close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజకీయాలకు ఇక సెలవు

అనూహ్యంగా ప్రకటించిన శశికళ

టీనగర్‌, న్యూస్‌టుడే: తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిన్నమ్మ శశికళ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. రాజకీయాలకు, ప్రజా జీవితానికి వీడ్కోలు పలికారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని, తనకు పదవులు, అధికారంపై ముందు నుంచీ ఆసక్తి లేదని స్పష్టం చేశారు. జయలలితకు తోడునీడగా ఉంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైల్లో శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. బుధవారం ఆమె విడుదల చేసిన ఓ ప్రకటనలో.. వంద సంవత్సరాలు గడిచినా అన్నాడీఎంకే పాలన కొనసాగాలన్న జయలలిత కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు. అందుకు జయలలిత అభిమానులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ‘జయలలిత పేర్కొన్నట్లుగా ప్రధాన ప్రత్యర్థి డీఎంకే మాత్రమే. ఆ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. జయలలిత ప్రాణాలతో ఉండగా ఆమె కలలను సాకారం చేసేందుకు ఎంతగా కృషి చేశానో, ఆమె మరణానంతరం కూడా అదే స్థాయిలో పని చేశా. రాజకీయాల నుంచి వైదొలగినప్పటికీ జయలలిత పాలన మళ్లీ రావాలని ప్రార్థిస్తున్నా...’ అని శశికళ పేర్కొన్నారు. శశికళ జైలు నుంచి వచ్చాక..  అన్నాడీఎంకేను మళ్లీ ఆమె కైవసం చేసుకొంటారని, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ ఇప్పటికే ప్రారంభించిన ఏఎంఎంకేను విలీనం చేస్తారని ప్రచారం జరిగింది. అన్నాడీఎంకే, భాజపా కూటమిలో ఏఎంఎంకేని కూడా చేర్చుకోవాలని, శశికళను అన్నాడీఎంకేలోకి తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే శశికళ రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించడం గమనార్హం.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు