వీటితోనూ నడుంనొప్పి!

నడుంనొప్పి ముప్పు కారకాలు అనగానే వయసు మీద పడటం, శారీరక శ్రమ చేయకపోవటం, అధిక బరువు, బరువులను సక్రమంగా ఎత్తకపోవటం వంటివే ప్రధానంగా గుర్తుకొస్తాయి

Published : 11 Jun 2024 00:16 IST

నడుంనొప్పి ముప్పు కారకాలు అనగానే వయసు మీద పడటం, శారీరక శ్రమ చేయకపోవటం, అధిక బరువు, బరువులను సక్రమంగా ఎత్తకపోవటం వంటివే ప్రధానంగా గుర్తుకొస్తాయి. కానీ ఇవే కాదు.. కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలూ దీనికి దోహదం చేస్తాయి. అలాంటి కొన్ని కారణాలు ఇవిగో..

నిద్రలేమి: నడుంనొప్పితో నిద్ర పట్టకపోవటం తెలిసిందే. కానీ నిద్ర సమస్యలూ నడుం నొప్పికి దారితీస్తాయి. సమస్యను తీవ్రం చేస్తాయి కూడా. త్వరగా నిద్ర పట్టకపోవటం, పట్టినా మధ్యలో మేల్కోవటం వంటి సమస్యలతో బాధపడేవారికి నడుం నొప్పి వచ్చే అవకాశం 1.5 రెట్లు ఎక్కువని ఒక అధ్యయనం చెబుతోంది. దీనికి కారణమేంటనేది కచ్చితంగా తెలియదు గానీ నిద్రలేమితో నొప్పి భావన పెరుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇందులో మానసిక ఒత్తిడి పాత్ర కూడా ఉండొచ్చు.

నడిచే తీరు: పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ నడుస్తూనే ఉంటాం. రోజుకు కనీసం మూడు వేల అడుగులైనా వేస్తుంటాం. పాదాల నొప్పి, పాదం మధ్యలో ఒంపు లేకపోవటం వంటి సమస్యలు నడిచేప్పుడు అంగల తీరును అస్తవ్యస్తం చేస్తాయి. ఇది ఒంట్లో ఇతర భాగాల మీదా ప్రభావం చూపుతుంది. నిల్చున్నప్పుడు, నడవటం మొదలెట్టినప్పుడు నడుం నొప్పి తలెత్తితే పాదం సమస్యలేవైనా ఉన్నాయేమో పరీక్షించుకోవటం మంచిది. 

వీడియో గేమ్స్‌ ఆడటం: వీడియో గేమ్స్‌ ఆడేవారు మెడను ముందుకు చాచి, భుజాలు కిందికి వాల్చి గంటల కొద్దీ కుర్చీలో కూర్చుంటారు. దీంతో భంగిమ దెబ్బతింటుంది. గంటల కొద్దీ కూర్చోవటం వల్ల కండరాలు బిగుసుకుపోతాయి, ఒత్తిడికి గురవుతాయి. ఇవి నడుం నొప్పికి కారణమవుతాయి. ప్రతి అరగంటకోసారి విరామం తీసుకోవటం, సోఫాలో కూలబడటం కన్నా థెరపీ బాల్‌పై కూర్చోవటం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు.

నాడుల వద్ద మచ్చ: వీపులో నాడుల చుట్టూరా దెబ్బలు తగలటం లేదా శస్త్రచికిత్స చేసినప్పుడు అక్కడ మచ్చతో కూడిన కణజాలం పెరుగుతుంది. గట్టిగా, మందంగా ఉండే ఇది నాడులు కోలుకోవటానికి తోడ్పడుతుంది. అయితే కదిలినప్పుడు సున్నితమైన భాగానికి రుద్దుకుంటుంది. ఈ మచ్చ నాడులకు రక్త సరఫరానూ అడ్డుకుంటుంది. ఇవి రెండూ నడుం నొప్పిని తెచ్చిపెట్టేవే. ఎలక్ట్రిక్‌ పల్స్‌తో డాక్టర్లు మచ్చపడిన నాడులకు చికిత్స చేస్తారు. దీంతో నొప్పి సంకేతాలు పక్కలకు మళ్లుతాయి. అవసరమైతే శస్త్రచికిత్స కూడా చేయొచ్చు.

పొగ తాగటం: సిగరెట్లు, చుట్టలు, బీడీల వంటివి తాగేవారికి నడుం నొప్పి వచ్చే అవకాశం సుమారు మూడు రెట్లు ఎక్కువ. పొగాకుతో కణజాలాలకు, ఎముకలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో వెన్నుపూసల మధ్య ఉండే గట్టి రబ్బరు లాంటి డిస్కులు క్షీణిస్తాయి. ఇది నొప్పికి దారితీస్తుంది. పొగ తాగటం వల్ల దెబ్బతిన్న డిస్కు నయం కావటమూ ఆలస్యమవుతుంది. నొప్పి తగ్గకుండా వేధిస్తూ వస్తుంది. నికొటిన్‌ మూలంగా నొప్పి మరింత తీవ్రం కావొచ్చనీ పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యటం ఉత్తమం. 

శరీరం ఎత్తు: ఆశ్చర్యంగా అనిపించినా శరీరం ఎత్తూ నడుం నొప్పికి దారితీస్తుంది. ఎత్తుకూ నడుం సమస్యలకూ సంబంధం ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పొట్టివారితో పోలిస్తే కనీసం 5.7 అడుగుల ఎత్తుండే మహిళలకు నడుం నొప్పి వచ్చే అవకాశం 20% ఎక్కువని చెబుతున్నాయి. పొడవైన మగవారికీ.. ముఖ్యంగా 6.1 అడుగుల ఎత్తు గలవారికీ దీని ముప్పు ఎక్కువ. కాకపోతే వీరికి అంత తీవ్రంగా నొప్పి ఉండదు. హార్మోన్లు, ఎత్తు మూలంగా శరీరం కదిలే తీరు నడుం నొప్పికి కారణం కావొచ్చు. బాగా పొడవు గలవారు తరచూ కిందికి వంగటం వల్ల భంగిమ మారుతుంది. కాబట్టి కిందికి వంగేటప్పుడు సరైన విధానాన్ని పాటిస్తే నడుం నొప్పి బారినపడకుండా చూసుకోవచ్చు. 

బిగుతైన ప్యాంట్లు: ఇవి ఆకర్షణీయంగా కనిపిస్తుండొచ్చు గానీ కదలికల మీద ప్రభావం చూపుతాయి. ఫలితంగా భంగిమ దెబ్బతింటుంది. ముఖ్యంగా నడుం కింది భాగం, కటి ప్రాంతం కదలిలకు అడ్డు తగులుతాయి. కూర్చుంటున్నప్పుడు వంగిపోయేలా చేస్తాయి. క్రమంగా నడుము తిన్నగా ఉండటానికి తోడ్పడే కండరాలు బలహీనమవుతాయి. దీర్ఘకాలంలో ఇది నొప్పికి దారితీస్తుంది.

లావు పర్సులు: కెడ్రిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్, డబ్బులు.. ఇలా అన్నింటినీ పర్సుల్లో పెట్టుకుంటాం. పెద్దగా, లావుగా ఉండే వీటిని ప్యాంటు వెనక జేబులో పెట్టుకొని కుర్చీలో కూర్చుంటే పిరుదుల వద్ద ఉండే కండరాలు ఒత్తిడికి గురవుతాయి. కాళ్లకు వెళ్లే సయాటికా నాడుల మీదా ప్రభావం పడుతుంది. ఇది నడుంనొప్పికి దారితీస్తుంది. కాబట్టి సన్నటి పర్సులు.. అదీ ముందు జేబులో పెట్టుకోవటం మంచిది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని