అప్పుడు వెండి.. ఇప్పుడు పసిడి

ప్రధానాంశాలు

Published : 05/08/2021 02:48 IST

అప్పుడు వెండి.. ఇప్పుడు పసిడి

200మీ. పరుగు ఛాంపియన్‌ డిగ్రాస్‌

అయిదేళ్ల కిందట 2016 రియో క్రీడల పురుషుల 200మీ. పరుగు.. ఫేవరేట్‌గా బరిలో దిగిన బోల్ట్‌ అంచనాలను అందుకుంటూ వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌ స్వర్ణాన్ని పట్టేశాడు. అప్పుడు రెండో స్థానంలో నిలిచిన రన్నర్‌ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌ 200మీ. పరుగులో పసిడి గెలిచిన స్ప్రింటర్‌పై ప్రపంచమంతా దృష్టి పెట్టింది. రియోలో బోల్ట్‌ వెనకాల నిలచిన ఆ అథ్లెటే.. ఇప్పుడు ఒలింపిక్‌ ఛాంపియన్‌గా అతని సరసన చేరాడు. అతనే.. ఆండ్రూ డిగ్రాస్‌. 200మీ. పరుగులో కొత్త విజేత

టోక్యో: కెనడా అథ్లెట్‌ డిగ్రాస్‌ అందుకున్నాడు. గత ఒలింపిక్స్‌లో సొంతం చేసుకోలేని పసిడిని.. ఇప్పుడు టోక్యోలో పట్టేశాడు. పురుషుల 200మీ. పరుగులో కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. బుధవారం ఫైనల్లో 19.62 సెకన్లలో రేసు ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఒలింపిక్స్‌లో 100మీ. పరుగులో కాంస్యానికే పరిమితమైన అతను.. 200 మీటర్లలో మాత్రం స్వర్ణం సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ టైమింగ్‌తో జాతీయ రికార్డు నెలకొల్పి మరీ లక్ష్యాన్ని చేరుకున్నాడు. అమెరికా అథ్లెట్లు బెడ్నారెక్‌ (19.68సె), నోవా లీల్స్‌ (19.74సె) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ప్రపంచ ఛాంపియన్‌ నోవా మూడో స్థానంతోనే సంతృప్తి చెందాడు. 100మీ. పరుగులోలాగే ఈ విభాగంలోనూ జమైకా రన్నర్లు ఒక్క పతకమూ నెగ్గలేకపోయారు. ఆ దేశ స్ప్రింటర్‌ రషీద్‌ (20.21సె) ఏడో స్థానంలో నిలిచాడు.  

కల తీరేలే..: బోల్ట్‌ హవా నడుస్తున్న సమయంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌, ఒలింపిక్స్‌ల్లో పతకాలు సాధించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాని 26 ఏళ్ల డిగ్రాస్‌.. ఇప్పుడు టోక్యో విశ్వ క్రీడల్లో స్వర్ణంతో తన కల నిజం చేసుకున్నాడు. చిన్నతనంలో బాస్కెట్‌బాల్‌ ఎక్కువగా ఆడిన అతను.. పరుగు వైపు మళ్లడం అనుకోకుండా జరిగిందే. స్నేహితులతో పందెం కట్టి పాఠశాల ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ జట్టులో అతను చేరాడు. అప్పుడే అతనిలోని ప్రతిభను గుర్తించిన కోచ్‌ టోనీ షార్ప్‌ అతణ్ని అకాడమీకి ఆహ్వానించాడు. అక్కడి నుంచి అతని పరుగు వేగాన్ని అందుకుంది. అంతర్జాతీయ స్థాయి రన్నర్‌గా మారాడు. 2015 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 100మీ. పరుగులో కాంస్యం గెలిచాడు. అయితే ఆ సమయంలోనే పోటీపడ్డ అన్ని రేసుల్లోనూ బోల్ట్‌ ఛాంపియన్‌గా నిలుస్తుండడంతో డిగ్రాస్‌ వెలుగులోకి రాలేకపోయాడు. రియో ఒలింపిక్స్‌లోనూ 100మీ. పరుగులో కాంస్యం నెగ్గిన అతను.. 200మీ. పరుగులో రజతంతో బోల్ట్‌ వెనకాల నిలిచాడు. ఇప్పుడు బోల్ట్‌ లేని రేసులో ఛాంపియన్‌గా నిలిచి సత్తాచాటాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన