Brother Anil: దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్‌ అనిల్‌

దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్‌ అనిల్‌ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు.

Published : 29 Apr 2024 16:00 IST

బద్వేల్‌: దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్‌ అనిల్‌ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేమన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు డబ్బు, పదవి కోసం అమ్ముడుపోతారని వ్యాఖ్యానించారు. తప్పును కప్పిపుచ్చుకోవడం కూడా దేవుడి దృష్టిలో తప్పేనని చెప్పారు.

‘‘ఎవరేం చేసినా వారి మనసుకు, మనిషికి తెలుస్తుంది. ఎవరికీ చెడు, అన్యాయం చేయొద్దు. న్యాయమే చేయాలి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. న్యాయం చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. దానిని సరైన రీతిలో వినియోగించాలి. రాజకీయంలో న్యాయం, అన్యాయం ఉంటుంది. అన్యాయం చేసినవారికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్‌ చేసుకున్నా, దేవుడి దగ్గరికి వెళ్లాక శిక్ష తప్పదు’’ అని అనిల్‌ అన్నారు.

వివేకా మంచి నేత

మాజీ మంత్రి వివేకా హత్యపైనా బ్రదర్‌ అనిల్‌ స్పందించారు. ఆయన్ని హత్య చేయడం చాలా బాధాకరమన్నారు. ఆయన చాలా మంచి నాయకుడని, వైఎస్‌ఆర్‌ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఇక్కడి వ్యవహారాలన్నీ చక్కదిద్ది, ఆయనకు కుడి భుజంగా వ్యవహరించే వారని చెప్పారు. వివేకా హత్యలాంటి ఘటనలు ఎవరి విషయంలోనూ జరగకూడదన్నారు.

ఎప్పటికీ న్యాయానిదే విజయమని, డబ్బు వ్యామోహంతో కక్కుర్తి పడవద్దని రాజకీయ నాయకులను, ప్రజలను కోరారు. రాజు మంచిగా ఉంటే ప్రజలు మంచిగా ఉంటారన్న ఆయన.. చిత్తశుద్ధితో వస్తే అందరికీ మేలే జరుగుతుందన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని