close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9AM

1. ఆగిన చంద్రయాన్‌ 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జాబిల్లి యాత్ర ‘చంద్రయాన్‌-2’ అనూహ్యంగా ఆగిపోయింది. వాహకనౌక అయిన ‘జీఎస్‌ఎల్వీ మార్క్‌3’లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది. మళ్లీ ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టేది తర్వాత ప్రకటిస్తామని ఇస్రో అధికారులు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఇంగ్లాండ్‌దే ప్రపంచకప్‌

అంచనాలు నిలబెట్టుకుంటూ, ఆశలను నిజం చేసుకుంటూ ఆతిథ్య ఇంగ్లాండ్‌ తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆదివారం నరాలు తెగే ఉత్కంఠమధ్య అత్యంత రసవత్తరంగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌ సూపర్‌ ఓవర్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. నికోల్స్‌ (55), లేథమ్‌ (47) రాణించడంతో మొదట న్యూజిలాండ్‌ 8 వికెట్లకు 241 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌ (84 నాటౌట్‌) అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ను టై చేసింది. 50 ఓవర్లలో సరిగ్గా 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగియగా.. మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఏపీలో రూపాయికే పంటల బీమా!

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా రైతులు నామమాత్రంగా రూపాయి చెల్లించి నమోదు చేయించుకుంటే.. ప్రీమియం మొత్తాన్ని ఏపీ ప్రభుత్వమే ఉచితంగా చెల్లించబోతోంది. దీనికోసం సొంతంగా వ్యవసాయ పంటల బీమా సంస్థనే ప్రారంభించబోతోంది. బ్యాంకుల్లో పంటరుణాలున్న వారితో పాటు.. రుణాలు పొందని రైతులు కూడా నామమాత్ర రుసుము చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. వేళలను బట్టి విద్యుత్తు ఛార్జీలు 

మీరు ఏ సమయంలో ఎక్కువ విద్యుత్తు వాడుతున్నారు? పగటివేళా..రాత్రి వేళా? మీకు భవిష్యత్తులో విద్యుత్తు బిల్లు పంపేప్పుడు ఇలాంటివి అన్నీ గమనంలోకి తీసుకుంటారు. ఉదయం వేళ విద్యుత్తు వినియోగించుకుంటే ఒక ధర..రాత్రివేళైతే మరో ధర ఉంటుంది. కేంద్ర విద్యుత్తు శాఖ రూపొందిస్తున్న కొత్త టారిఫ్‌ విధానం అమలులోకి వస్తే బిల్లులు వేసేప్పుడు ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. జాతీయస్థాయిలో విద్యుత్తు ఛార్జీల నిర్ణయ విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ప్రత్యేక హోదా అసాధ్యం : సుజనా

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌, చంద్రబాబు ప్రధానిగా ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేరని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ప్యాకేజీ సాధించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. భాజపాలో చేరాక తొలిసారి ఆదివారం విజయవాడ వచ్చిన ఆయనకు భాజపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని ఒక కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో, సాయంత్రం విలేకరులతో సుజనా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. వైద్య విద్యార్థులకు భారీ ఉపశమనం 

వైద్య విద్యార్థులకు భారీ ఉపశమనాన్ని కలిగించే అంశమిది. ఎండీ, ఎంఎస్‌ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రస్తుతమున్న నీట్‌-పీజీ పరీక్షలకు బదులుగా ఎంబీబీఎస్‌ చివరి ఏడాదిలో నిర్వహించే ప్రత్యేక పరీక్ష సరిపోతుందని కేంద్ర ఆరోగ్యశాఖ యోచిస్తోంది. జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) బిల్లు ముసాయిదాలో చేర్చిన సవరణలో ఈ అంశాలున్నాయి. బిల్లును త్వరలోనే కేంద్ర మంత్రివర్గ ఆమోదానికి పంపనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఉగ్ర శిబిరాలను మూసేవరకు పాక్‌తో చర్చలుండవు

పాకిస్థాన్‌ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని.. పాక్‌లో ఉగ్రవాద శిబిరాలను మూసేవరకు ఆ దేశంతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తీవ్రవాద శిబిరాలను మూసేసిన అనంతరమే చర్చలపై ఆలోచిస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బర్కత్‌పుర సత్యానగర్‌లో విలేకరులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మదురై మీనాక్షి ఆలయ ప్రాంగణంలో వెలుగుచూసిన నేలమాళిగ

తమిళనాడులోని ప్రఖ్యాత మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం వద్ద జరుగుతున్న నిర్మాణ పనుల్లో నేలమాళిగ వెలుగు చూసింది. ఆలయానికి సమీపంలో కారు పార్కింగ్‌ ఏర్పాటు చేసేందుకు కొద్ది నెలలుగా పనులు జరుగుతున్నాయి. దీనిలోభాగంగా ఇటీవల గుంత తీస్తుండగా 10 అడుగుల పొడవైన రాతి స్తంభం కనిపించిందని, అక్కడ మరింత లోతుగా తవ్వకాలు చేపట్టగా నేలమాళిగ బయల్పడిందని ఆదివారమిక్కడ అధికారులు చెప్పారు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాణి మంగమ్మాళ్‌ కాలంలో దీనిని నిర్మించి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. దేశంలో మొట్టమొదటి ‘ఇథనాల్‌’ అపాచీ ఆర్‌టీఆర్‌‌

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ ఇథనాల్‌తో నడిచే టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 ఎఫ్‌ఐ ఈ100 మోటార్‌ సైకిల్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇథనాల్‌తో నడిచే మొట్టమొదటి మోటార్‌సైకిల్‌ దేశంలో ఇదే కావడం గమనార్హం. ఈ స్పెషల్‌ ఎడిషన్ మొదటగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. దీని ధర రూ. 1,20,000. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. జకోవిచ్‌దే టైటిల్‌

వింబుల్డన్‌ పతక పోరు అదిరిపోయింది.. 2008లో ఫెదరర్‌-నాదల్‌ ఫైనల్‌ తర్వాత ఓ అద్భుత సమరానికి సెంటర్‌కోర్టు వేదికగా నిలిచింది. ఏమైనా ఆడారా ఫెదరర్‌, జకోవిచ్‌! ప్రతి పాయింట్‌కు హోరాహోరీ.. ప్రతి సెట్లోనూ కళ్లుచెదిరే పోరు.. కానీ ఆఖరికి జకోనే గెలిచాడు. ఆదివారం 4.55 గంటల  పాటు సాగిన ఈ మారథాన్‌ తుది పోరాటంలో జకోవిచ్‌ 7-6 (7-5), 1-6, 7-6 (7-4), 4-6, 13-12 (7-3)తో ఫెదరర్‌ను ఓడించి వింబుల్డన్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నొవాక్‌ కెరీర్‌లో ఇది ఐదో వింబుల్డన్‌ టైటిల్‌. మొత్తం మీద 16వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.