upcoming movies: వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్‌.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

గత నెల రోజులుగా బాక్సాఫీస్‌ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి

Updated : 29 Apr 2024 11:33 IST

లాంగ్‌ గ్యాప్‌ తర్వాత కామెడీతో...

పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్‌ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా?తదితర విషయాలు తెలియాలంటే ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku) చిత్రం చూడాల్సిందే. అల్లరి నరేశ్‌ (Allari Naresh) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) కథానాయిక. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్‌ చిలక నిర్మాత. మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కామెడీ సినిమాతో  అల్లరి నరేశ్‌ వస్తుండటం, ప్రచార చిత్రాలు సైతం నవ్వులు పంచడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి.


ఫేస్‌ బ్లైండ్‌నెస్‌  కాన్సెప్ట్‌తో..

ఇప్పటివరకూ వెండితెరపై వివిధ కాన్సెప్ట్‌లతో చిత్రాలు అలరించాయి. ఈసారి ‘ఫేస్‌ బ్లైండ్‌నెస్‌’తో థ్రిల్‌ పంచేందుకు వస్తున్నారు సుహాస్‌ (Suhas). ఆయన కీలక పాత్రలో అర్జున్‌ వై.కె దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జె.ఎస్‌ మణికంఠ, టి.ఆర్‌.ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటివరకూ వచ్చిన థ్రిల్లర్‌ మూవీలకు పూర్తి భిన్నంగా మూవీ ఉంటుందని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో బాధపడే సూర్య అనే యువకుడు మూడు మ‌ర్డ‌ర్ కేసుల్లో ఇరుక్కొంటాడు. మరి ఆ కేసుల్లోంచి ఎలా త‌ప్పించుకొన్నాడు? అస‌లు హంత‌కుడ్ని చ‌ట్టానికి ఎలా అప్ప‌గించాడు? అనేదే క‌థ‌.


తల్లీ కూతురు సెంటిమెంట్‌తో‘శబరి’

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో  అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శబరి’ (Sabari). మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకిలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించామని, అనూహ్యమైన మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతుందని చిత్ర బృందం చెబుతోంది. తెలుగులో వరలక్ష్మీ నటించిన తొలి నాయిక ప్రధానమైన చిత్రం ఇదే కావడం గమనార్హం.


మరో హారర్‌ కామెడీ థ్రిల్లర్‌

సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak). ఖుష్బు సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా (Tamannaah), రాశీ ఖన్నా (Rashi Khanna) కథానాయికలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 26న విడుదల చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విజయవంతమైన హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ ‘అరణ్‌మనై’ నుంచి వస్తున్న 4వ చిత్రమిది.


యథార్థ సంఘటనలతో..

‘ఉయ్యాల జంపాల’తో యువతను ఆకట్టుకున్న ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ. కొన్నేళ్ల విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ‘జితేందర్‌రెడ్డి’. ‘బాహుబలి’తో గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌వర్రే కథానాయకుడు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 3నప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు ఇవే..!

  • అమెజాన్‌ ప్రైమ్‌
  • ది ఐడియా ఆఫ్‌ యూ (హాలీవుడ్‌) మే 2
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • ది వీల్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 30
  • నెట్‌ఫ్లిక్స్‌
  • డియర్‌ (తమిళ/తెలుగు) ఏప్రిల్‌ 28
  • బాయిలింగ్‌ పాయింట్‌-1 (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 29
  • హీరామండి (హిందీ సిరీస్‌) మే 1
  • షైతాన్‌ (హిందీ) మే 3
  • ది ఎ టిపికల్‌ ఫ్యామిలీ (కొరియన్‌) మే 4
  • జియో సినిమా
  • హాక్స్‌3 (వెబ్‌సిరీస్‌) మే 3
  • వోంకా (హాలీవుడ్‌) మే 3
  • ది టాటూయిస్ట్‌ ఆఫ్‌ ఆష్‌విజ్‌ (వెబ్‌సిరీస్‌) మే 3
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని