Corporate Parties: సరదా పార్టీల పరదా వెనక..!

Eenadu icon
By Features Desk Published : 17 Sep 2025 03:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

టీమ్‌ డిన్నర్లు, సక్సెస్‌ సెలబ్రేషన్లు, అవార్డ్‌ నైట్లు అంటూ కార్పొరేట్‌ సంస్థల్లో వివిధ పార్టీలు జరుపుకుంటారు. ఉద్యోగుల మధ్య పరస్పర సంబంధాలు మెరుగుపరచడమే వీటి ప్రధాన ఉద్దేశం. కొత్తగా కొలువులో చేరినవారు ఈ సందర్భంగా ఏయే విషయాలు గమనించాలి?

ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణం సృష్టించడం ఈ పార్టీల ప్రత్యక్ష ప్రాధాన్యం. అయితే ఎవరు ఎవరితో సన్నిహితంగా ఉన్నారు, ఈ స్వేచ్ఛను ఎవరైనా అనవసర ప్రయోజనాలకు ఉపయోగించుకొంటున్నారా లాంటి కనిపించని వ్యూహాత్మక ఉద్దేశాలూ ఈ తరహా పార్టీల వెనక ఉంటాయి. ఆఫీస్‌ వాతావరణంలో చొరవగా మాట్లాడలేని ఎన్నో విషయాలు పార్టీ కల్చర్‌లో గాసిప్స్‌ అవుతాయి. ఇన్‌ఫార్మల్‌ కమ్యూనికేషన్, ఇన్‌ఫార్మల్‌ పాలిటిక్స్‌లకు ఈ పార్టీలు వేదికలవుతాయి. 
రాజేష్‌ ఎంబీఏ చదివి ఒక బహుళజాతి సంస్థలో మార్కెటింగ్‌ ట్రెయినీగా చేరాడు. న్యూ ప్రొడక్ట్‌ లాంచింగ్‌ పార్టీలో తన సరదా వ్యాఖ్యలతో అందరినీ అలరించాడు. సహోద్యోగుల చప్పట్ల మధ్య మరింత ఉత్సాహంతో సీనియర్లపై వ్యక్తిగతంగా జోక్స్‌ వేశాడు. అతడి హాస్య చతురతకు అందరూ సంతోషించారు. రెండు వారాల తర్వాత కంపెనీకి కొత్త ఆర్డర్ల్లూ, ప్రాజెక్ట్‌లూ వచ్చాయి. రాజేష్‌కు ప్రాజెక్ట్‌ కేటాయించలేదు. అందరితో స్నేహంగా ఉండాలన్న హద్దులు దాటిన ఆనందం మూలంగా ఇలా ఉద్యోగంలో తన ప్రాధాన్యం కోల్పోయాడు. 
కొత్తగా ఉద్యోగంలో చేరినవారు వేడుకల్లో సీనియర్ల, ఇతర సహోద్యోగుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తించాలి. అనుదిన ఆఫీస్‌ జీవితమే ప్రధానమన్నది దృష్టిలో ఉంచుకోవాలి. కొన్నిసార్లు హద్దులు దాటిన ఆనందం కూడా కెరియర్‌ వృద్ధికి హానికరం కావచ్చు.

1. హద్దులు పాటిస్తే అద్భుత అవకాశాలు

కార్పొరేట్‌ సంస్థల్లో సాధారణ పని రోజుల్లో ఉన్నతాధికారులను కలవడం, వారితో మాట్లాడటం కొంత శ్రమతో కూడుకున్న పని. అయితే పార్టీలు, సోషల్‌ గేదరింగ్‌లలో సీనియర్లతో, ఉన్నతస్థాయి అధికారులతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులకు నమ్మదగిన వ్యక్తిగా అనిపిస్తే ఈ పరిచయాలు ఉద్యోగిని కెరియర్‌లో గొప్ప స్థాయికి తీసుకువెళతాయి. 
స్వప్న ట్రెయినీగా ఉద్యోగంలో చేరిన నెల రోజుల్లోనే ఒక పార్టీకి హాజరయ్యే అవకాశం వచ్చింది. మంచి డ్రెస్‌ సెన్స్, ప్రవర్తనతో సీని యర్లతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ ఆ పార్టీలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. 
ఒకరిద్దరు ఆమెను ప్రేరేపించినప్పటికీ వారిని గమనించనట్లు ప్రవర్తించింది. మరో రెండు నెలల్లో ఆమెకు కొన్ని మంచి అవకాశాలు వచ్చి స్వల్ప కాలంలోనే ఆమె టీమ్‌ లీడర్‌ కాగలిగింది.

