ్య పెద్ద సమస్య: ట్రంప్‌

ఇరు దేశాలతో చర్చిస్తున్నామన్న అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: భారత్‌-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల్ని పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ మేరకు ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నామని చెప్పుకొచ్చారు. ‘‘అక్కడ క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. మేం భారత్‌తో మాట్లాడుతున్నాం. అలాగే, చైనాతోనూ చర్చిస్తున్నాం. వారివురి మధ్య పెద్ద సమస్య తలెత్తింది. ఇటీవల తీవ్ర ఘర్షణకు దిగారు. ఏం జరుగుతుందో చూడాలి. సమస్యను పరిష్కరించుకునేలా మేం వారికి సాయం చేసే ప్రయత్నం చేస్తాం’’ అని విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 

భారత్‌-చైనా మధ్య ఇటీవలి కాలంలో నెలకొన్న పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ట్రంప్‌ పాలకవర్గంలోని ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖ కాంగ్రెస్‌ సభ్యులు చైనా దురాక్రమణపై వివిధ సందర్భాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. చైనా కుయుక్తులను బయటపెడుతూ భారత్‌కు బాసటగా నిలిచారు. చైనా విశ్వసించలేమని బాహాటంగానే ప్రకటించారు. ప్రపంచమంతా కరోనాపై పోరాడుతున్న సమయంలో అదునుగా భావించిన చైనా పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోందని డ్రాగన్‌ దుర్బుద్ధిని బయటపెట్టారు.

భారత్‌ వెంబడి ఉన్న సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చైనా సైన్యం పెంచుతోందంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో శుక్రవారం దుయ్యబట్టిన విషయం తెలిసిందే. చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీని ‘ధూర్త శక్తి’గా ఆయన అభివర్ణించారు. దక్షిణ చైనా సముద్రంలో సైనిక కార్యకలాపాలను చైనా పెంచిందన్నారు. సముద్ర మార్గాలను ప్రమాదంలో పడేస్తోందని విమర్శించారు. హాంకాంగ్‌లో స్వేచ్ఛను హరిస్తోందన్నారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని