close

తాజా వార్తలు

వైకాపాలోకి కొణతాల?

తెదేపాలో చేరాలన్న నిర్ణయం ఆఖరి నిమిషంలో వాయిదా
అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌  లభించదని తెలియటమే కారణం?

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యక్షుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మళ్లీ వైకాపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన అధికార తెదేపాలో చేరతారంటూ విస్త్రృతంగా ప్రచారం సాగింది. ఇటీవలే రెండుసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు కూడా. అనకాపల్లి ఎంపీ స్థానం కోసం ఆయన ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ స్థానానికి  విశాఖ డెయిరీ ఛైర్మన్‌ అడారి తులసీరావు కుమారుడు అడారి ఆనంద్‌ పేరును దాదాపు ఖరారు చేశారు. దీంతో కొణతాల  తెదేపాలో చేరాలన్న తన నిర్ణయాన్ని ఆఖరి నిమిషంలో మార్చుకున్నట్లు తెలిసింది.

గురువారం అనకాపల్లిలో తన అనుచరులతో భారీసమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వైకాపాలోకి వెళ్లడానికే కొణతాల మొగ్గు చూపుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కొణతాల వైకాపాలోనే ఉన్నారు. విశాఖ పార్లమెంటు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. అప్పుడు తన తమ్ముడు కొణతాల రఘునాథ్‌ను అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయించారు. విశాఖ ఎంపీగా పోటీకి దిగిన వైఎస్‌ విజయమ్మ ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో విజయమ్మ 90 వేల ఓట్ల తేడాతోనూ, అనకాపల్లిలో రఘునాథ్‌ 22 వేల ఓట్ల తేడాతోనూ ఓడిపోయారు. కొణతాల సక్రమంగా పనిచేయకపోవడం కూడా ఈ ఓటమికి కారణమని వైకాపా అధినాయకత్వం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అప్పటి నుంచి కొణతాల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఉత్తరాంధ్ర చర్చావేదిక పేరుతో ఆందోళనలు నడుపుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెదేపాతోనే సంప్రదింపులు జరిపారు. అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌కి ఆడారి ఆనంద్‌ వైపు మొగ్గుచూపిన అధిష్ఠానం కొణతాలకు రాజ్యసభ సీటు ఇస్తామని కూడా చెప్పినట్లు తెలిసింది. అదే సమయంలో వైకాపా నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. దీంతో జగన్‌ను కలవడానికి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.