అమెరికాలో అడుగుపెట్టాక...

పీజీ కోర్సులు చదవటానికి అమెరికా ప్రయాణమై వెళ్ళే భారతీయ విద్యార్థులు ఆ దేశంలో గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి....

Published : 14 Jan 2016 19:44 IST

అమెరికాలో అడుగుపెట్టాక...

పీజీ కోర్సులు చదవటానికి అమెరికా ప్రయాణమై వెళ్ళే భారతీయ విద్యార్థులు ఆ దేశంలో గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. వాటిని శ్రద్ధగా పాటించాలి. అప్పుడే ఉన్నత విద్యాభ్యాసం విజయవంతంగా ముగిసి, ఉజ్వల భవితకు బాట ఏర్పడుతుంది!

  1. ముందుగానే చేరుకోవాలి: సరిగ్గా కళాశాల తరగతులు ప్రారంభమయ్యే రోజు కాకుండా కనీసం రెండు మూడు రోజుల ముందే అక్కడికి చేరుకునేలా ప్రణాళిక వేసుకోవాలి. ఇలా చేస్తే- అనుకూలమైన వసతి సమకూర్చుకోవటం, వాతావరణ పరిస్థితులూ, పరిసరాలపై అవగాహన పెంచుకోవటం మొదలైనవి సాధ్యమవుతాయి.

2. సరైన నివాస వసతి : ఆన్‌క్యాంపస్‌ నివసించటం ఎల్లప్పుడూ ఉత్తమం. అలా వీలవనపుడు కనీసం క్యాంపస్‌కు దగ్గర్లో బస చేసేలా చూసుకోవాలి. కానీ చాలామంది డబ్బు మిగులుతుందనే కారణంతో తమ విద్యాసంస్థలకు ఎంతో దూరంలో వసతిని ఏర్పాటు చేసుకుంటుంటారు. దీనివల్ల ఆర్థిక లాభం ఉండొచ్చు గానీ, అంతిమంగా ఏదో ఒక కారణంతో తరగతులకు గైర్హాజరవటం పెరగవచ్చు. ఇది విద్యాభ్యాసంపై, మార్కుల శ్రేణిపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఆఫ్‌ క్యాంపస్‌ను ఎంచుకునేవారు ఈ విషయం గమనించాలి.

3. సరిపోను ఆర్థిక వనరులు:   అడ్మిషన్‌ పొందిన విద్యాసంస్థలో ట్యూషన్‌ ఫీజును అమెరికాకు వెళ్ళేముందే చెల్లించాలి. అప్పుడు చెల్లించని పక్షంలో వెళ్ళగానే చెల్లించటానికి వీలుగా నగదు/ క్రెడిట్‌కార్డు సిద్ధం చేసుకోవాలి. అలాగే ప్రతి సెమిస్టర్‌ వివరాలు తెలుసుకుని, నిర్దిష్ట గడువులోపలే ఫీజు చెల్లించటానికి ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకోవాలి. నివసించే ప్రాంతాన్ని బట్టి నెలకు జీవన వ్యయం 400 నుంచి 1200 డాలర్లు ఖర్చవుతుంది. మూడు నుంచి ఆరు నెలల ఖర్చుకు సరిపడే మొత్తాన్ని ప్రయాణమపుడే వెంట తీసుకువెళ్లటం సమంజసం.

4. టైమ్‌ జోన్‌కు సర్దుబాటవడం:  భారత్‌ నుంచి ప్రయాణమై విమానం దిగేటపుడు అమెరికాలో రాత్రి కాకుండా పగలు అవుతుంది. కానీ సహజంగానే శరీరం నిద్రకు సిద్ధమవుతుంది. జెట్‌లాగ్‌, టైమ్‌ జోన్‌ సమస్యలు ఉంటాయి. నిజమే! కానీ అలాంటపుడు పూర్తిగా నిద్రపోకుండా గరిష్ఠంగా మెలకువగా ఉండటానికి ప్రయత్నించటం మేలు. రెండు మూడు రోజులు ఇది కష్టం కావొచ్చు. ఇది చెయ్యకపోతే కళాశాల లేనప్పుడు ఇబ్బంది లేకపోయినా తరగతులు ప్రారంభమైనపుడు ఈ అలవాటు సమస్యను కలుగజేస్తుంది.

5. కళాశాలలో నమోదవటం: అక్కడికి చేరుకున్నాక చేరబోయే క్యాంపస్‌ను సందర్శించి, పేరు నమోదు చేసుకోవటం ముఖ్యం. ఇలా చేస్తే 1-2 రోజుల్లో స్టూడెంట్‌ ఐడీ మంజూరవుతుంది. ఈ ఐడీ... ఫోన్‌ సిమ్‌ కార్డు దగ్గర్నుంచి బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచేపని వరకూ చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది.

6. స్టూడెంట్‌ అడ్వైజర్‌ను కలుసుకోవడం: ప్రతి విశ్వవిద్యాలయంలోనూ ఈ సలహాదారు ఉంటారు. విద్యార్థులు వీరిని కలుసుకోవడం చాలా అవసరం. ఈ సలహాదారు విద్యార్థికి అవసరమైన దాదాపు ప్రతి విషయంలో అధీకృత సమాచారం అందించి సహకరిస్తారు. బ్యాంకు అకౌంట్‌ తెరవటం, హాస్టల్‌ వసతి ... ఇలా ఏ అంశంలోనైనా వీరి సహకారం పొందవచ్చు.

7. చట్టపరమైన పరిస్థితుల పరిజ్ఞానం: ఎఫ్‌-1 వీసా ఉన్నవారు క్యాంపస్‌లో మాత్రమే- అది కూడా పార్ట్‌టైమ్‌ పని చేయటానికి మాత్రమే చట్టపరంగా అనుమతి ఉంది. కొన్ని పరిస్థితుల్లో క్యాంపస్‌ బయట పనిచేయవచ్చు. అదెప్పుడంటే... ఫ్యాకల్టీ లేదా ప్రొఫెసర్‌ సిఫార్సుమేరకు తాము చదివే అంశంలోని స్పెషలైజేషన్‌కు సంబంధించి పార్ట్‌టైమ్‌ విధులు నిర్వహించవచ్చు. ఈ నిబంధనను తప్పనిసరిగా పాటిస్తే విద్యాభ్యాస కాలంలో ఎలాంటి సమస్యలూ ఎదురు కావు.

8. అమెరికన్‌ విద్యావిధానంపై అవగాహన: మనదేశంలోని విద్యావిధానానికీ, అమెరికాలోని విద్యావిధానానికీ చాలా తేడా ఉంది. మనది థియరిటికల్‌ అయితే అక్కడ ఎక్కువ ప్రాక్టికల్‌. అసైన్‌మెంట్లకు వారు చాలా ప్రాధాన్యం ఇస్తారు. వాటిమీద అధికంగా ఆధారపడే జీపీఎను నిర్ణయిస్తారు. అలాగే అసైన్‌మెంట్లు ఇతరుల నుంచి కాపీ చేయకుండా ఒరిజినల్‌గా ఉండటం తప్పనిసరి. ఈ మార్పును పాటించి, అలవాటుపడటానికి సిద్ధం కావాలి.

9. అంతర్జాతీయ విద్యార్థులతో స్నేహం: అమెరికాలో విద్య అంటే భిన్న సంస్కృతుల సమ్మేళనం. ఆ ‘ఎక్స్‌పోజర్‌’తో లాభం పొందగలిగేలా ఇతర దేశాల విద్యార్థులతో స్నేహసంబంధాలు పెంచుకోవాలి. దీనివల్ల ఇంగ్లిష్‌ భాషా సామర్థ్యం, ఇతర నైపుణ్యాలు కూడా కూడా గణనీయంగా మెరుగుపడతాయి. అక్కడ కూడా భారతీయులతో, తెలుగు రాష్ట్రాలవారితోనే స్నేహాలను పరిమితం చేస్తే నేర్చుకోగలిగేది పరిమితమే.

10. భద్రత చాలా ముఖ్యం: కొత్తలో నివసించే ప్రాంతం అలవాటయ్యేవరకూ ఆహార, విహారాలూ, స్వీయ భద్రత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత కూడా ఈ విషయం గమనంలో ఉంచుకోవటం మంచిది. వీలైనంతవరకూ బృందంతో పాటు బయటికి వెళ్ళటం, రాత్రి వేళల్లో బయట ఉండకపోవటం... ఇలాంటివి పాటించాలి.

11. స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు: మనదేశంతో పోలిస్తే అమెరికాలో సామాజికంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలు చాలా ఎక్కువ. తల్లిదండ్రులు కూడా దగ్గర్లో ఉండరు కాబట్టి విద్యార్థులు తమకు లభించే స్వేచ్ఛను దుర్వినియోగం చేసే ప్రమాదం రానీయకూడదు. ఇతర అంశాలపై దృష్టి పోనీయకుండా చదువుమీదే మనసును లగ్నం చేస్తే... లక్ష్యం నెరవేర్చుకోవటంలో ఎలాంటి అవరోధాలూ ఎదురు కావు.

అంతర్జాతీయ స్టూడెంట్‌ అడ్వైజర్లు ఇలాంటి ఎన్నో అంశాలపై విదేశీ విద్యార్థులకు అవసరమైన సమాచారం అందిస్తారు; అన్ని విషయాల్లో తగిన సహకారం అందిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని