డ్రాయింగ్‌లో కొలువులు?

ఎంకాం, ఎల్‌ఎల్‌బీ చదివాను. ఇంటర్నేషనల్‌ లా చదవాలని ఉంది. దానికి సంబంధించిన వివరాలతోపాటు దూరవిద్య ద్వారా అందించే సంస్థల వివరాలనూ తెలియజేయండి.

Published : 11 Sep 2017 02:25 IST

డ్రాయింగ్‌లో కొలువులు?

ఎంకాం, ఎల్‌ఎల్‌బీ చదివాను. ఇంటర్నేషనల్‌ లా చదవాలని ఉంది. దానికి సంబంధించిన వివరాలతోపాటు దూరవిద్య ద్వారా అందించే సంస్థల వివరాలనూ తెలియజేయండి. - బి. వెంకటరావు, విజయవాడ

ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంటర్నేషనల్‌ లా చదివేవారికి గిరాకీ ఏర్పడింది. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ లా (ఐఎస్‌ఐఎల్‌) వారు డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ బిజినెస్‌ లా, ఇంటర్నేషనల్‌ రెఫ్యూజీ లా, లా ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ వంటివాటిలో కోర్సులను అందిస్తున్నారు. దూరవిద్య ద్వారా సింబయాసిస్‌ లా స్కూల్‌, ఐఐఈఎం (కేరళ) వారు ఆరు నెలల నుంచి సంవత్సరం వ్యవధి గల వివిధ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను ఇంటర్నేషనల్‌ లాలో అందిస్తున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులకు అర్హులు.

2009లో పదో తరగతి పూర్తయింది. అననుకూల పరిస్థితుల కారణంగా చదువు మధ్యలోనే ఆగిపోయింది. చిన్న చిన్న కంప్యూటర్‌ కోర్సులను చేశాను. కానీ, ఎక్కడా ఉద్యోగం రాలేదు. కనీస అర్హత లేదు అంటున్నారు. నా విద్యార్హతను ఎలా పెంచుకోవచ్చు? భవిష్యత్తుకు ఉపయోగపడే మార్గాన్ని సూచించండి. - ఎన్‌. కృష్ణ

ఉన్నత విద్య ప్రతి ఒక్కరికీ చేరువ కావడం, విద్యావంతులు ఎక్కువ కావడంతో ప్రతి చిన్న ఉద్యోగానికీ డిగ్రీ కనీసార్హతగా అడుగుతున్నారు. మీరు మీ విద్యార్హతను దూరవిద్య ద్వారా పెంచుకోవచ్చు. దూరవిద్య ద్వారా బీఏ లేదా బీకాం వంటి డిగ్రీ కోర్సును పూర్తిచేయడం ద్వారా అర్హతను పెంచుకుని ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. దీంతోపాటు టాలీ, ఎంఎస్‌ ఆఫీస్‌ వంటి కంప్యూటర్‌ కోర్సులను చేస్తే ఉపయోగం ఉంటుంది.

బీకాం చదువుతున్నాను. నాకు డ్రాయింగ్‌ అంటే ఆసక్తి. వాటికి సంబంధించిన కోర్సుల వివరాలను తెలపండి. ప్రభుత్వ రంగంలో డ్రాయింగ్‌కు సంబంధించిన ఉద్యోగావకాశాలు ఏవైనా ఉంటాయా? - సోదె బాపూజీ

డ్రాయింగ్‌ రంగంలో స్థిరపడాలనుకునేవారు డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్‌ ఇన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) ను ఎంచుకోవాల్సి ఉంటుంది. డ్రాయింగ్‌లో డిగ్రీ లేదా పీజీ చేసినవారు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డ్రాయింగ్‌ టీచర్‌గా ఉద్యోగం పొందవచ్చు. ఫ్రీలాన్సర్‌ డ్రాయింగ్‌ ఆర్టిస్ట్‌గా మీడియా, యానిమేషన్‌ రంగాల్లోని కొన్ని శాఖల్లో ఉద్యోగం సంపాదించుకోవచ్చు.

బీటెక్‌ (కంప్యూటర్‌సైన్స్‌) చేశాను. ఎంటెక్‌లో కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ స్పెషలైజేషన్‌ చేయాలనుంది. దూరవిద్య ద్వారా చేసే అవకాశం ఉందా? - శరణ్య  

బీటెక్‌, ఎంటెక్‌ లాంటి వృత్తివిద్యాకోర్సులను రెగ్యులర్‌ విద్య ద్వారా అభ్యసించడం శ్రేయస్కరం. మన దేశంలో దూరవిద్య ద్వారా ఎంటెక్‌ (కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌)ను యూజీసీ లేదా ఏఐసీటీఈ ఆమోదంతో ఏ విశ్వవిద్యాలయమూ అందించడం లేదు. దేశంలో అమిటీ విశ్వవిద్యాలయం ఎంఎస్‌సీ- కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ కోర్సును దూరవిద్య ద్వారా అందిస్తోంది. ఏదేని డిగ్రీ చేసినవారు ఈ కోర్సును అభ్యసించడానికి అర్హులు.

డిప్లొమా (ఈసీఈ) 2014లో పూర్తిచేశాను. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సంపాదించాలని ఉంది. నాకున్న అవకాశాలను తెలియజేయండి. - దుర్గాప్రసాద్‌, కృష్ణా

3 సంవత్సరాల డిప్లొమా (ఈసీఈ) లేదా పాలిటెక్నిక్‌ చేసిన అభ్యర్థులకు వివిధ ప్రభుత్వరంగ సంస్థలు ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌, తమ వెబ్‌సైట్లలోని కెరియర్‌ పేజీల్లో ప్రకటనలు వెలువరుస్తాయి. జూనియర్‌ ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ఫోర్‌మెన్‌ (ఎలక్ట్రికల్‌) ట్రెయినీలు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ వంటి ఉద్యోగావకాశాలుంటాయి. ముఖ్యంగా గెయిల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, యూపీఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ వంటి సంస్థలు వివిధ ఉద్యోగ ప్రకటనలను జారీ చేస్తుంటాయి. ఈ ఉద్యోగాలకు మీరు ప్రయత్నించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని