టూల్‌ డిజైనింగ్‌లో ఏ అవకాశాలు?

* బీటెక్‌ పూర్తిచేశాను. ఎంటెక్‌ (టూల్‌ డిజైనింగ్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. పూర్తయ్యాక కోర్సులేమైనా చేస్తే మేలా? నాకున్న ఉద్యోగావకాశాలేంటి? నాకున్న స్వదేశీ, విదేశీ విద్య, ఉద్యోగావకాశాలను తెలియజేయండి. - బి. రోహిత్‌ కుమార్‌, హైదరాబాద్‌

Published : 23 Oct 2017 02:10 IST

టూల్‌ డిజైనింగ్‌లో ఏ అవకాశాలు?

* బీటెక్‌ పూర్తిచేశాను. ఎంటెక్‌ (టూల్‌ డిజైనింగ్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. పూర్తయ్యాక కోర్సులేమైనా చేస్తే మేలా? నాకున్న ఉద్యోగావకాశాలేంటి? నాకున్న స్వదేశీ, విదేశీ విద్య, ఉద్యోగావకాశాలను తెలియజేయండి. - బి. రోహిత్‌ కుమార్‌, హైదరాబాద్‌
* ప్రతి మాన్యుఫాక్చరింగ్‌, మెషినింగ్‌ యూనిట్లకు టూల్స్‌ జీవనాడి లాంటివి. ఎక్కువ పని సామర్థ్యం, నాణ్యత, తక్కువ ఖర్చుతో పని సాధ్యం చేసే టూల్స్‌ సర్వత్రా అవసరం. కానీ ఈ విభాగంలో నైపుణ్యం, కొత్త ఆవిష్కరణలు చేయగలిగేవారికి మంచి గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. మీరు రెండో సంవత్సరంలో ఉన్నారు కాబట్టి, ముందుగా ఏదైనా సంస్థలో ప్రాజెక్టు వర్క్‌ చేయడం ద్వారా పని అనుభవాన్ని పొందండి. ఈ రంగంలో అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌కు ఆదరణ ఉంటుంది. కాబట్టి చదువుతోపాటే కొంత పని అనుభవాన్ని పొందినట్లవుతుంది. సాధారణంగా ఐఐటీలు, నిట్‌ల్లో ఎంటెక్‌ (టూల్‌ డిజైనింగ్‌) చేసినవారికి మంచి వేతనం, భవిష్యత్తు ఉంటుంది.

మీకు ఆటోమొబైల్‌, మాన్యుఫాక్చరింగ్‌, మెషినింగ్‌ యూనిట్లలో టైల్‌ డిజైనర్‌, టూల్‌ డిటైలర్‌, స్పేర్‌ పార్ట్‌ డిజైనర్‌, ప్రొడక్ట్‌ డిజైనర్‌, కాస్ట్‌ ఇంజినీర్‌, డ్రాఫ్టింగ్‌ వంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఉన్నతవిద్య దృష్ట్యా దేశవిదేశాల్లో పీహెచ్‌డీని అభ్యసించే అవకాశం ఉంది.

* మా అబ్బాయి బీఎస్‌సీ కంప్యూటర్స్‌ చదువుతున్నాడు. ఎంబీఏ, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో ఏ ఉన్నతవిద్య చదివితే తన భవిష్యత్తు బాగుంటుంది? స్వదేశ, విదేశాల్లో తనకున్న అవకాశాలను తెలపండి. - ఇవటూరి వీరేశ్వరరావు
* మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్స్‌ రెండు కోర్సులకూ తమదైన ప్రత్యేకత ఉంది. రెండూ మంచి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. మీ అబ్బాయిలో బృందనైపుణ్యాలు, సమస్య పరిష్కరించగల నైపుణ్యం, సవాళ్లను ఎదుర్కునే మనస్తత్వం, వ్యాపారాలోచనలు, నెట్‌వర్కింగ్‌ నేర్పు ఉంటే ఎంబీఏను ఎంచుకోవచ్చు. మనదేశంలో ఎంబీఏ చేయాలనుకుంటే క్యాట్‌ రాసి, ఐఐఎంలు, మంచి బిజినెస్‌ స్కూళ్లలో విద్యావకాశాన్ని పొందవచ్చు. కోడింగ్‌, కంప్యూటర్స్‌ పట్ల ఆసక్తి, మేథమేటిక్స్‌పై అభిరుచి ఉంటే కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ను ఎంచుకోవచ్చు. మనదేశంలో ఎన్‌ఐటీ, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో పీజీ కంప్యూటర్‌ కోర్సును ఎంచుకోవచ్చు.

విదేశాల్లో విద్యనభ్యసించాలంటే జీఆర్‌ఈ/ జీమ్యాట్‌తోపాటు టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌, పీటీఈల్లో మంచి స్కోరుతో మంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశాన్ని పొందవచ్చు. రెండు కోర్సులూ మంచి భవిష్యత్తును అందించే సాధనాలే. మీ అబ్బాయి అభిరుచి, ఆర్థికస్థోమత పరంగా నిర్ణయాన్ని తీసుకోండి.

* బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ కోర్సులను నేరుగా, దూరవిద్య ద్వారా అందించే విశ్వవిద్యాలయాలేవి? - సందీప్‌ మెరుగు
* ఏదైనా డిగ్రీ చేసినవారు ఏడాది కాలవ్యవధి గల బ్యాచిలర్‌ ఇన్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (బీఎల్‌ఐఎస్‌సీ) చదవడానికి అర్హులు. మాస్టర్స్‌ ఇన్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (ఎంఎల్‌ఐఎస్‌సీ) కోర్సు అభ్యసించాలనుకునేవారు డిగ్రీతోపాటు బీఎల్‌ఐఎస్‌సీ కోర్సునూ పూర్తిచేసుండాలి. రెగ్యులర్‌ విధానంలో మనాయిర్‌ కాలేజ్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌- వరంగల్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌, ఉస్మానియా యూనివర్సిటీ వారు ఈ కోర్సులను ప్రవేశపరీక్ష ద్వారా అందిస్తున్నాయి. దూరవిద్య విధానంలో ఆచార్య నాగార్జున, ఇగ్నో, ఎస్‌వీ యూనివర్సిటీలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.

- ప్రొ.బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని