close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గూటికి చేరిన గువ్వ

- జ్యోతి సుంకరణం

‘నాన్నా...’’ అంటూ ఆర్తిగా, మార్దవంగా వినబడ్డ పిలుపుకి, అప్పటిదాకా వీధి అరుగు మీదనే కూర్చుని కూర్చుని ఇక సంధ్య చీకట్లు పడడంతో ఇంట్లోకి పోబోతున్న రామన్న ఒక్కసారి ఉలిక్కిపడి గుమ్మం వైపు చూశాడు. అక్కడ ఎవరో నిలబడినట్టుగా మసక మసగ్గా కనిపించడంతో నుదుటి మీద అరచేతిని ఉంచుకుని కళ్లు చిట్లించి చూశాడు. ఇంకా అలాగే ఎవరో ఉన్నట్లే కనపడుతుండడంతో, ‘‘హు... ఈ భ్రమ నేను పాడె ఎక్కేదాకా పోయేట్లు లేదు’’ అని ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి, ఇంట్లోకి వెళ్లబోయాడు. అంతలో ‘‘నాన్నా... నాన్నా నేనే, మీ గోపీని’’ అంటూ మళ్లీ ఒకసారి వినపడడంతో, తన కళ్లూ, చెవులూ తనని అంత మోసం ఎందుకు చేస్తున్నాయో అర్థంకాని సందిగ్ధావస్థలో పడి, కళ్లు నులుముకుంటూ మసగ్గా కనపడుతున్న ఆ ఆకారాలకు కాస్తంత దగ్గరగా వచ్చి, జేబులో ఉన్న కళ్లద్దాలను ఒకసారి తుడుచుకుని పెట్టుకుని చూశాడు. ఇప్పుడింక అక్కడెవరూ కనపడలేదు, కానీ ఎవరో అక్కడ ఉన్న ఊహ మాత్రం తనని విడిచిపెట్టకపోవడంతో ‘‘ఏంటి, ఇయాల గోపీగాడి పుట్టినరోజు కూడా కాదుకదా ఇంతలాగా భ్రమ పుట్టేస్తోంది’’ లోపలికి అనుకుంటున్నాను అనుకుంటూ పైకే అనేశాడు ఆ మాటలని. ‘‘నాన్నా... నీ భ్రమకాదు నాన్నా, నిజంగా నేనే వచ్చాను’’ అంటూ దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో మాటలు వినపడడంతో, గాబరాగా, కంగారుగా వణుకుతున్న చేతులతో కళ్లజోడుని తీసి గట్టిగా పై కండువాతో తుడిచే ప్రయత్నం చెయ్యబోయి, అంతలోనే ఆగి తుడుచుకోవాల్సింది కళ్లద్దాలను కాదు, ధారాపాతంగా వర్షిస్తున్న తన కళ్లను అని గుర్తించి, గట్టిగా కళ్లను తుడుచుకుని అప్పుడు చూశాడు. ఏనాడో పదిహేనేళ్ల వయసులో ఇల్లొదిలేసి వెళ్లిపోయిన తన కొడుకు... మళ్లీ ఇన్నాళ్ళకి... నిజమా, అబద్దమా?... ఒకవేళ నిజమైతే... ‘ఏరా... ఇన్నాళ్లకి మేము నీకు గుర్తొచ్చామా, ఇన్నేళ్లు ఏమైపోయావ్‌, ఎక్కడున్నావ్‌, కనీసం మేము చచ్చామో, బతికామో కూడా నీకు తెలుసుకోవాలనిపించలేదా?...’ ఇలా చాలా చాలా అడగాలనిపించినా... ఏది ముందో, ఏది వెనుక అడగాలో, అసలు అడగాలో లేదో... ఆనందమో, బాధో, ఉక్రోషమో, ఆక్రోశమో... అసలు తనలో తనకు కలుగుతున్న భావాలేంటో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఒకే ఒక్క అరుపు అరిచాడు ‘‘ఒసేయ్‌... రత్నం ఎవరొచ్చారో చూడు’’ అంటూ. ఎప్పుడొచ్చిందో ఏమో మరి ఆసరికే అక్కడికి వచ్చిన రత్నం చేష్టలుడిగి అలా చూస్తూ నిలబడిపోయింది.
‘‘అమ్మా’’ అన్న పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిపడి అప్పుడు చూసింది కొడుకునీ, ఆ పక్కనే ఇద్దరు చిన్న పిల్లలతో నిలబడ్డ ఓ ఆడ మనిషిని. ‘‘మీ కోడలూ, మనవలు అమ్మా’’ అంటూ వాళ్లని చూపిస్తూ తల్లిదండ్రులిద్దరికీ కాళ్లకి దండం పెట్టబోయాడు గోపీ. వెంటనే ఆ ప్రయత్నాన్ని ఆపి, ఆరాటంగా ఒక్కసారి కొడుకుని దగ్గరగా లాక్కుని తన బాహుబంధాలతో గట్టిగా చుట్టేసుకుని, భోరుమని చంటి పిల్లాడిలా కుళ్లి కుళ్లి ఏడ్చేశాడు రామన్న. తండ్రిని అలా చూసి, గోపీ కూడా తండ్రిని గట్టిగా పట్టుకుని తనివి తీరా ఏడ్చేశాడు. వాళ్లిద్దరినీ అలా చూసిన రత్నం ‘‘ఏరా... అన్నది నాన్నే కదా, నాలుగు రోజులు ఇంట్లోనే అలిగి కూర్చుంటే పోయేదానికి, మమ్మల్ని ఇన్నాళ్ళొదిలేసి పోతావురా’’ అంటూ తను కూడా ఘొల్లుమంది. ఏమయ్యిందో ఏమిటో తెలియని చిన్న పిల్లలు భయపడి బిక్క మొహాలు వేశారు. అది చూసి గోపీ భార్య, పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుంది. అది గమనించిన రత్నం తనని తాను సంబాళించుకుని, మనవలనీ కోడలినీ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. అప్పుడు గోపీ ‘‘అమ్మా... అసలేమయ్యిందంటే’’ అంటూ ఏదో చెప్పబోతుంటే, మధ్యలోనే ఆపేసి ‘‘అన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ఎప్పుడు తిన్నారో, ఏమో అందరూ అలా నీరసంగా వేలాడిపోయి ఉన్నారు, ముందు స్నానాలు చేసి భోజనాలు చెయ్యండి. పదండి... పదండి లోపలికి’’ అంటూ ఇంట్లోకి దారి తీసింది రత్నం.

* * *

ఉడుకుడుకు నీళ్ల స్నానం, ఆపై కడుపునిండా వేడి వేడి భోజనం పడడంతో, అసలే అలిసిపోయిన శరీరాలేమో, ఒళ్లు మరిచి నిద్రపోయారు గోపీ భార్యా పిల్లలూ. చాలా రోజుల తర్వాత అలా హాయిగా ఆదమరిచి నిద్రపోతున్న భార్యా పిల్లలను సంతృప్తిగా చూసుకున్నాడు గోపి. నిజానికి తనూ అలా నిద్రపోవాల్సినవాడే కానీ తనువు కుదుట పడినట్లు మనసు కుదుట పడకపోవడంతో నిద్ర పట్టక అసహనంగా అటూ ఇటూ దొర్లుతూ గత జ్ఞాపకాల్లోకి జారుకున్నాడు.

* * *

వీధి మలుపు తిరుగుతూనే, ఇంటి ముందే నాన్న నించుని ఉండడం కనిపెట్టిన గోపీ, తండ్రి కంట పడకుండా జాగ్రత్తగా పెరటి గోడ దూకి లోపలికి పోయి సరాసరి వంటింట్లోకి వెళ్లిపోయాడు. అక్కడేదో పని చేసుకుంటున్న రత్నం, గోపీని చూస్తూనే ‘‘హార్నీ... ఎక్కడికి పోయావురా పొద్దుటినుండి, బడిలో లేవంటగా, మీ నాన్నకి, మీ మాస్టారు కనిపించి చెప్పారంట...’’ అంటూ ఇంకా ఏదో అనబోతున్న తల్లి నోటిని చేత్తో మూసేస్తూ ‘‘హుష్‌... గట్టిగా అరవద్దు... నాన్న వింటాడు, నేను కనబడితే ఉతికేస్తాడు’’ అన్నాడు గొంతు తగ్గించి రహస్యంగా. ‘‘సర్లే సర్లే... ఇంతకీ బడి మానేసి ఎక్కడికి పోయావ్‌’’ అంటూ కొడుకు చేతిని, నోటిమీంచి తీసేస్తూ అడిగింది రత్నం. ‘‘నేనెక్కడికి వెళ్తానమ్మా, బడిలోనే ఉన్నాను. ఊరికే సాయంత్రం బడి అయిపోయాక, ఆ కొండబాబుగాడు ఆడుకుందాం అంటే వెళ్లానంతే’’ అని చెప్పాడు. ‘‘మరి మీ నాన్నకి ఆ మాస్టారు నువ్వు రోజూ బడికి రావట్లేదని చెప్పాడంట’’ అనుమానంగా కొడుకుని చూస్తూ అడిగింది రత్నం. ‘‘అబ్బా... ఆ మాస్టారుకి నేనంటే పడదమ్మా’’ చెప్పాడు గోపీ. ‘‘అవునా... ఎందుకూ’’ ఆశ్చర్యపోతూ అడిగింది రత్నం. ‘‘ఎందుకంటే, వాళ్ల అబ్బాయి కంటే నేను బాగా చదువుతాననీ, ఎక్కువ మార్కులు నాకే  వస్తాయనీ ఆయనకి నేనంటే కుళ్లు, అందుకే నాన్న కనిపించినప్పుడల్లా నా మీద ఏవేవో చెప్పేసి, నాన్నకి నామీద కోపం వచ్చేలా చేస్తుంటాడు’’ అప్పటికప్పుడు చక్కగా కథ అల్లేసి వాళ్లమ్మకి చెప్పేశాడు గోపీ. నమ్మేసింది కొడుకుని రత్నం. ‘‘అయ్యో... ఇదేం పోయేకాలం, మాస్టారయి ఉండీ...’’ అంటూ మెటికలు విరుస్తూ సాగదీస్తున్న తల్లిని ‘‘అవునమ్మా, కానీ నాన్న ఆయన మాటలే నమ్మి నన్ను కొట్టేస్తున్నాడమ్మా, అందుకే అన్నం తినేసి వెళ్లి పడుకుంటా, నాన్న అడిగితే ఎప్పుడో ఇంటికి వచ్చేశానని చెప్పు. దా తొందరగా, నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా’’ అంటూ తల్లిని తొందర పెట్టేశాడు గోపీ.
తండ్రి ఎక్కడ వచ్చేస్తాడోనని, గబగబా అన్నం తింటున్న కొడుకు వైపు జాలిగా చూస్తూ ‘‘ఒరేయ్‌... నిదానంగా తినరా, మీ నాన్నకి నే చెపుతాలే...’’ అంటుండగానే, ‘‘ఏరా... బడి ఎగ్గొట్టి, ఊరంతా గాలి తిరుగుళ్లు తిరిగి, మళ్లీ ఏమీ ఎరగనట్టు దొంగచాటుగా ఇంట్లోకి దూరతావ్‌రా దొంగవెధవా... ఉండు నీ పని చెప్తా’’ అంటూ అక్కడే గోడకి జారబెట్టి ఉన్న కర్రని అందుకుని కూర్చుని అన్నం తింటున్న గోపీ చొక్కాను పట్టుకుని గుంజాడు రామన్న కోపంగా. అంతే వెంటనే ఆ చేతిని లాగి తోసేసి ‘‘అయ్యో... అయ్యో, కంచం ముందు కూర్చున్నవాణ్ణి కొడతారా ఎవరైనా, అయినా ఇప్పుడు వాడంత కాని పనేమి చేశాడని’’ అంటూ భర్తకు అడ్డు వచ్చింది. ‘‘కొట్టాలా, నరకాలా వీణ్ణి, బుద్ధిగా చదువుకోమని బడికి పంపిస్తే, వెళ్లడం మానేసి ఊళ్లో ఉన్న ఆ గాలి వెధవలందరితో తిరుగుతూ, చీట్ల పేకలు ఆడడం, బీడీలు కాల్చడం మరిగాడంట. ఆ మాస్టారు వీడి గురించి చెపుతుంటే తల కొట్టేసినట్లయ్యింది’’ అని చెప్పాడు ఆవేశంగా రామన్న. ‘‘ఆ... ఆ మాస్టారు అన్నీ అలాగే లేనిపోనివి కల్పించి చెపుతాడు, ఆ మాటలు నమ్మి పిల్లాడ్ని కొట్టొద్దు’’ అంటూ చేతిలోని కర్రను లాగేసుకుని, వాకిట్లోకి విసిరేసింది రత్నం. ‘‘లేనిపోనివి చెప్పాల్సిన అవసరం అయనకేముంటుంది. ‘ఉన్న ఒక్కగానొక్క కొడుకు తగలడిపోకుండా చూసుకోండి’ అని చెపుతాడు. అసలు నువ్వు తప్పుకో, నాలుగు ఉతికేస్తే దెబ్బకి దార్లో పడతాడు’’ అంటూ భార్యని తోసి, కొడుకుని కొట్టడానికి ముందుకు పోబోయాడు. ‘‘ఇదిగో... వాడి మీద చెయ్యి పడిందో నన్ను చంపుకు తిన్నంత ఒట్టే’’ అంటూ రత్నం మళ్లీ అడ్డం పడిపోవడంతో ‘‘ఛీ... ఛీ ఇలా వాడిని వెనకేసుకురా, మొత్తానికి ఎందుకూ పనికి రాకుండా పోతాడు’’ అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు రామన్న. ఇలా తల్లి అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని, తండ్రికి దొరకకుండా తప్పించుకుంటూ, అల్లరిచిల్లరిగా అలాగే రోజులు గడిపేశాడు గోపీ.
ఉన్నట్టుండి ఊళ్లో ఒకరోజు పొద్దున్నే బయటకి వెళ్లి, వెళ్లిన కాసేపటికే ఉరుకుల పరుగుల మీద వచ్చేసి ‘‘ఏడీ... వీడేడి ఇంట్లోనే తగలడ్డాడా లేదా’’ అంటూ రామన్న కొడుకు మీద రంకెలు వెయ్యడం మొదలుపెట్టాడు. ఆ అరుపులకి వంట చేస్తున్న రత్నం బయటకి వచ్చి ‘‘రెండు రోజులుగా వాడికి జ్వరం కదా, ఇంట్లోనే ఉన్నాడు ఏమయ్యిందిప్పుడు’’ అంటూ అడిగింది. ‘‘ఏమవ్వాలి... అనుకున్నంతా అయ్యింది, ఆ రెడ్డిగారింట్లో రాత్రి దొంగతనం జరిగిందట. ఆ దొంగ వెధవల్లో ఒకడు, వీడితో తిరిగే ఆ కొండబాబు. అందుకే ఇప్పుడు పోలీసులు, వాడి స్నేహితులందరినీ అనుమానించి పట్టుకుపోతున్నారు. అయ్యింది అనుకున్నంతా అయ్యింది, పోలీసులు మన ఇంటికి వస్తే పరువు మొత్తం పోయినట్లే. ఎంత మొత్తుకున్నాను... పోనీ చదువు వంట బట్టకపోతే నాతో వచ్చి పొలం పనులు నేర్చుకోరా, ఆ చెడు స్నేహాలు మానేసి బాగుపడరా అని... చెపితే వింటేనా. అసలు ఇంట్లో ఉన్నాడా, చూడు నీ కళ్లు గప్పి బయటకి పోయాడో’’ అని అరిచాడు రామన్న. ‘‘ఛీ... ఛీ... ఏదో చిన్నతనం వలన, బాధ్యత తెలీక అలా కాస్త అల్లరి తిరుగుళ్లేకానీ, అలా దొంగతనాలవీ చేసే బుద్ధిలేదు వాడికి...’’ అంటూ రత్నం చెపుతుంటే మధ్యలోనే వచ్చిన గోపీ ’’నాన్నా చాలా రోజులనుండి నేను కొండబాబుతో తిరగట్లేదు. అయినా నేను ఈ వారం అంతా ఎక్కడికీ వెళ్లలేదు ఇంట్లోనే ఉన్నాను’’ అంటూ చెప్పాడు. ‘‘ఛీ.. వెధవా నోరు మూసుకో, అన్నీ అబద్ధాలే చెపుతావ్‌. ఏమో నన్నూ మీ అమ్మనీ కన్నుగప్పి ఎప్పుడు బయటకి పోయావో ఎవడికి తెలుసు. ఇప్పటివరకూ అల్లరి చిల్లరి తిరుగుళ్లే అనుకున్నాను, ఇక ఇప్పుడు ఈ దొంగతనాలూ, లూటీలు కూడా మొదలు పెట్టావన్నమాట. నా కడుపున చెడబుట్టావు కదరా’’ అంటూ చేతికి దొరికినది పట్టుకుని భార్య అడ్డమొచ్చినా వినకుండా గొడ్డుని బాదినట్లు బాదేశాడు కొడుకుని రామన్న.

తగిలిన దెబ్బలకి నూనె రాస్తున్న తల్లితో ‘‘అమ్మా... నువ్వైనా నన్ను నమ్ముతావా’’ అంటూ వెక్కిళ్ల మధ్య అడిగాడు. ‘‘ఇన్నాళ్ళూ నువ్వు చెప్పినవన్నీ నిజాలయితే ఇది నిజం, ఇన్నాళ్లూ నువ్వు నాతో చెప్పినవన్నీ అబద్ధాలయితే ఇది అబద్ధం అంతే’’ అంటూ లేచి వెళ్లిపోయిన తల్లిని చూసి ఒక్కసారే ఉక్రోషం వచ్చేసింది గోపీలో. ఆలోచించాడు... ఆలోచించాడు... ఆలోచిస్తున్నకొద్దీ ఉక్రోషం స్థానంలో భయం కలగడం మొదలుపెట్టింది. నిజంగానే పోలీసులు వచ్చి తనని తీసుకుపోతే... అమ్మానాన్నలే తనని నమ్మట్లేదు పోలీసులు నమ్ముతారా? ఇలా రకరకాలుగా ఆలోచించి, ఏమి చెయ్యాలో తెలియక కాస్త చీకటి పడడంతోనే ఇంట్లోంచి బయటికి వచ్చి దొరికినదేదో ఎక్కేసి, టౌన్‌కి వచ్చేసి స్టేషన్‌లో బయలుదేరుతున్న ట్రైన్‌ ఎక్కేశాడు. ఒక నెల రోజులపాటు, ఏది కనబడితే అది ఎక్కేయడం ఎవరైనా దించేస్తే దిగిపోవడం ఏదైనా దొరికితే తినడం లేకపోతే నీళ్లు తాగి కడుపు నింపుకోవడం... ఇలా సాగింది. అదృష్టవశాత్తూ ఒక పకోడి బండి యజమాని గోపీని చూసి జాలిపడి ప్లేట్లు కడిగే పని ఇచ్చాడు. అలా కాస్త దార్లో పడ్డాడు. ఒక ఐదారు సంవత్సరాలు అలాగే గడిచిపోయాక, తనతోపాటూ పనిచేసే లక్ష్మిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సొంతంగా ఓ పకోడి బండిని పెట్టుకుని కాస్త జీవితంలో నిలదొక్కుకుని ఇద్దరు పిల్లలని కూడా కన్నారు. ఇద్దరూ కలిసి కష్టపడితే రోజులు బాగానే గడిచిపోతున్నాయి అని ధీమాగా ఉన్నంతలో... అదిగో అప్పుడొచ్చిపడింది ‘కరోనా’ అనే ఉపద్రవం వాళ్ల జీవితాల మీద. దాని ధాటికి ప్రపంచం మొత్తం తలకిందులు అయ్యిందన్న సంగతి వారికెంత తెలుసో తెలియదు కానీ, వారి జీవితాల చుట్టూ ఓ శూన్యాన్ని నింపిందన్నది మాత్రం వాళ్లకి బాగా తెలిసింది. ఓ నెల రోజులు ఇంట్లో ఉన్న చిన్న చితకా సరుకులతో కాలక్షేపం చేశారు. ఇక ఆ తర్వాత మొదలయ్యింది అసలు కష్టం అంతా. ఒక రోజు మూడేళ్ల కూతురు కడుపునొప్పితో ఏడవడం మొదలుపెట్టింది, విలవిల్లాడిపోయి ఏడుస్తున్న కూతుర్ని చూసిన గోపీకీ లక్ష్మికీ అది ఎందుకు ఏడుస్తుందో తెలిసినా ఏమి చెయ్యాలో తెలియలేదు ఇద్దరికీ. ‘‘చూడోసారి ఏ డబ్బాలో అయినా ఏమైనా ఉన్నాయేమో’’ ఆశ చావక అడిగాడు గోపీ. ‘‘ఉన్న నాలుగు డబ్బాలని ఎంతకని చూస్తాం, ఎన్ని రోజులని చూస్తాం’’ అంటూనే మళ్లీ ఓసారి అన్నీ చూసి ఓ చిన్న కవర్‌లో వంట సోడా ఉంటే నీళ్లలో కలిపి కూతురికి పట్టించింది. అమ్మ ఏదో తన ఆకలి తీరేది ఇచ్చిందనుకుని ఆత్రంగా తాగేసిందా చంటిది. ఆ వెంటనే భళ్ళున కక్కేసి మరింత బాధతో విలవిలలాడడం మొదలుపెట్టింది. కూతురి కష్టాన్ని చూడలేకపోయాడు గోపీ. ‘‘పక్కవాళ్లని అడిగిరా కొంచెం పిల్లలమటుకే ఏమైనా ఉంటే ఇమ్మని’’ ప్రాధేయపడ్డాడు లక్ష్మిని. ‘‘మనం కూడా తెలుగోళ్లమనీ, అదీ చిన్న పిల్లలతో ఉన్నామనీ ఇప్పటికే చాలాసార్లు సాయం చేశారు వాళ్లు, బావుండదేమో...’’ అనుకుంటూనే పక్కింటికెళ్లింది.
‘‘పిండి ఉంటే రొట్టెలు చేసేశాను. పిల్లలిద్దరూ అన్నమే కావాలని పేచీ పెడుతున్నారు. కొని తేవడానికి పోలీసులు ఉంటారేమోనని మీ తమ్ముడు భయపడుతున్నాడొదినా... పిడికెడు బియ్యం ఉంటే ఇస్తావేంటీ... ఈ పూట అయిపోతే రేపొద్దున్నే తెచ్చేసుకుంటాం’’ సాధ్యమైనంత దాపరికంగా మాట్లాడింది లక్ష్మి పక్కింటావిడతో. ఆ మాటలకి ఆవిడ లక్ష్మిని పైనుంచి కిందకోసారి చూసి నిట్టూర్చి ‘‘హు... దాచాలంటే దాగే బతుకులేంటీ  మనయి, బియ్యం లేవుగానీ రాత్రి మిగిలిన రొట్టెలున్నాయి పట్టుకెళ్లు’’ అంటూ ఓ రెండు రొట్టెలు తెచ్చి లక్ష్మి చేతిలో పెట్టి ‘‘ఇదిగో, మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది. కానీ మీకు సాయం చేసేంత బతుకులు కావు మావి కూడా. పనుల్లేక మాకూ కష్టంగానే ఉంది ఇంకోసారి అడగవద్దు. కుదిరితే మీ ఊరికెళ్లిపోండి’’ అంటూ నిర్మొహమాటంగా తలుపులేసేసుకుంది. వచ్చే దుఃఖాన్ని పంటి బిగువునే ఆపుకుని ఇంట్లోకి వచ్చి భర్తకు చెప్పుకుంది. ఇల్లువదిలి వచ్చేసిన తర్వాత ఇలాంటి ఆకలి బాధలను ఎన్నో రోజులు రుచి చూసి భరించిన గోపీ, ఈరోజు తన పిల్లల బాధను చూసి తట్టుకోలేక తన చేతకాని తనాన్ని తనే తిట్టుకుంటూ ‘‘ఛీ ఛీ... నేనే మా నాన్న మాట వినుంటే ఇప్పుడు నా పిల్లలకీ గతి పట్టేదికాదు’’ అనుకుంటూ తల బాదుకుంటూ ఏడ్చేశాడు. ‘‘ఆ... చాల్లే, మగోడివి నువ్వే అలా ఏడిస్తే ఇక నేనేమైపోవాలి. అయినా అయిపోయిందాని గురించి ఇప్పుడేడ్చి లాభమేంటీ. జరగాల్సింది చూడు. అప్పుడెప్పుడో మీ ఊరివాళ్లు కనిపించి మీ అమ్మానాన్నా బానే ఉన్నారని చెప్పారన్నావుగా. పద మనం వాళ్ల దగ్గరికి పోదాం’’ వచ్చే ఏడుపును ఆపుకుంటూ చెప్పింది లక్ష్మి. ‘‘ఇన్నాళ్లూ ఉన్నారో, పోయారో కూడా పట్టించుకోనివాణ్ణి ఇప్పుడేం మొహం పెట్టుకుని వెళతాను. అయినా అక్కడేం మూటలున్నాయనీ. అప్పుడంటే మా నాన్న వయసులో ఉండి కాయకష్టం చేసి మాకు కష్టం తెలియకుండా చూసుకునేవాడు. ఇప్పుడు వాళ్లే పరిస్థితిలో ఉన్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో. వాళ్ల దగ్గరకంటూ వెళ్తే, బాగుపడే వెళ్లి వాళ్లని బాగా చూసుకోవాలను కున్నాను. ఇలాంటప్పుడు... అస్సలు నా మొహం వాళ్లకి చూపించలేను...’’ కుమిలి పోతూ అన్నాడు గోపి. అలా అన్న రెండు రోజులకి పరిస్థితులు ఇంకా విషమించి పోతుండడంతో ‘‘ఇదిగో చూడు, నాకంటూ ఎవ్వరూ లేరు పోనీ అటెళ్దామా అంటే. ఉన్న మీ అమ్మానాన్నలని కూడా లేకుండా చేసుకోవద్దు. ఈ గదిలో ఇలా దిక్కులేని చావు చచ్చేకంటే మనం చస్తే మనకోసం ఏడ్చేవాళ్ల దగ్గరకైనా పోయి చద్దాం’’ అంటూ అప్పటికప్పుడే పిల్లలని భుజం మీద వేసుకుని బయలుదేరింది లక్ష్మి. ఇక ఏమీ ఆలోచించే పరిస్థితిలో లేని గోపీ, తనని అనుసరించాడు.

* * *

రకరకాల ఆలోచనలతో ఏ తెల్లవారుజామునో నిద్ర పట్టిన గోపీకి, బాగా పొద్దెక్కాకగానీ మెలకువ రాలేదు. లేచి వాకిట్లోకి వచ్చేసరికి, అప్పటికే లేచిన మనవలతో ముద్దు ముచ్చటలాడుతున్న తల్లిదండ్రులు కనిపించారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్లిద్దరినీ చూడగానే గుండె చెరువయిపోయింది అతడికి. వాళ్ల దగ్గరికి వెళ్లి ‘‘నాన్నా... అదీ నేనూ’’ అంటూ తాను ఏ పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చిందీ వివరించబోయాడు. కొడుకు మనసుని కనిపెట్టినట్లే రత్నం ‘‘ఒరేయ్‌... నిన్న పెట్టే బేడా పిల్లలతో దిగాలుగా వచ్చిన నిన్ను చూసినప్పుడే అనుకున్నాం ఏదో భరించలేని కష్టం లోంచే వచ్చావని. నిన్న రాత్రి మీరు ఆరాటంగా అన్నాలు తిన్న తీరే చెప్పింది ఎన్ని రోజులుగా ఆ కష్టాన్ని దాచుకున్నారో. అప్పుడే నిర్ణయించుకున్నాం నేనూ మీ నాన్నా... మనకున్న అరెకరంలో తిండిగింజలు పండుతాయి. అదిగో చూడు, ఆ పెరట్లో కూరగాయలు మనకి సరిపోగా నాలుగిళ్లలో అమ్ముకోవచ్చు. ముసలిదాన్ని అయిపోయానుగా, బరువు మెళ్లో మొయ్యలేక తేలిగ్గా ఉంటుందని పసుపుకొమ్ము కట్టుకున్నాను. ఉత్తినే పెట్లో ఉంచడమెందుకు. ఆ నాంతాడుని అమ్మి ఓ పాడి గేదెను కొని ఇళ్లకి పాలు పోశామంటే మనకి దిగుల్లేకుండా గడిచిపోతుంది. మేం బతికుండగా నీకూ, నీ పిల్లలకేం బెంగ లేదు’’ అని చెప్పింది. అలా ఆ వయసులో ఉన్న తల్లి ధైర్యం చెపుతుంటే విన్న గోపీకి హృదయం బరువెక్కింది.

‘‘ఈ వయసులో మీకే కష్టం రాకుండా చూడాల్సింది నేను. అలాంటిది ఇన్నాళ్లూ మీకు దూరంగా ఉండి బాధ పెట్టిందేకాకుండా ఇప్పుడు నా భారమే కాకుండా నా పిల్లల భారం కూడా మీమీద పడేశానమ్మా’’ అన్నాడు ఆవేదనగా. ‘‘వయసులో ఉన్నన్నాళ్లూ నువ్వేనాటికైనా తిరిగొస్తావనే భ్రమతో ధైర్యంగా బతికేశాంరా. వయసైపోతుంటే భ్రమ కాకుండా నిజంగానే నువ్వొచ్చేసి, నువ్వే కాకుండా మనవల్నికూడా తీసుకొచ్చి మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి మా కష్టాన్ని తీర్చేశావు కదరా బాబూ. ఇంతకు మించి ఈ వయసులో మాకేమి కావాలి’’ అంటూ రామన్న ఆప్యాయంగా మనవలిద్దరినీ అక్కున చేర్చుకున్నాడు. అది చూసిన గోపీ ‘‘కష్టమొచ్చినా, నష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని చూసుకునే కన్నవాళ్లను వదిలి ఇన్నాళ్లూ ఎంత జీవితాన్ని చేజార్చుకున్నాను. ఇక మీదనైనా వీళ్లకే కష్టం రాకుండా చూసుకోవాలి’’ అని మనసులోనే స్థిరంగా నిర్ణయించుకుని, పెరట్లో మొక్కలని చూడడానికి వెళ్లాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.