2. సోషల్‌ మీడియా పోస్టులతో జాగ్రత్త

వేడుకల్లో సరదాగా ఫొటోలూ, సెల్ఫీలూ దిగి, ఆ ఆనందమయ క్షణాలను భద్రపరచుకోవాలనుకోవడం మంచి విషయం. కొందరికి ఫొటోలూ, సెల్ఫీలూ ఇష్టం ఉండకపోవచ్చు. ఇలాంటివారి అనుమతి లేకుండా వారి ఫొటోలూ, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం సరికాదు. ఎవరితోనైనా ఫొటో దిగి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలనుకొంటే సంబంధిత వ్యక్తుల నుంచి ‘ఓకే టూ పోస్ట్‌’ అని అనుమతి తీసుకోవాలి. ఎవరితో ఫొటో దిగుతున్నాం, ఎవరిని ఫొటో తీస్తున్నాం, ఎవరి ఫొటోలు షేర్‌ చేస్తున్నామన్నది సున్నితమైన అంశం. 

3. పార్టీలను వినోద సాధనాలుగానే చూడొద్దు

సంస్థ హోస్ట్‌ చేసే పార్టీలను నెట్‌వర్కింగ్‌ విస్తరణకూ, నాలెడ్జ్‌ షేరింగ్‌కూ విలువైన అవకాశంగా చూడాలి. కొత్త వ్యక్తులు, వివిధ డిపార్ట్‌మెంట్ల ఉద్యోగులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మేధావులు స్థాయికి అతీతంగా పార్టీల్లో అందరితో కలుపుగోలుగా ఉంటారు. వీరితో ఏర్పడే మానవ సంబంధాలతో కొత్త సర్కిల్స్‌ ఏర్పడి భవిష్యత్తులో ఒక కొలాబరేటివ్‌ వర్కింగ్‌కు సహకరించవచ్చు.

4. అతిగా గాసిప్‌ సరికాదు

ఈవినింగ్‌ పార్టీల్లో జరిగే చర్చలకు హద్దులూ, నియమ నిబంధనలూ రాసిపెట్టి ఉండవు. ఈ పార్టీల్లో మాటలు ఎక్కడ మొదలై ఎక్కడయినా ముగియవచ్చు. ఒక్కోసారి మాటలు మన నియంత్రణ తప్పుతుంటాయి. మాటల అర్థాలూ మారిపోతుంటాయి. కొన్నిసార్లు ఇతరుల వ్యక్తిగత విషయాలూ, తెలిసీ తెలియని రహస్యాలూ, ఇతరుల వ్యక్తిత్వాలపై గాసిప్‌లూ మాట్లాడటం వల్ల ఆ క్షణానికి మీరొక హీరోగానూ, ఇన్ఫర్మేషన్‌ బ్యూరోగానూ అనిపించవచ్చు. కానీ ఈ పరిణామాలు మీ వ్యక్తిత్వం మీద చులకన భావం కలగజేస్తాయి పైగా వారి విషయాలు మరొకరితో పంచుకోరన్న గ్యారెంటీ లేదన్న భావన ఏర్పడుతుంది. మీపై గౌరవం సన్నగిల్లి ఓ ప్రతికూల ముద్ర కూడా ఏర్పడవచ్చు. ఈ విషయాలు గమనించి అతిగా గాసిప్‌ చేయకుండా జాగ్రత్తపడాలి.

- దొరైరాజ్‌,  సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ ఎలక్ట్రోస్టీల్‌ కాస్టింగ్స్‌ లిమిటెడ్‌


చిక్కులు రాకముందే..

జీవితంలో చిక్కులు ఎదురైనపుడు తోచినట్టు ప్రతిస్పందిస్తుంటాం.  కానీ అసలు చేయాల్సింది..అవి ఎదురవ్వకముందే ముందస్తుగానే వాటి గురించి ఆలోచించడం, 
పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం. విద్యార్థులూ, ఉద్యోగులూ తమ చిక్కుల విషయంలో ఇలా చేస్తేనే సమర్థంగా వాటిని ఎదుర్కోవడం సాధ్యం! 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని