Cloud Computing: అవకాశాల ఆకాశంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌

Eenadu icon
By Features Desk Published : 24 Sep 2025 02:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటాల ప్రవేశంతో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మార్కెట్‌ మరింత బలపడింది. సరసమైన ధరలతో ఐటీ, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న ఈ రంగానికి ఏ ఢోకా లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. చింతలేని ఇలాంటి పరిశ్రమలో అవకాశాలు అన్వేషిస్తే వెంటనే లభిస్తాయి. ఉద్యోగ భద్రతతో దీర్ఘకాలం నిశ్చింతగా ఉండవచ్చు.

మీకు రిఫ్రిజిరేటర్‌ లేదు. కానీ, తాజా కూరగాయలూ, పండ్లూ, పాలూ మీరు కోరుకున్నప్పుడు ఆర్డర్‌ చేస్తే పది నిమిషాల్లో వచ్చేస్తాయి. ఇది మీకు హాయీ, లాభదాయకమూ. ఎందుకంటే మీకు కావలసిన సామగ్రిని పెద్ద మొత్తంలో కొని నిల్వ ఉంచాల్సిన పని లేదు. ఎంతో ఖర్చు ఆదా కూడా. ఎంత కావాలో అంతవరకే ఎప్పటికప్పుడు ఆర్డర్‌ చేసుకోవచ్చు. 

ఇదేదో ఫుడ్, నిత్యావసర సరుకుల డెలివరీ యాప్‌ ఆధారిత ఈ-కామర్స్‌ గురించి చెబుతున్నట్టు అన్పిస్తోందా? నిత్యజీవితంలో మనం ఎదుర్కొనే ఒక సవాలుకు పరిష్కారం చూపే ఆధునిక పరిశ్రమ.. సరిగ్గా ఇదే సూత్రంపై అనూహ్యంగా ఎదుగుతోంది. 

క్లౌడ్‌ కంప్యూటింగ్‌.. పేరు వినూత్నంగా కన్పిస్తున్నట్టుగానే ఒక సరికొత్త ఆలోచన నుంచి పుట్టిందిది. మొబైల్‌ ఫోన్లూ, కంప్యూటర్లూ ఇంటర్నెట్‌ (వైఫై) ఆధారితంగా నడుస్తుంటాయని మనకు తెలుసు. అయితే మనకెంత డేటా సపోర్ట్‌ కావాలో ముందుగా తెలియదు. అంచనా వేసుకున్న ప్రకారం పరిమిత డేటాతో పనిచేస్తుంటాం. అయితే భవిష్యత్తులో చేపట్టే పనికి మనకు వస్తున్న కంటెంటును బట్టి అదనపు డేటా అవసరం. అది తాత్కాలికం కావచ్చు. అలాంటప్పుడు అదనపు డేటాను శాశ్వతంగా కొనుగోలు చేస్తే భవిష్యత్తులో భారం అవుతుంది. 

ఈ సందర్భమే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అనే భారీ పరిశ్రమ అవతరించడానికి కారణమైంది. మన అవసరానికి తాత్కాలికంగా గానీ, పెరిగిన అవసరాలకు తగినట్టు కానీ డేటా విక్రయించేందుకు బడా కార్పొరేట్‌ కంపెనీలు క్యూ కడుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అదానీ.. ఇలా డేటా విక్రయ రంగంలో దూసుకువెళుతున్నాయి.

మనకు సౌలభ్యం.. వారికి లాభం

ఏ వ్యాపారమైనా విన్‌-విన్‌ రిలేషన్‌ ఉంటేనే వర్ధిల్లుతుంది. అటు విక్రయదారునికీ, ఇటు కొనుగోలుదారునికీ లాభదాయకంగా ఉంటేనే వికసిస్తుంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అటువంటి ప్రాతిపదిక మీదనే ప్రస్థానం సాగిస్తోంది. ఆది మనం కోరినప్పుడు అందించే ఐటీ ముడిసరుకు. డేటాను భద్రపరిచే సర్వర్లు, స్టోరేజి సౌకర్యం, సాఫ్ట్‌వేర్ల్లు, చివరికి అనలిటిక్స్‌ను సైతం తగిన ధర చెల్లించి అద్దెకు తీసుకోవచ్చు, వినియోగించుకోవచ్చు. డేటా సెంటర్ల నుంచి ఈ కంప్యూటింగ్‌ సేవలను వినియోగించుకోవడమే క్లౌడ్‌ కంప్యూటింగ్‌. 

కంటికి కన్పించని ఈ ఉత్పత్తి మార్కెట్టును గుర్తిస్తే కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. 2024 నాటికే 60 లక్షల కోట్ల రూపాయలతో ఈ రంగం దినదిన ప్రవర్ధమానం అవుతోంది. మరో ఐదేళ్లలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మార్కెట్‌ పరిమాణం రెట్టింపు అవుతుందని అంచనా. 

ఎదుగుదలకు కారణాలెన్నో

వేగంగా విస్తరిస్తున్న టెక్నాలజీలు ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటాలను స్వాగతించి వీటికి తగ్గట్టు డేటాను నిర్మిస్తుండటం క్లౌడ్‌ కంప్యూటింగ్‌ పరిశ్రమ వృద్ధికి ప్రధాన కారణం. మరికొన్ని సౌలభ్యాలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను వినియోగదారునికి ఆసరాగా నిలుపుతున్నాయి. 

డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌: ప్రతి పరిశ్రమకూ, ప్రతి కంపెనీకీ డిజిటల్‌ బదలాయింపు అనివార్యం కావడంతో డేటా అవసరం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది.

హైబ్రిడ్, మల్టీక్లౌడ్‌ సౌకర్యాలు: వినియోగదారులైన కంపెనీలకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ పరిశ్రమ మిశ్రమ, బహుళ సదుపాయాలు కల్పిస్తుండటం ఈ రంగపు ఎదుగుదలకు మరో కారణం. తాత్కాలిక/ శాశ్వత డేటా విక్రయంతో పాటు ఈ రెండింటినీ కలిపిన హైబ్రిడ్‌ విధానాన్ని డేటా కంపెనీలు అందిస్తుండటం సాధారణ కంపెనీలను ఆకర్షిస్తోంది.

ప్రాంతీయ విస్తరణ: ఎక్కడో సుదూరాన డేటా సెంటర్లు నిర్వహించే దశ నుంచి క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీలు ప్రాంతీయ కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నాయి. మనం వార్తల్లో గమనించే.. హైదరాబాద్, విశాఖపట్టణాల్లో పేరున్న కంపెనీల డేటా సెంటర్ల స్థాపన ప్రతిపాదనలు ఇందులో భాగమే.

సాఫ్ట్‌వేర్‌ సేవలు: ఒక ప్రోగ్రామ్‌ రాయించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. కొన్ని చోట్ల నిపుణుల లభ్యత ఉండదు. కానీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను ఆశ్రయిస్తే సాఫ్ట్‌వేర్‌ సర్వీసును కొనుగోలు చేయవచ్చు. మన అవసరం నెరవేరుతుంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో కంపెనీలకు కనక వర్షం కురిపిస్తున్నవి సాఫ్ట్‌వేర్‌ సేవలే. 

బ్యాంకింగ్‌ రంగానికి వరం: మిగతా రంగాలకంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులు, ఇన్‌స్యూరెన్స్‌ రంగాలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై ఎక్కువ ఆధారపడ్డాయి. డేటా భద్రత, కచ్చితత్వం ఈ రంగాలకు అవసరమైనందున క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వీటికి వర ప్రసాదంగా అందివస్తోంది. 

అక్కడ లేఆఫ్‌లు.. ఇక్కడ ప్రమోషన్లు 

ఐటీ రంగంలో ఉద్యోగాల తొలగింపు లేని పరిశ్రమగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ గుర్తింపు పొందింది. సాధారణ ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగులను కుదించినా.. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మాత్రం తగ్గించుకోవు. మళ్లీ అవకాశాలిస్తే అప్పటికప్పుడు మౌలిక సదుపాయాలను ఏర్పర్చుకోవడం కష్టం. దీంతో ఆ సేవలు కొనసాగిస్తున్నందున క్లౌడ్‌ కంప్యూటింగ్‌ పరిశ్రమ ఏ ఒడుదొడుకులూ లేకుండా సాగుతోంది. మంచి వేతనాలు, వైవిధ్యమైన పొజిషన్లు, పరిశ్రమ వేగంగా విస్తరిస్తుండటం కారణంగా ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. 

ఈ పరిశ్రమలో ప్రవేశించాలంటే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగం గురించి విస్తృత అవగాహన చేసుకోవాలి. ఇందులోని వివిధ హోదాలను అర్థం చేసుకొని, అందుకు అనుగుణమైన కోర్సులు చేస్తే సరిపోతుంది.   

యస్‌.వి. సురేష్‌,
సంపాదకుడు, ఉద్యోగ సోపానం 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని