ఆమె వెనక అతను
Array ( [0] => stdClass Object ( [video_type] => 1 [video_short_link] => UvrHUAximog ) ) 1

ప్రధానాంశాలు

Updated : 02/08/2021 07:33 IST

ఆమె వెనక అతను

ఈనాడు క్రీడావిభాగం

లింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ కాంస్య పతక పోరులో గెలవగానే ఒక్కసారిగా సింధు విజయ నాదం చేసింది. ఆ వెంటనే అక్కడున్న కెమెరాలన్నీ కోర్టు బయట ఓ మూల వైపు తిరిగాయి. అప్పటికే అక్కడ ఓ వ్యక్తి పట్టరాని సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నాడు. అతని దగ్గరికి వెళ్లిన సింధు.. ‘‘మనం సాధించాం’’ అనే అర్థం వచ్చేలా అతణ్ని హత్తుకుంది. అతనెవరో కాదు.. పార్క్‌ తే సంగ్‌.. సింధు కోచ్‌. కొన్నేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలంగా ఈ పతకం ఆమెకు దక్కడంతో 42 ఏళ్ల పార్క్‌ ఆనందం పట్టలేకపోయాడు. సింధు విజయం వెనక అతనిది కీలక పాత్ర. 2019 నుంచి ఆమెకు శిక్షణ ఇస్తున్న అతను.. ఆమె ఆటలోని లోపాలను సరిచేస్తూ సాగుతున్నాడు. ఆమె డిఫెన్స్‌లో బలహీనంగా ఉండడంతో.. ఆ విభాగంలో ఎక్కువ దృష్టి పెట్టి కావాల్సిన మార్పులు తీసుకొచ్చాడు. కోర్టులో చురుగ్గా కదిలేలా ఆమెకు తర్ఫీదునిచ్చాడు. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సింధును ఛాంపియన్‌గా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. కరోనా విరామంతో కోల్పోయిన లయను తిరిగి అందుకుని.. మునుపటిలా రాణించేలా ఆమెకు ప్రత్యేక శిక్షణ అందించాడు. ఒకప్పటి దక్షిణ కొరియా బ్యాడ్మింటన్‌ ఆటగాడైన పార్క్‌.. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్‌ వరకూ వెళ్లగలిగాడు. అదే ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచాడు. 2002 ఆసియా క్రీడల్లో పసిడి సాధించిన పురుషుల టీమ్‌లో అతనూ ఓ సభ్యుడు. ఆ తర్వాత కోచ్‌గా మారిన అతను వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు. 2013 నుంచి 2018 వరకూ కొరియా జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత భారత క్రీడా ప్రాధికార సంస్థ అతడిని కోచ్‌గా నియమించింది. ఆటపై విస్తృతమైన జ్ఞానం, గొప్ప అవగాహన ఉన్న అతను.. ఆ తర్వాత సింధు ఆటను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నాడు. ఎప్పటికప్పుడూ ఆమె ఆటలో మార్పులు తెస్తూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాడు. ప్రత్యర్థుల ఆటతీరును పసిగట్టి.. పక్కా ప్రణాళికలు రూపొందించి సింధు విజయాల్లో కీలకంగా మారాడు. అతని శిక్షణలో తన ఆటతీరు కచ్చితంగా మెరుగవుతుందన్న సింధు నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఒలింపిక్స్‌కు సమర్థంగా సన్నద్ధమయ్యే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గచ్చిబౌలి స్టేడియంలో పార్క్‌ పర్యవేక్షణలో సింధు ప్రాక్టీస్‌ సాగింది. ఒకేసారి ముగ్గురు లేదా నలుగురు కుర్రాళ్లను కోర్టులో మరో వైపు ఉంచి.. ఆమెతో ఆడించేవాడు. సింధును అయోమయంలోకి గురిచేసేలా వివిధ రకాల షాట్లు ఆడమని ఆ కుర్రాళ్లకు చెప్పి.. వాటిని తిప్పికొట్టేలా ఆమెకు మెళకువలు నేర్పాడు. నెట్‌ దగ్గర షటిల్‌ను సమర్థంగా ఆడేలా శిక్షణ ఇచ్చాడు. ఆమెకు శిక్షణ ఇవ్వడం కోసం ఇక్కడే ఉండిపోయిన అతను గతేడాది ఫిబ్రవరి నుంచి ఒక్కసారి కూడా తన కుటుంబాన్ని చూసేందుకు దక్షిణ కొరియా వెళ్లలేదు. తన నాలుగేళ్ల తనయనూ కలవలేదు. అయితే ఆ త్యాగాలకు ఇప్పుడు అతనికి ఫలితం దక్కింది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన