యూఎస్‌ వీసా విజయోస్తు!

విద్యాభ్యాసం కోసం ఇతర దేశాలకు వెళ్ళే విద్యార్థులు కీలకంగా భావించే ఘట్టం వీసా మంజూరు. అమెరికాలాంటి దేశాలు ఈ ప్రక్రియను క్లిష్టతరం చేయటం మూలంగా కొద్ది సంవత్సరాలుగా మన విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. తగిన అవగాహన, ముందస్తు సన్నద్ధత....

Published : 14 Dec 2017 02:12 IST

యూఎస్‌ వీసా విజయోస్తు!

విద్యాభ్యాసం కోసం ఇతర దేశాలకు వెళ్ళే విద్యార్థులు కీలకంగా భావించే ఘట్టం వీసా మంజూరు. అమెరికాలాంటి దేశాలు ఈ ప్రక్రియను క్లిష్టతరం చేయటం మూలంగా కొద్ది సంవత్సరాలుగా మన విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. తగిన అవగాహన, ముందస్తు సన్నద్ధత ఏర్పరచుకుంటే వీసా విజయం సులువే!
డిసెంబరు వచ్చిందంటే వీసా హడావుడి మొదలవుతుంది. అమెరికాలాంటి దేశాలకు ఉన్నతవిద్య కోసం వెళ్ళాలనుకునే విద్యార్థులు దీనికి తగిన సన్నాహాల్లో ఉంటారు. ఎందుకంటే... అక్కడి చాలా విశ్వవిద్యాలయాల్లో స్ప్రింగ్‌ ప్రవేశాలు ఆరంభమయ్యేది జనవరి నెల్లోనే!

విద్యార్థులు తమకు ప్రవేశాలు లభించిన విశ్వవిద్యాలయాల్లోంచి ఒకదాన్ని ఎంచుకోవటం మొదటి మెట్టు. తర్వాత దృష్టిపెట్టాల్సినవి- ఫండింగ్‌, డాక్యుమెంట్లు; వీసా స్లాట్‌ బుకింగ్‌, ఇతర అంశాలు.

1 విశ్వవిద్యాలయ ఎంపిక 

మన భారతీయ విద్యార్థులు ఐదారు విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేస్తుంటారు. ఎందుకంటే యు.ఎస్‌. విద్యాసంస్థల్లో ప్రవేశం పొందటం ఎంతో పోటీతో కూడుకున్న విషయం. చేరదల్చుకున్న యూనివర్సిటీ గుర్తింపు తదితర అంశాలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలి. అక్కడ ప్రవేశం ఖరారు చేసే ఫ్యాకల్టీ .. అందిన దరఖాస్తుల సంఖ్య, సీట్ల లభ్యత మొదలైనవాటిని బేరీజు వేసుకుని నిర్ణయం ప్రకటిస్తుంది.

పొందిన అడ్మిట్స్‌లో ఏ విశ్వవిద్యాలయానికి సంబంధించినది ఎంచుకోవాలో నిర్ణయించుకోవటం విద్యార్థులకూ, వారి తల్లిదండ్రులకూ సవాలు. ఈ నిర్ణయానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు:

* విద్యార్థి ప్రొఫైల్‌ను బట్టి ఆ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేయటానికి వీసా వచ్చే అవకాశముందా?
* విద్యార్థి ఆసక్తికి అనుగుణమైన కరిక్యులమ్‌ అందించే కోర్సేనా?
* విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతం అనుకూలమైనదేనా?
* భారతీయ విద్యార్థులకు భద్రతనిచ్చే విద్యాసంస్థగా పేరుందా?
* అభ్యర్థి ఆర్థిక పరిస్థితులకు అనువైన ట్యూషన్‌ ఫీజును వసూలు చేసే విద్యా సంస్థేనా?
* వాతావరణ పరిస్థితులు అనుకూలమేనా?
* గ్రాడ్యుయేట్‌ /టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌/ స్కాలర్‌షిప్‌ లభిస్తుందా?
* యూనివర్సిటీ ప్రాంతంలో జీవన వ్యయం అనుకూలంగా ఉందా?
* ఆ యూనివర్సిటీలో పరిశోధన కార్యకలాపాలు ఎలా ఉన్నాయి?

లిక్విడ్‌ ఫండ్స్‌గా ఏం ఉండొచ్చంటేే...
1. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (కనీసం ఆరు నెలల క్రితం చేసినవి)
2. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మొత్తం (అప్పటికప్పుడు జమచేసినవి కావు)
3. విద్యారుణం 4. పోస్టల్‌ బాండ్స్‌
5. ప్రభుత్వం లేదా సంస్థల నుంచి పొందే ఫండింగ్‌ లేదా స్కాలర్‌షిప్‌లు.

ఫిక్స్‌డ్‌ అసెట్స్‌ అంటే..
ప్లాట్లు, ఫ్లాట్లు, ఇల్లు, స్థలాలు, పొలాలు (పొలాల విషయంలో గ్రామ ఎంఆర్‌ఓ నుంచి సర్టిఫికెట్‌ తప్పనిసరి).

వార్షికాదాయం అంటే..
* వేేతనాల ఆదాయం, వ్యాపార ఆదాయం, వ్యవసాయ ఆదాయం, అద్దెలు, ఇతర ఆదాయాలు.
* ఏడాదికి రూ.ఆరు లక్షలు, అంతకుమించి ఆదాయం ఉంటే తప్పక వీసా పొందే అవకాశాలు పెరుగుతాయి.
* ఫండ్లు, ఆదాయం పైన పేర్కొన్న వనరుల నుంచి ఉమ్మడిగా లేదా ఏదో ఒకదాని నుంచి వచ్చేలా ఉన్నా మంచిదే. యూఎస్‌ఏలో విద్యనభ్యసించడానికి విద్యార్థికి పటిష్ఠమైన ఆర్థిక వనరులు ఉండాలని వీసా అధికారులు ఆశిస్తారు. ఎక్కువ మొత్తంలో నిధులు ఉండటం మంచిదే కానీ, తప్పనిసరి మాత్రం కాదు.

2 స్లాట్‌ బుకింగ్‌ 

వీసా స్లాట్‌ నమోదుకు ముందు విద్యార్థి డీఎస్‌-160 ఫారాన్ని ఆన్‌లైన్‌లో పూరించాల్సి ఉంటుంది. ఇదిhttps://ceac.state.gov/genniv/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. సీఈఏసీ బార్‌కోడ్‌ సంఖ్య ఉన్న కన్ఫర్మేషన్‌ పేజ్‌ను విద్యార్థి తప్పనిసరిగా ప్రింట్‌ తీసుకోవాలి. వీసా ఫీజు చెల్లించడానికీ, వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌కూ ఈ సంఖ్య తప్పనిసరి.

ఫీజు చెల్లింపులోని అంచెలు
http://www.ustraveldocs.com/in/index.html?firstTime = no లో వ్యక్తిగత, పాస్‌పోర్ట్‌, ఎస్‌ఈవీఐఎస్‌, చిరునామా వివరాలు, డీఎస్‌-160 ఫారం ఖరారు సంఖ్యతో కూడిన వివరాలతో అకౌంట్‌ తయారు చేసుకోవాలి. ఈ వివరాలన్నీ ఇచ్చాక వీసా ఫీజును చెల్లించే విధానం గురించిన ఆప్షన్‌ లభిస్తుంది.

వీసా ఫీజును 4 విధానాల్లో చెల్లించవచ్చు.
1. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌)
2. మొబైల్‌ పేమెంట్స్‌- ఐఎంపీఎస్‌
3. క్యాష్‌- డీఆర్‌యూకే బ్యాంకు కౌంటర్‌లో
4. క్యాష్‌- ఆక్సిస్‌ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌ కౌంటర్లు

ఈ నాలుగు విధానాల్లో ఏదో ఒకదాని ద్వారా విద్యార్థులు ఫీజును చెల్లించి, రశీదు సంఖ్యను పొందవచ్చు. 24 గంటల్లో వీసా అపాయింట్‌మెంట్‌ను నమోదు చేసుకోవడానికి ఆక్టివేట్‌ అవుతుంది. వీసా అపాయింట్‌మెంట్‌ తేదీకి ముందు ఓఎఫ్‌సీ సెంటర్‌లో వేలిముద్రలు ఇవ్వడానికి అపాయింట్‌మెంట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

ఓఎఫ్‌సీ సెంటర్‌కు తీసుకెళ్లాల్సిన పత్రాలు
పాత, కొత్త పాస్‌పోర్ట్‌, ఐ-20, డీఎస్‌-160 కన్ఫర్మేషన్‌ పేజీ, అపాయింట్‌మెంట్‌ కన్ఫర్మేషన్‌ లేఖ, వీసా ఫీజు రశీదు.
వీసా ఇంటర్వ్యూకు వెళ్లేముందు విద్యార్థులు www.fmjfee.com ద్వారా ఎస్‌ఈవీఐఎస్‌ ఫీజు- 200 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూకు తీసుకువెళ్లాల్సినవి
* పదోతరగతి (ఒరిజినల్‌)
* ఇంటర్‌/12 (ఒరిజినల్‌)
* గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్లు (మార్క్‌ షీట్లు, ప్రొవిజినల్‌, కన్సాలిడేటెడ్‌)
* అన్ని స్కోరు కార్డులు (టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ, జీమ్యాట్‌ మొ॥వి)
* ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ ఆక్టివిటీస్‌ సర్టిఫికెట్లు
* ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్లు (సీఏ, సీఈ రిపోర్ట్‌లు, అఫిడవిట్‌ ఆఫ్‌ సపోర్ట్‌ మొ॥వి).

3 డాక్యుమెంటేషన్‌- ఆర్థికాంశాలు

ల్లిదండ్రులు దరఖాస్తు ప్రక్రియ సమయంలోనే ఆర్థిక సంబంధ అంశాలను చూసుకోవాలి. అప్పుడే చివరి నిమిషంలో ఒత్తిడికి గురవకుండా ఉండొచ్చు. వీసా దరఖాస్తుకు ముందే వీటిని గమనించాల్సిన అవసరముంది.

విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు విశ్వవిద్యాలయం, అది నెలకొన్న ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. ఐ-20లో ఒక సంవత్సరానికి సుమారుగా ఎంత ఖర్చవుతుందో ముద్రించి ఉంటుంది. ఇమిగ్రేషన్‌ నిబంధనల ప్రకారం.. విద్యార్థి ఐ-20లో ఉన్న మొత్తం కంటే దానితో సమానంగా లిక్విడ్‌ ఫండ్స్‌ చూపించవచ్చు.

రెండు సంవత్సరాల ట్యూషన్‌ ఫీజు, ఏడాది జీవన వ్యయాన్ని చూపించడం ఎల్లప్పుడూ మంచిది.

స్పాన్సర్‌గా ఉండే వ్యక్తి దరఖాస్తుదారు, తల్లిదండ్రులు, తాతయ్య-అమ్మమ్మ/నానమ్మ, దగ్గరి బంధువులు ఇలా ఎవరైనా అవ్వొచ్చు. కానీ వారు తప్పకుండా లిక్విడ్‌ ఫండ్స్‌తోపాటు, ఫిక్స్‌డ్‌ అసెట్‌లనూ చూపించాల్సి ఉంటుంది.

4 ముఖాముఖిలో...

న్ని డాక్యుమెంట్లూ సిద్ధం చేసుకుంటే పేపర్‌ వర్క్‌ పూర్తయినట్టు. ఇవన్నీ తప్పని సరిగా సిద్ధం చేసుకోవాల్సిందే. దీంతోపాటు వీసా ముఖాముఖి (ఇంటర్వ్యూ)కి కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, యు.కె. ఇంకా చాలా దేశాలకు వెళ్ళాలంటే వీసా ఇంటర్వ్యూ ఉండదు. ఆ దేశాల్లో డ్రాప్‌ బాక్స్‌ పద్ధతిని అనుసరిస్తారు. కానీ వీసా ఇంటర్వ్యూను నిర్వహించే కొద్ది దేశాల్లో యు.ఎస్‌.ఎ. ఒకటి.

సూటిగా... క్లుప్తంగా
* వరుసక్రమంలో నిల్చున్నప్పటి నుంచే విద్యార్థులను గమనిస్తూ ఉండొచ్చు. అంటే, వరుసలో నిల్చున్నప్పుడు విద్యార్థి ప్రవర్తన, వైఖరి, వ్యక్తిత్వం లాంటి అంశాలను అంచనావేసే అవకాశమూ ఉంది.
* వీసా ఇంటర్వ్యూ వ్యవధి చాలా కొద్ది సమయమే ఉంటుంది. సగటున 2 నుంచి 5 నిమిషాల్లో ఇది ముగుస్తుంది. ఎప్పుడైనా అంతకంటే ఎక్కువ సమయమూ తీసుకోవచ్చు. అందువల్ల విద్యార్థి చెప్పే సమాధానాలు క్లుప్తంగా, సూటిగా ఉండాలి.
* వీసా ప్రశ్నలు సాధారణంగా విద్యార్థి చుట్టూ, చదవబోయే విశ్వవిద్యాలయం చుట్టూ తిరుగుతాయి. ఎందుకీ యూనివర్సిటీని ఎంచుకున్నారు, కోర్సు తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు.. ఇలాంటి ప్రశ్నలను అడుగుతారు. విద్యార్థి వ్యక్తిగతం, కుటుంబం, భవిష్యత్తు ఆలోచనల గురించిన ప్రశ్నలు కూడా ఎదురవుతాయి.
* అమెరికాలో కోర్సు పూర్తయ్యేంతవరకు సరిపోయేంత డబ్బులు ఉన్నాయని విద్యార్థి ఆర్థికపత్రాలు, స్పాన్సర్‌ వివరాల ఆధారంగా వీసా అధికారికి నమ్మకం కలగాలి. స్పాన్సర్‌ వార్షికాదాయం, ఒకవేళ అప్పులుంటే వాటి వివరాలు పేర్కొనాలి. విద్యార్థి సమర్పించే వివరాలన్నింటినీ సాధికారికంగా బలపరిచే ఆర్థికపత్రాలను సమర్పించాలి.
* ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పటం చాలా ప్రధానం. చెప్పే విషయంపై అవగాహన, మాటల్లో స్పష్టత అవసరం.
* హడావుడిగా జవాబులు చెప్పకూడదు. అలాగే అతివిశ్వాసం ప్రదర్శించకూడదు.
* నిపుణులు నిర్వహించే నమూనా ఇంటర్వ్యూల్లో పాల్గొడం మంచిదే. ఎక్కడ తడబాటుకు గురవుతున్నారో, ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి, వాటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి మెరుగుపరచుకునే వీలుంటుంది.
* ముందస్తుగా తగిన విధంగా సన్నద్ధమై ముఖాముఖికి హాజరైతే వీసా మంజూరయ్యే అవకాశాలు ఎక్కువ.

ప్రవేశానికి అధికారిక అనుమతి

వరైనా తమది కాని దేశంలోకి ప్రవేశించాలంటే అక్కడి ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రవేశ అనుమతిని అభ్యర్థిస్తూ చేసే దరఖాస్తును ఆ దేశపు ఇమిగ్రేషన్‌ అధికారులు పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తుదారుడికి మంజూరు చేసే అధికారిక ప్రవేశ అనుమతినే ‘వీసా’ అంటారు. సాధారణంగా అమెరికాకు ఉన్నతవిద్యకు వెళ్లే విద్యార్థులకు ఎఫ్‌-1 (నాన్‌-ఇమిగ్రెంట్‌) వీసా ఇస్తారు. యూఎస్‌ ప్రభుత్వం నుంచి అక్రెడిటేషన్‌ పొందిన యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ పొందినవారికి ఈ వీసా లభిస్తుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని