
తాజా వార్తలు
టీకా ధ్రువపత్రంపై మోదీ చిత్రమా..?
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తృణమూల్ కాంగ్రెస్
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్రంగా మండిపడింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే టీకా ధ్రువీకరణ పత్రాలపై మోదీ ఫొటోను చిత్రీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
టీకా ధ్రువపత్రాలపై మోదీ చిత్రాన్ని ఉంచడాన్ని తప్పుపడుతూ.. తృణమూల్ సీనియర్ నేత డెరెక్ ఓబ్రీన్ దీనిపై ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దానిలో ఆరోపించారు. అంతేకాకుండా కరోనాపై జరిపిన పోరాటంలో తొలివరుసలో నిలిచిన వైద్య సిబ్బంది, టీకా తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తల కృషిని ఆయన పక్కనపెట్టేశారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల సమయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో మోదీ అనవసర ప్రచారం చేసుకోకుండా చూడాలంటూ తన ఫిర్యాదులో ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు.
మోదీ చిత్రం, ఆయన ఇచ్చిన సందేశంతో కూడిన ధ్రువపత్రం చాలాకాలంగా చెలామణీలో ఉందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొదటి దశలో కరోనా టీకా తీసుకున్నవారికి దాన్ని అందిస్తున్నారని తెలిపాయి. ఇదిలా ఉండగా..అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం ఫిబ్రవరి 26న షెడ్యూల్ విడుదలైంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు పలు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్లు లెక్కించనున్నారు.