సబ్జెక్టు ఎంపిక ఎంతో ముఖ్యం

అమెరికాలో ఉన్నత కోర్సుల్లో ప్రవేశానికి మొదటగా కావాల్సినది ముందస్తు సన్నద్ధత. మాస్టర్స్ డిగ్రీ చదవాలనుకునే విద్యార్థి ఉత్సాహం, స్వీయప్రేరణ, పట్టుదలతో...

Published : 14 Jan 2016 19:12 IST

సబ్జెక్టు ఎంపిక ఎంతో ముఖ్యం

అమెరికాలో ఉన్నత కోర్సుల్లో ప్రవేశానికి మొదటగా కావాల్సినది ముందస్తు సన్నద్ధత. మాస్టర్స్‌ డిగ్రీ చదవాలనుకునే విద్యార్థి ఉత్సాహం, స్వీయప్రేరణ, పట్టుదలతో తన ప్రయత్నాలను మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ నుంచే ప్రారంభించాలి!
విశ్వవిద్యాలయాల గురించి తగిన పరిశోధన చేయాలంటే... సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇందుకోసం ప్రతి విద్యార్థీ సిలబస్‌లో తనకు బాగా ఆసక్తి ఉన్న సబ్జెక్టును ఎంచుకొని ఉండాలి. చాలామంది విద్యార్థులకు వాళ్ల కోర్‌ సబ్జెక్టులు మూడో సంవత్సరం, మొదటి సెమిస్టర్‌లోనే బోధిస్తారు.

తమ కీలక సబ్జెక్టుని ఎంచుకోగానే విద్యార్థులు తమకు కావాల్సిన వివరాల కోసం ప్రొఫెసర్లను, హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌ను, తోటి విద్యార్థులను సంప్రదించాలి. వాళ్లు తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకుని కొత్త విద్యార్థులకు సాయం చేస్తారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్టుల్లో తమ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుంటూ, మౌలికాంశాలపై పట్టు సాధించాలి.

కోర్సులను, యూనివర్సిటీలను ఎంచుకునేటపుడు విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం- వసతులు, పరిశోధనాశాలలు, సౌకర్యాల కల్పన విషయం.

ప్రభుత్వ నిధులతో కొనసాగే అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులో పాల్గొనే విద్యార్థులు- తమ జాతీయతతో సంబంధం లేకుండా మాస్టర్స్‌ / డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌లను సులువుగా కొనసాగించవచ్చు.

ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఓ విద్యార్థి బాచిలర్స్‌ డిగ్రీ చేస్తున్నాడనుకోండి. అతడికి నెట్‌వర్కింగ్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ ప్రోగ్రామింగ్‌, డిజైన్‌ అండ్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ ఆల్గారిథమ్స్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌, మొబైల్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డేటా, వెబ్‌ డిజైన్‌, సాఫ్ట్‌వేర్‌ ఫ్రేమ్‌వర్క్స్‌, వెబ్‌సర్వీసెస్‌ వంటి కోర్‌ సబ్జెక్టులను పరిచయం చేస్తారు.

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌/ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఒక విద్యార్థి విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ చేస్తున్నట్లయితే పైన చెప్పుకున్న మౌలిక అంశాల్లో పరిశోధన జరిపే అవకాశం లభిస్తుంది.

ఈ విద్యాంశాలే కాకుండా విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ కోర్సులూ చేయవచ్చు. మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ కోర్సు చేయడం వల్ల తమ కంప్యూటర్‌ పరిజ్ఞానానికి మేనేజ్‌మెంట్‌ కోణాన్ని కూడా జోడించవచ్చు. ఈ పద్ధతిలో విద్యార్థికి- కస్టమర్‌ రిలేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం), ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, బిజినెస్‌ అనాలిసిస్‌ అండ్‌ రిపోర్టింగ్‌ వంటి కీలకమైన మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాముల్లో అవకాశాలు లభిస్తాయి.
  సాఫ్ట్‌వేర్‌ సాంకేతికాంశాలతో మేనేజ్‌మెంట్‌ సూత్రాలను మిళితం చేయడం ద్వారా సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను తయారు చేయడం, సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే ముందే కస్టమర్‌/ క్లైంట్‌ అవసరాలు స్పష్టంగా గ్రహించి తదనుగుణంగా నడుచుకోగలిగే కెరియర్‌లను పొందగలుగుతారు.

విద్యార్థి ప్రస్తుతం మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ మెకట్రానిక్స్‌లో బాచిలర్స్‌ డిగ్రీ చేస్తున్నాడనుకోండి. అతడికి థర్మల్‌, మాన్యుఫాక్చరింగ్‌, ప్రొడక్షన్‌, మెటీరియల్‌ సైన్సెస్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, రోబోటిక్స్‌, కంప్యూటర్‌ అప్లయిడ్‌ డిజైన్‌/ మాన్యుఫాక్చరింగ్‌ (క్యాడ్‌/ క్యామ్‌), ఎలక్ట్రో మెకానిక్స్‌/ కైనెమాటిక్స్‌, ఏవియేషన్‌ వంటి కోర్‌ సబ్జెక్టులను పరిచయం చేస్తారు.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఓ విద్యార్థి విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ చేస్తున్నట్లయితే పైన చెప్పుకున్న మౌలిక అంశాల్లో పరిశోధన జరిపే అవకాశం లభిస్తుంది. ఈ విద్యాంశాలే కాకుండా విద్యార్థులు తమ పాఠ్యాంశాలకు ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్‌/ ఏవియేషన్‌ ఇంజినీరింగ్‌/ పాకింగ్‌ ఇంజినీరింగ్‌/ బయోకెమికల్‌ ఇంజినీరింగ్‌ వంటి సబ్జెక్టులను చేర్చవచ్చు. ఫలితంగా తమ మౌలిక పరిజ్ఞానానికి అదనపు విజ్ఞానాన్ని జోడించవచ్చు, కొన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా కార్యక్రమాలు నిర్దిష్ట రంగాలపై కేంద్రీకృతమై ఉంటాయి.

ఉదాహరణకు ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ (కొత్త ఇంజిన్‌ల రూపకల్పన/ సస్పెన్షన్‌/ ట్రాన్స్‌మిషన్‌/ స్పేస్‌ రోవర్స్‌/ టైర్‌ టెక్నాలజీ/ ఆటోమేటిక్‌ వెహికల్స్‌/ ఎలక్ట్రో మెకానికల్‌ రోబోట్స్‌), పాకేజింగ్‌ సైన్స్‌ (హార్డ్‌, సాఫ్ట్‌, ఫ్రాగైల్‌, డీఫార్మబుల్‌, ఎక్స్‌పైరీ ప్రాడక్టులకు అవసరమయ్యే పాకింగ్‌ మెకానిక్స్‌ని అర్థం చేసుకోవడం, వినియోగదారుడికి భద్రంగా డెలివరీ అయ్యేలా చూడడం, ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్‌, మెడిసిన్స్‌, బయలాజికల్‌ శాంపుల్స్‌, రాకెట్‌ విడి భాగాలు వంటి ఉత్పత్తులు, బయోమెకానిక్స్‌ (హ్యూమన్‌ బయోలాజికల్‌ ఇంటరాక్షన్‌ విత్‌ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌ డివైజెస్‌- ఫింగర్‌ ప్రింటింగ్‌, టచ్‌ స్క్రీన్‌ వంటివి, బయో ఫ్యూయల్స్‌ రీసెర్చ్‌, ఫ్యూయల్‌ సెల్‌ టెక్నాలజీ, కార్బన్‌ ఫుట్‌ ప్రింట్‌ రెడక్షన్‌ మెకానిజమ్స్‌), ఏవియేషన్‌ రీసెర్చ్‌ (ఇంజిన్లు/ టర్బైన్లతో ఫ్లయిట్‌ రేంజ్‌ను మెరుగుపరచుకోవడం, సోలార్‌ పవర్డ్‌ ఏర్‌క్రాఫ్ట్స్‌, డిజైనింగ్‌ ఎఫిషియంట్‌ వింగ్స్‌/ ఏర్‌ ఫాయిల్స్‌, స్పేస్‌ ఇంజినీరింగ్‌) వంటివి.

ఈ విధంగా విద్యార్థి ఎన్నో కొత్త అంశాలను పరిచయం చేసుకుంటాడు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అంశాలతో కొత్త రంగాల సూత్రాలను మిళితం చేయడం ద్వారా కీలకమైన ఇంజినీరింగ్‌ సూత్రాలను అర్థం చేసుకుని, అమలు చేయడం ద్వారా పథనిర్దేశకాలైన నూతన ఉత్పత్తులను రూపొందించి, ఉత్పత్తి చేయగలుగుతారు.

విద్యార్థి ప్రస్తుతం సివిల్‌/ కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీరింగ్‌లో బాచిలర్స్‌ డిగ్రీ చేస్తున్నాడనుకోండి. అతడికి స్ట్రక్చరల్‌ సైన్స్‌, మెటీరియల్‌ సెలక్షన్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ అనాలిసిస్‌, థర్మల్‌, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌/ మోడలింగ్‌, భారీ నిర్మాణ పరికరాలు, మేనేజీరియల్‌ ఎకనామిక్స్‌ వంటి కోర్‌ సబ్జెక్టులను పరిచయం చేస్తారు.

సివిల్‌ ఇంజినీరింగ్‌/ కన్‌స్ట్రక్షన్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో ఓ విద్యార్థి యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేస్తున్నట్లయితే పైన చెప్పుకున్న మౌలిక అంశాల్లో పరిశోధన జరిపే అవకాశం లభిస్తుంది. ఈ విద్యాంశాలే కాకుండా విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ కోర్సులూ చేయవచ్చు. ఫలితంగా కన్‌స్ట్రక్షన్‌ సైన్స్‌ టెక్నాలజీ/ మేనేజ్‌మెంట్‌ అనే రంగంలో ఉన్నత విద్యను కొనసాగించవచ్చు. తద్వారా తమ మౌలిక పరిజ్ఞానానికి అదనపు విజ్ఞానాన్ని జోడించవచ్చు.

కొన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధన కార్యక్రమాలు నిర్దిష్ట రంగాలపై కేంద్రీకృతమై ఉంటాయి. ఉదాహరణకు- కన్‌స్ట్రక్షన్‌ సైన్స్‌ మేనేజ్‌మెంట్‌ (సీఎస్‌ఎం), మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ (శాప్‌, ఒరాకిల్‌ వంటి ఐటీ సంస్థలు అందించే సాఫ్ట్‌వేర్‌/ మాడ్యూల్స్‌ ఉదాహరణకు- ఎంఎం, సీఎస్‌ఎం, వేర్‌హౌజ్‌ మేనేజ్‌మెంట్‌ వంటివి సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి ఆయా కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులను సులువుగా పూర్తి చేయడానికి దోహదం చేస్తాయి) వంటివి. ఈ విధంగా విద్యార్థి ఎన్నో కొత్త అంశాలను పరిచయం చేసుకుంటారు.

సివిల్‌ ఇంజినీరింగ్‌ అంశాలతో కొత్త రంగాల సూత్రాలను మిళితం చేయడం ద్వారా- కీలకమైన ఇంజినీరింగ్‌ సూత్రాలను అర్థం చేసుకుని, అమలు చేయడం ద్వారా కటింగ్‌ ఎడ్జ్‌ మెగా స్ట్రక్చర్‌, ఫెసిలిటీస్‌, ప్రొడక్షన్‌/ అసెంబ్లీ అంశాల్లో నూతన ఉత్పత్తులను రూపొందించగలుగుతారు.

పై విశ్లేషణ ఆధారంగా... ఉన్నతవిద్యలో విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న కోర్‌ సబ్జెక్టును ఎంచుకోవడం అత్యంత కీలకమని తెలుస్తోంది. అదేవిధంగా అందుబాటులో ఉన్న పరిశోధన అవకాశాలను ఉపయోగించుకోవాలి. వివిధ విశ్వవిద్యాలయాలు అందించే ఉన్నతస్థాయి కోర్సులకీ ఈ అవకాశం వర్తిస్తుంది. కోర్సులను, యూనివర్సిటీలను ఎంచుకునేటపుడు విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం: వసతులు, పరిశోధనాశాలలు, సౌకర్యాల కల్పన విషయం.

ప్రభుత్వ విభాగాలైన, రక్షణశాఖ, రవాణ శాఖ, పరిపాలన శాఖ, సవరణల శాఖ వంటివి కొన్ని విశ్వవిద్యాలయాలకు నిధులు అందిస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో కొనసాగే అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులో పాల్గొనే విద్యార్థులు- తమ జాతీయతతో సంబంధం లేకుండా మాస్టర్స్‌/ డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌లను సులువుగా కొనసాగించవచ్చు.

ఈవిధంగా ప్రతి విద్యార్థీ ఇదివరకు అన్వేషించని కొత్త పురోగమన అవకాశాలను జాగ్రత్తగా పరిశోధించాలి. ప్రామాణిక టెస్టులకు సిద్ధమవుతున్నా, విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించినా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

రచయితవిద్య ఎస్‌.వి. ఎడ్యుకేషన్‌ గ్రూప్‌ డైరెక్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని