ఊరికే ₹12.5 కోట్లు వదిలేస్తామా ఏంటి: రైనా

తాజా వార్తలు

Published : 02/09/2020 15:10 IST

ఊరికే ₹12.5 కోట్లు వదిలేస్తామా ఏంటి: రైనా

గట్టి కారణం ఉంది కాబట్టే స్వదేశానికి రాక

శ్రీని నన్ను చిన్న కొడుకులా చూసుకున్నారు

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని ఎన్‌.శ్రీనివాసన్‌ తనకు తండ్రిలాంటి వారని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అన్నాడు. తననెప్పుడూ ఆయన చిన్న కొడుకులా చూసుకొనేవారని పేర్కొన్నాడు. వ్యక్తిగత, కుటుంబ కారణాలతోనే స్వదేశానికి తిరిగొచ్చానని స్పష్టం చేశాడు. ఈ సీజన్‌లోనే మళ్లీ పసుపు రంగు జెర్సీ ధరించినా ఆశ్చర్యం లేదన్నాడు. ఐపీఎల్‌ను వదిలిరావడానికి కారణాలేంటో ‘క్రిక్‌ బజ్‌’కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో రైనా వివరించాడు.


వివాదం లేదు

‘కుటుంబం కోసమే తిరిగి రావాలని నిర్ణయించుకున్నా. వెనువెంటనే నేను దగ్గరుండి చూసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. సీఎస్‌కే కూడా నా కుటుంబమే. మహీ భాయ్‌ నాకెంతో ముఖ్యమైన వ్యక్తి. ఈ నిర్ణయం చాలా కఠినమైందే. సీఎస్‌కే, నాకూ మధ్య ఎలాంటి వివాదం లేదు. గట్టి కారణం లేకుండా ఎవరూ రూ.12.5 కోట్లు వదులుకోరు. అంతర్జాతీయ క్రికెట్‌కు నేను వీడ్కోలు పలికి ఉండొచ్చు. కానీ నాకింకా వయసుంది. మరో నాలుగైదేళ్లు చెన్నైకి ఆడగలను’ అని రైనా అన్నాడు.


తండ్రి మందలించడా?

‘శ్రీనివాసన్‌ నాకు తండ్రిలాంటి వారు. నాకెప్పుడూ అండగానే ఉన్నారు. ఆయన నా హృదయానికి ఎంతో దగ్గర. నన్నాయన చిన్న కొడుకులా చూసుకుంటారు. ఆయన వ్యాఖ్యలన్ని మరో కోణంలోనే చూశారని కచ్చితంగా నాకు తెలుసు. తండ్రి.. తన కొడుకును మందలించకుండా ఉంటారా? మొదట మీడియాతో మాట్లాడినప్పుడు ఆయనకు అసలు కారణం తెలియదు. తెలిసిన వెంటనే నాకు సందేశం పంపించారు. నేనూ మాట్లాడాను. ఈ వివాదానికి ముగింపు పలకాలని మేమంతా కోరుకుంటున్నాం’ అని మిస్టర్‌ ఐపీఎల్‌ చెప్పాడు.


(BCCI Image)

మళ్లీ శిబిరంలోకి!

ప్రస్తుతం భారత్‌లో తాను క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ సాధన చేస్తున్నానని రైనా అన్నాడు. మళ్లీ దుబాయ్‌లో తనను చూసిన ఆశ్చర్యం లేదని అంటున్నాడు. ఐపీఎల్‌-2020ని సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించేందుకు బీసీసీఐ, జట్టు యాజమాన్యాలు ఎంతో కృషి చేస్తున్నాయని తెలిపాడు. క్వారంటైన్‌లో ఆటగాళ్లు గదుల్లోంచి బయటకు రాలేదని రెండు రోజులకోసారి పరీక్షలు చేయించుకున్నామని వివరించాడు. ఇలాంటి వాతావరణంలో మునుప్పెన్నడూ మనం ఉండలేదన్నాడు.


కుటుంబం కోసం ఆందోళన

బయో బుడగలో ఉన్నప్పుడు తన కుటుంబం గురించి ఆందోళన చెందానని రైనా చెప్పాడు. అప్పటికే 20 రోజులు పిల్లలకు దూరమయ్యానని, వారికేమైనా అయితే పరిస్థితి ఏంటని బెంగపడ్డానని తెలిపాడు. తన మేనత్త కుటుంబానికి జరిగింది దారుణాతి దారుణమని పేర్కొన్నాడు. కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చెన్నై ఆటగాళ్లు, సిబ్బందికి వైరస్‌ సోకిందన్నాడు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని