నర్సింగ్‌ పూర్తయింది, ఎంబీబీఎస్‌ చేయొచ్చా?

ఎస్‌ఎస్‌సీ తర్వాత ఐటీఐ చేశాను. ప్రస్తుతం టెలికాం సంస్థలో ఉద్యోగం....

Published : 28 Aug 2017 01:50 IST

నర్సింగ్‌ పూర్తయింది,
ఎంబీబీఎస్‌ చేయొచ్చా? 

ఎస్‌ఎస్‌సీ తర్వాత ఐటీఐ చేశాను. ప్రస్తుతం టెలికాం సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. డిప్లొమా చేయాలనుంది. పదోన్నతులకు ఏ డిప్లొమా సహకరిస్తుందో వివరించండి.

- కిషన్‌, కరీంనగర్‌

* మీరు ఐటీఐ ఏ విభాగంలో పూర్తిచేశారో తెలుపలేదు. టెలికాం రంగంలో ఏ విభాగంలో పనిచేస్తున్నారో కూడా తెలుపలేదు. టెలికాంలో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌, సిగ్నల్‌ వ్యవస్థ, టవర్స్‌ వంటి వివిధ విభాగాలున్నాయి. మీరు చేస్తున్న విభాగాన్ని బట్టి డిప్లొమా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఐటీఐ పూర్తిచేసినవారు లేటరల్‌ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్‌ కోర్సును నేరుగా రెగ్యులర్‌ విధానంలో చేరవచ్చు. టెలికాం రంగంలో ఉన్నారు కాబట్టి, ఈసీఈ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవడం ఉపయోగకరం. దూరవిద్యలో పాలిటెక్నిక్‌ డిప్లొమా చేయడం వీలు కాదు. మీరు డిగ్రీ పూర్తి చేసినట్లయితే ఆ తర్వాత దూరవిద్యలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ టెలికాం మేనేజ్‌మెంట్‌ కోర్సును ఎంచుకోవచ్చు.

 

దూరవిద్య ద్వారా ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌), రెగ్యులర్‌ విధానంలో ఎంబీఏ చేస్తున్నాను. నెట్‌

రాయాలనుకుంటున్నాను. కటాఫ్‌ మార్కుల వివరాలను తెలపండి. రెండు కోర్సులను ఒకే సంవత్సరంలో చేయడం వల్ల ఏమైనా సమస్యలుంటాయా?

- భుక్య రాములు, ఖమ్మం
* ఏవేని రెండు డిగ్రీ కోర్సులు కానీ, రెండు పీజీ కోర్సులు కానీ సమాంతరంగా ఒకే సంవత్సరంలో చేయకూడదు. అలా రెండు కోర్సులు అభ్యసించినా ఒక కోర్సును మాత్రమే క్లెయిం చేసుకోగలరు. నెట్‌ రాయాలనుకుంటున్నట్లు చెప్పారు కానీ, మీరు చదువుతున్న వాటిల్లో వేటిని రాయాలనుకుంటున్నారో తెలియజేయలేదు. సాధారణంగా నెట్‌ కటాఫ్‌ మార్కులు సంబంధిత పరీక్ష, రాసే విద్యార్థుల సంఖ్య, వాళ్లు పొందే మార్కులనుబట్టి ఆధారపడి ఉంటాయి. యూజీసీ తాజా ఉత్తర్వుల ప్రకారం ఉత్తమంగా మార్కులు సాధించిన అత్యుత్తమమైన 6% మందిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు.
డిగ్రీ (బీఎస్‌సీ) రెండో సంవత్సరంతో ఆపేశాను. దూరవిద్య ద్వారా కొనసాగించాలనుకుంటున్నాను. నేను సివిల్స్‌ రాయడానికి అర్హుడినేనా?
- ఎం. నవీన్‌ కుమార్‌, నారాయణవరం
* ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు జాతీయస్థాయిలో నిర్వహించే సివిల్స్‌ రాయడానికి అర్హులు. మీరు డిగ్రీ పూర్తిచేస్తే ఈ పరీక్షను రాయడానికి అర్హులే. సన్నద్ధతను గురించి తెలుసుకోవాలనుకుంటే www.eenadupratibha.netవెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మీరు ముందుగా డిగ్రీని దూరవిద్య విధానంలోకి మార్పించుకుని రెండో సంవత్సరం నుంచి కొనసాగించవచ్చు. రెగ్యులర్‌ విధానం నుంచి దూరవిద్యకు డిగ్రీని మార్చుకుని కొనసాగించే వెసులుబాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU), గుంటూరు; ఆంధ్రవిశ్వవిద్యాలయం , విశాఖపట్నం వంటివి కల్పిస్తున్నాయి. తగిన విచారణ చేసుకుని చదువును కొనసాగించండి.

బీఎస్‌సీ (నర్సింగ్‌) నాలుగేళ్ల కోర్సు చేశాను. కానీ నాకు ఎంబీబీఎస్‌ చేయాలని ఉంది. వీలుంటుందా?

- ఎం. జోషి రాజు
* ఎంబీబీఎస్‌ చేయదలచుకున్నవారు సీబీఎస్‌సీ వారు నిర్వహించే నీట్‌ను రాయవలసి ఉంటుంది. నీట్‌ జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్‌లో చేరడానికి నిర్వహించే ప్రవేశపరీక్ష. కనిష్ఠ వయఃపరిమితి 17 ఏళ్లు కాగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం గరిష్ఠ వయఃపరిమితి లేదు. 10+2లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీల్లో 50% మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షను రాయవచ్చు. దీనిలో వచ్చిన ర్యాంకును బట్టి దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో సీటును పొందవచ్చు. మీరు 10+2లో బైపీసీ చదివుంటే మీకు అర్హత ఉన్నట్లే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని