ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ విదేశాల్లో..?

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లపై ఆసక్తి. వీటిని నేర్చుకోవడం వల్ల లాభముంటుందా? ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

Published : 16 Oct 2017 01:48 IST

ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ విదేశాల్లో..?

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లపై ఆసక్తి. వీటిని నేర్చుకోవడం వల్ల లాభముంటుందా? ఉద్యోగావకాశాలెలా ఉంటాయి? - ఐనంపూడి శివ
మొబైల్‌ రంగంలో నిత్యం చోటుచేసుకునే మార్పులు మనం సంభాషించుకునే తీరు, వ్యాపారం చేసుకునే వేదిక, సమాచారాన్ని ఉపయోగించుకునే విధానాలను నిర్ణయిస్తున్నాయి. రోజువారీ దైనందిన జీవితాన్ని మొబైల్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ లేకుండా వూహించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా స్మార్ట్‌ డివైజెస్‌, ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌లపైనే ఆధారపడి ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్లాట్‌ఫాంలు మొబైల్‌ డెవలపర్‌కు గిరాకీని తెచ్చిపెడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ వృత్తి మార్గాల్లో మొదటి వరుసలో నిలుస్తున్నాయి. ఈ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆధారిత, అభివృద్ధి వేదికల్లో నైపుణ్యం సాధించడం ద్వారా మంచి ప్రొఫెషనల్‌ డెవలపర్‌గా ఎదిగే అవకాశాన్ని పొందవచ్చు.
బీబీఎం చదువుతున్నాను. మాస్టర్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ను విదేశాల్లో చేయాలనుంది. దీనికి సంబంధించిన వివరాలు, ఉద్యోగావకాశాలను తెలపండి. - జయంత్‌
అంతర్జాతీయ వర్తకం ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో మాస్టర్స్‌ చేసిన అభ్యర్థులకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లపట్ల విస్తృత అవగాహన, క్రాస్‌ బోర్డర్‌ నెగోషియేషన్స్‌, స్ట్రాటజీ, బహుళజాతి సంస్థల వ్యూహాత్మక ప్రణాళిక, చట్టపరమైన అంశాల పరిరక్షణ, అంతర్జాతీయ పర్యావరణంలో పనిచేయగలిగే మేనేజీరియల్‌ నైపుణ్యాలను అభ్యర్థుల్లో పెంపొదిస్తుంది. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటే జీఆర్‌ఈ లేదా జీమ్యాట్‌తోపాటు అభ్యర్థి ఆంగ్లభాషా నైపుణ్యాన్ని పరీక్షించే టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌/ పీటీఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
విదేశీ విశ్వవిద్యాలయాలు సాధారణంగా ఫాల్‌ (సెప్టెంబరు), స్ప్రింగ్‌ (జనవరి)ల్లో ప్రవేశాలను కల్పిస్తాయి. కొన్ని సంస్థలు సమ్మర్‌ (మే)లోనూ ప్రవేశాలను కల్పిస్తాయి. సంబంధిత విశ్వవిద్యాలయాన్నిబట్టి దరఖాస్తు గడువులు వేరుగా ఉంటాయి. ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో మాస్టర్స్‌ చేసినవారికి మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌, అనలిస్ట్‌, ఇంపోర్ట్‌-ఎక్స్‌పోర్ట్‌ కంప్లయిన్స్‌ స్పెషలిస్ట్‌, ఎకనమిస్ట్‌, ఇంటర్నేషనల్‌ అకౌంటెంట్‌, మార్కెటింగ్‌, స్ట్రాటజీ రంగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలను పొందవచ్చు.
బీటెక్‌ తర్వాత బ్యాంకింగ్‌లో డిప్లొమా చేశాను. ప్రస్తుతం ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. బ్యాంకింగ్‌లో పీహెచ్‌డీ చేయాలనుంది. నాకు అర్హత ఉందా? అందించే సంస్థల వివరాలను తెలియజేయండి. - తిరుపతిరావు
సాధారణంగా బ్యాంకింగ్‌లో పీహెచ్‌డీ చేయదలచుకున్నవారు ఎంబీఏ (ఫైనాన్స్‌) లేదా ఎంకాం ఉత్తీర్ణులై ఉండాలి. పీహెచ్‌డీ ప్రవేశం పొందాలంటే సంబంధిత విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. మౌఖిక పరీక్షలోనూ విజయం సాధించాలి. పీహెచ్‌డీలో ఫెలోషిప్‌ పొందాలనుకునేవారు యూజీసీ నిర్వహించే నెట్‌-జేఆర్‌ఎఫ్‌ పరీక్ష ఉత్తీర్ణత చెందాలి. బ్యాంకింగ్‌లో పీహెచ్‌డీని విశ్వవిద్యాలయాలు సాధారణంగా ఫైనాన్స్‌ అధ్యాపకుల పర్యవేక్షణలో అందిస్తాయి. కొన్ని ఐఐఎంలు బీటెక్‌ చేసినవారికి కూడా ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌పీఎం)లో క్యాట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తున్నాయి. ఎఫ్‌పీఎం కోర్సును పీహెచ్‌డీ తత్సమాన అర్హతగా పరిగణిస్తారు.

- ప్రొ.బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని