కూలిన ఆశలు..
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 01/08/2021 04:02 IST

కూలిన ఆశలు..

చెదిరిన సింధు పసిడి స్వప్నం
సెమీస్‌లో తై జు యింగ్‌ చేతిలో ఓటమి
బింగ్జియావోతో కాంస్య పతక పోరు నేడు

టోక్యో


బ్యాడ్మింటన్‌
మహిళల సింగిల్స్‌ కాంస్య పతక పోరు
(సింధు × బింగ్జియావో)
   సాయంత్రం 5 గంటల నుంచి

ఇటు సింధు.. అటు పసిడి పోరు.. మధ్యలో ఓ పెద్ద అడ్డంకి!
ఆ అడ్డంకిని దాటితే.. ఆపై ఒలింపిక్స్‌ స్వర్ణమూ సాధిస్తే..?
భారత క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ అథ్లెట్‌గా చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత అవకాశం తెలుగమ్మాయిది!
గ్రూప్‌ దశలో మామూలుగానే ఆడినా.. నాకౌట్‌కు వచ్చేసరికి  అస్త్ర శస్త్రాలన్నీ బయటికి తీసి.. ప్రత్యర్థుల బలహీనతలన్నీ చదివేస్తూ.. అత్యుత్తమ ఆటతో దూసుకెళ్తున్న సింధు.. మరో అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని.. రియో ఘనతను పునరావృతం చేస్తూ స్వర్ణ పోరుకు అర్హత సాధిస్తుందని.. ఆ అరుదైన దృశ్యాలు చూద్దామని ఎన్నెన్నో ఆశలు అంచనాలతో శనివారం మధ్యాహ్నం కోట్లమంది భారతీయులు టీవీలకు కళ్లప్పగించేశారు! ఆమె మ్యాచ్‌ నిర్ణీత సమయానికి ఆరంభం కానందుకు అసహనం చెందారు. కాస్త ఆలస్యంగానైనా ఆట మొదలైంది!

ఆరంభంలో మనమ్మాయిదే పైచేయి.. తొలి గేమ్‌ సగం వరకు తనదే ఆధిక్యం.. ప్రత్యర్థి గట్టి పోటీ ఇస్తున్నా.. ఆధిక్యం కోల్పోకుండా ముందుకు సాగుతున్న సింధు..  తొలి గేమ్‌ గెలిచేస్తుందని..ఆ ఊపులో ఇంకో గేమ్‌ కూడా సాధించేస్తుందని.. ఉత్సాహంతో చూస్తున్నారు అభిమానులు.
కానీ అప్పుడు పడింది ఒక బ్రేక్‌. స్కోరు సమంగా ఉన్న దశలో నెట్‌ దగ్గర సింధు చేసిన ఒక పొరబాటుతో మలుపు తిరిగింది మ్యాచ్‌. తొలిసారి ఆధిక్యం కోల్పోయిన భారత షట్లర్‌కు.. పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు ప్రత్యర్థి! అక్కడిదాకా సమవుజ్జీల పోరులా ఉన్న మ్యాచ్‌ కాస్తా.. ఏకపక్షం అయిపోయింది. ఇక ప్రత్యర్థికి అందుకోవడానికి పోరాటమే తప్ప.. సింధులో గెలుపు ధీమానే లేదు. అంతకంతకూ ఆత్మవిశ్వాసం కోల్పోయి తప్పుల మీద తప్పులు చేస్తుంటే ఇక్కడ అభిమానుల్లో తీవ్ర అసహనం! ప్రత్యర్థి ఆధిక్యంతో దూసుకెళ్తున్నా..విజయానికి అత్యంత చేరువగా వెళ్లినా.. సింధు పుంజుకుంటుందని, మ్యాచ్‌ తిరుగుతుందనే ఆశ మాత్రం చావలేదు. కానీ ఆ ఆశల్ని కూల్చేస్తూ తై జు కొట్టిన స్మాష్‌తో అంతా నిశ్శబ్దం!

సువర్ణావకాశం చేజారింది. ఇక కాంస్యం కోసమే సింధు పోరాటం!


 

భారత స్టార్‌, ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు కల చెదిరింది. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలన్న ఆమె స్వప్నం సాకారం కాలేదు. కోట్లాది మంది భారతీయుల అంచనాలు.. ఎలాగైనా స్వర్ణం సాధించాలన్న ఆశల నడుమ సింధు తీవ్ర ఒత్తిడికి లోనయింది. ఒలింపిక్స్‌ సెమీఫైనల్లో పరాజయంపాలై పసిడి రేసుకు దూరమైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ఆరో సీడ్‌ సింధు 18-21,  12-21తో ప్రపంచ నంబర్‌వన్‌, రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమిపాలైంది.  ఆదివారం కాంస్య పతక పోరులో హి బింగ్జియావో (చైనా)తో సింధు తలపడనుంది.
క్వార్టర్‌ఫైనల్‌ వరకు అద్భుతంగా ఆడిన సింధు సెమీస్‌లో తడబడింది. క్వార్టర్స్‌లో కలిసొచ్చిన నెట్‌ గేమ్‌.. సెమీస్‌లో మైనస్‌ అయింది. ప్రస్తుతం మహిళల బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా పేరున్న తై జు వూహాత్మకంగా ఆడింది. సింధును దూకుడుగా ఆడనివ్వలేదు. ర్యాలీ గేమ్‌పై పట్టు దొరకనీయలేదు. భారత స్టార్‌కు ఏమాత్రం అవకాశమే ఇవ్వకుండా చెలరేగింది.  తై జు కొలిచినట్లుగా షాట్‌లు కొడుతూ అనుకున్న ప్రదేశంలోకి షటిల్‌ను పంపింది. తొలి గేమ్‌లో షటిల్‌పై నియంత్రణ కనబరిచిన సింధు.. రెండో గేమ్‌లో అనవసర తప్పిదాలతో ప్రత్యర్థి ముందు తేలిపోయింది.

కష్టపడినా..: ఒక షాట్‌ను రెండు, మూడు రకాలుగా ఆడగలిగే తై జుపై తొలి గేమ్‌ గెలవడం అత్యంత కీలకం. అందుకోసం సింధు చాలా కష్టపడింది కూడా. తొలి గేమ్‌లో స్మాష్‌తో ఖాతా తెరిచిన తై జు.. బాడీ స్మాష్‌తో రెండో పాయింటు సాధించింది. 0-2తో వెనుకబడిన సింధు వెంటనే పుంజుకుంది. డ్రాప్‌ షాట్లు, క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌లు సంధిస్తూ 7-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తై జు అనవసర తప్పిదాలు సింధుకు కలిసొచ్చాయి. 11-9తో సింధు ముందంజ వేసింది. అయితే తై జు సైతం గొప్పగా ఆడుతూ పాయింట్లు రాబట్టడంతో తొలి గేమ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. 14-14,  16-16, 17-17తో పాయింట్లు సమమవుతూ వెళ్లాయి. ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో  ప్రతి పాయింటుకు ఉత్కంఠ పెరుగుతూ పోయింది. ఈ సమయంలో తై జు కొట్టిన స్మాష్‌ నెట్‌ను   తాకి సింధు కోర్టులో పడటంతో ప్రత్యర్థి 18-17తో ఆధిక్యం సంపాదించింది. ఆ వెంటనే సింధు పాయింట్లను సమం చేసినా.. తై జు జోరు   తగ్గలేదు. క్రాస్‌కోర్ట్‌ షాట్‌, ్ఞస్మాష్‌ సంధించి  21-18తో తొలి గేమ్‌ గెలుచుకుంది.

ఒత్తిడిలో..: తొలి గేమ్‌లో తై జును నిలువరించలేకపోయిన సింధు రెండో గేమ్‌లో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. అంతెత్తుకు ఎగిరి స్మాష్‌తో ఖాతా తెరిచింది. అటాకింగ్‌ గేమ్‌ ఆడుతూ ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టాలని చూసింది. అయితే మానసికంగా అత్యంత దృఢంగా కనిపించిన తై జు.. సింధు వలలో చిక్కలేదు. మంచి ప్లేస్‌మెంట్స్‌తో పాయింట్లు రాబడుతూ వెళ్లింది. తై జు జోరు చూపిస్తుండటంతో సింధు తీవ్ర ఒత్తిడికి లోనయింది. అనవసర తప్పిదాలు చేయడంతో ప్రత్యర్థి పాయింట్లు పెరుగుతూ వెళ్లాయి. ఒత్తిడిలో ఉండటంతో సింధు స్మాష్‌లు కూడా కోర్టు బయటకు వెళ్లాయి. దీంతో సింధు ఏకాగ్రత, లయ పూర్తిగా దెబ్బతిన్నాయి. 11-7తో ఆధిక్యంలోకి వెళ్లిన తై జు చూస్తుండగానే 17-9తో మరింత ముందుకెళ్లింది. పాయింటు పాయింటుకు తై జు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. డ్రాప్‌ షాట్‌తో 20-12తో మ్యాచ్‌కు చేరువైన తై జు.. క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌తో సింధు ఆశలకు తెరదించింది.   21-12తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను దక్కించుకుంది.


మలుపు అక్కడే

40 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌లో సింధు బాగానే ఆడింది. ప్రత్యర్థి అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉన్నా.. సింధు కూడా ఎక్కడా తగ్గలేదు. ఏ దశలోనూ గేమ్‌ను వదులుకోలేదు. 17-17తో స్కోరు సమమైనప్పుడు ఇద్దరు క్రీడాకారిణులు ర్యాలీ ఆడారు. తై జు బలంగా బాదిన హాఫ్‌ స్మాష్‌ నెట్‌ను తాకుతూ సింధు కోర్టులో పడింది. ఈ పాయింటు తై జు ఆత్మవిశ్వాసాన్ని పెంచగా.. సింధును మానసికంగా కుంగిపోయేలా చేసింది. అక్కడ్నుంచి సింధు లయ కోల్పోయింది. 18-17తో ముందంజ వేసిన తై జులో సానుకూల దృక్పథం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత పాయింటు కోల్పోయి 18-18తో స్కోరు సమమైనా తై జు వెనక్కి తగ్గలేదు. షటిల్‌పై నియంత్రణతో షాట్లు బాది తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. అక్కడ్నుంచి ఆటంతా తై జుదే. నెట్‌ గేమ్‌ దగ్గర సింధుపై తై జు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. నెట్‌ దగ్గర షటిల్‌ను ఇటు నుంచి అటు లాఘవంగా తరలిస్తూ సింధును ఇబ్బంది పెట్టింది. ఒకదశలో ఇదే షాట్‌ను సింధు ప్రయత్నించి విఫలమైంది. తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన సింధు తన ఫేవరెట్‌ స్మాష్‌లను సమర్థంగా ఆడలేపోయింది.


సెమీస్‌లో ఓడటం బాధగా ఉంది. చేయాల్సిందంతా చేశా. ఉత్తమ ఆటతీరు కనబరిచా. చివరి వరకు పోరాడా. కాని ఇది నా రోజు కాదు. రెండో గేమ్‌లో ప్రత్యర్థికి ఎక్కువ ఆధిక్యం ఇవ్వడం నష్టం చేసింది. అయినా కూడా పోరాడా. ఏ క్షణంలోనైనా గేమ్‌ మారొచ్చు. ఒలింపిక్స్‌లో ఆఖరి పాయింటు వరకు పోరాడాలి. నేను అదే పని చేశా. తై జు నైపుణ్యానికి తగ్గట్లు సన్నద్ధమయ్యా. ఒలింపిక్స్‌ సెమీస్‌లో పోటీ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. పాయింట్లు సులువుగా రావు. ఈరోజు విజయం వైపు లేనంతే. ఆదివారం అత్యుత్తమ  ప్రదర్శన కనబరుస్తా.  

- సింధు


‘‘సింధు స్వర్ణం సాధించాలన్న పట్టుదలతోనే బరిలో దిగింది. కాని తై జు వ్యూహాత్మక ఆటతో సింధును ఓడించింది. తొలి గేమ్‌ గెలుచుంటే ఫలితం మరోలా ఉండేది. రెండో గేమ్‌లో సింధు ఆట లయ తప్పింది. ర్యాలీలు ఎక్కువగా ఆడలేకపోయింది.   కోచ్‌ పార్క్‌ పట్ల సంతృప్తిగా ఉన్నాం’’.

- సింధు తండ్రి రమణ


ఇక కాంస్యంపై గురి

స్వర్ణం స్వప్నం సాకారం చేసుకోలేకపోయిన సింధు ఆదివారం కాంస్య పతకంపై గురిపెట్టింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకం సాధించి మరే భారత క్రీడాకారిణి అందుకోని ఘనతను సొంతం చేసుకోవాలని సింధు భావిస్తుంది.  2016 రియో ఒలింపిక్స్‌లో సింధు రజతంతో మెరిసిన సంగతి తెలిసిందే. ఆదివారం కాంస్య పతకం కోసం జరిగే పోరులో 8వ సీడ్‌ హి బింగ్జియావో (చైనా)తో సింధు తలపడనుంది. బింగ్జియావోపై సింధుకు మంచి రికార్డు లేకపోవడం ప్రతికూలాంశం. ఇప్పటి వరకు వీరిద్దరు 15 సార్లు తలపడగా.. తొమ్మిదింట్లో ప్రత్యర్థి, ఆరింట్లో సింధు నెగ్గారు.  ఫైనల్లో చెన్‌ యుఫెయ్‌ (చైనా)తో తై జు యింగ్‌ పోటీపడనుంది.


 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన