Health News: మగవారికి మాత్రమే !

ఆడవారిలో గర్భసంచి, అండాశయాల మాదిరిగా మగవారికి ప్రోస్టేట్‌ గ్రంథి ప్రత్యేకం. సంతాన ప్రక్రియలో పాలు పంచుకునే దీంతో ముడిపడిన సమస్యలూ ప్రత్యేకమే.

Updated : 11 Jun 2024 07:55 IST

ఇది మెన్స్‌ హెల్త్‌ వీక్‌ 

ఆడవారిలో గర్భసంచి, అండాశయాల మాదిరిగా మగవారికి ప్రోస్టేట్‌ గ్రంథి ప్రత్యేకం. సంతాన ప్రక్రియలో పాలు పంచుకునే దీంతో ముడిపడిన సమస్యలూ ప్రత్యేకమే. వయసుతో పాటు ఉబ్బటం ఒకటైతే.. తీవ్రమైన క్యాన్సర్‌ మరో సమస్య. ప్రోస్టేట్‌ ఉబ్బు ప్రాణాపాయానికి దారితీయదు గానీ బాగా ఇబ్బంది పెడుతుంది. ఇక ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ తీరే వేరు. మిగతా క్యాన్సర్లతో పోలిస్తే నెమ్మదిగా ముదురుతూ వస్తుంది. క్యాన్సర్‌ తలెత్తినా చాలామంది పది, పదిహేనేళ్ల వరకూ జీవిస్తుంటారు. అలాగని తక్కువదేమీ కాదు. మగవారిలో అత్యంత ఎక్కువగా కనిపించే రెండో క్యాన్సర్‌ ఇదే. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ మరణాలకు కారణమవుతున్నవాటిల్లో ఐదోదీ ఇదే. ఈ నేపథ్యంలో మెన్స్‌ హెల్త్‌ వీక్‌ సందర్భంగా ఈ రెండు సమస్యలపై సమగ్ర కథనం.

 ప్రోస్టేట్‌ ఉబ్బు

ప్రోస్టేట్‌ గ్రంథి పునరుత్పత్తి అవయవాల్లో భాగం. దీని ముఖ్యమైన పని వీర్యంలోకి కొన్ని ఎంజైమ్‌లను, ద్రవాన్ని చేరవేయటం. ఇలా వీర్యం తయారీకి, శుక్రకణాల పోషణలో పాలు పంచుకుంటుంది. శుక్రకణాల కదలికలకు తోడ్పడే ప్రోస్టేట్‌-స్పెసిఫిక్‌ యాంటీజెన్‌ (పీఎస్‌ఏ) తయారుకావటానికీ తోడ్పడుతుంది. ప్రోస్టేట్‌ గ్రంథి మూత్రాశయం, మూత్రమార్గం కలిసే చోట ఉంటుంది. మూత్రా మార్గానికి చుట్టూ కరచుకొని ఉండటం వల్ల ఇందులో ఏ సమస్య తలెత్తినా మూత్ర విసర్జనతో ముడిపడిన ఇబ్బందులు కనిపి స్తుంటాయి. ప్రోస్టేట్‌ సమస్యల్లో ప్రధానమైంది మామూలు ప్రోస్టేట్‌ ఉబ్బు (బినైన్‌ ప్రోస్టాటిక్‌ హైపర్‌ప్లేసియా). ఇది వంశ పారంపర్యంగా వస్తుందని కొందరు భావి స్తుంటారు. ఇది నిజం కాదు. ఆ మాటకొస్తే ఇది జబ్బూ కాదు. వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం ముడతలు పడటం, జుట్టు తెల్లబడటం, కంట్లో శుక్లాలు ఏర్పడటం వంటి మార్పులు వస్తుంటాయి కదా. ప్రోస్టేట్‌ ఉబ్బూ అలాంటిదే. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు. అయితే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోస్టేట్‌ గ్రంథి దీని మీదే ఆధారపడుతుంది. వయసు పెరిగేకొద్దీ.. సుమారు 50, 55 ఏళ్లు వచ్చేసరికి ఈ హార్మోన్‌ పనితీరు అస్తవ్యస్తం కావటం గ్రంథి ఉబ్బటానికి దారితీస్తుంది. ఒక వయసు వచ్చాక దాదాపు మగవారందరిలోనూ ఎంతోకొంత ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బుతుంటుంది కూడా. ఇది రకరకాల ఇబ్బందులకు కారణమవుతుంది.

లక్షణాలు రకరకాలు

1. మూత్ర మార్గం సన్నబడటం వల్ల వచ్చేవి: మూత్రమార్గాన్ని పైనుంచి గ్రంథి నొక్కుతుండటం వల్ల విసర్జనకు వెళ్లినప్పుడు వెంటనే మూత్రం రాకపోవచ్చు. ధార సన్నగా అవటం, ఆగి ఆగి రావటం, ముక్కుతూ బలంగా మూత్రం పోయటం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదని అనిపించటం వంటివీ ఉండొచ్చు. అరుదుగా కొందరికి మూత్రంలో రక్తం పడొచ్చు. 
2. మూత్రాశయ మార్పులతో ముడిపడినవి: మూత్రాశయం పంపు మాదిరిగా కొంత పీడనంతో మూత్రాన్ని బయటకు నెడుతుంది. ప్రోస్టేట్‌ ఉబ్బుతో అడ్డంకి ఏర్పడినప్పుడు మరింత బలంగా పనిచేస్తుంది. అప్పుడు తరచూ, ఎక్కువసార్లు మూత్రం రావొచ్చు. మూత్రాన్ని ఆపలేకపోవచ్చు. మూత్రం వస్తున్నట్టు అనిపించిన వెంటనే విసర్జన చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు బాత్రూమ్‌కు వెళ్లే లోపలే కొన్ని చుక్కలు పడిపోవచ్చు.
3. మూత్రం మిగలటం వల్ల: సమస్య మరీ ముదిరితే హఠాత్తుగా మూత్రం పూర్తిగా ఆగిపోయే ప్రమాదమూ ఉంది. దీంతో మూత్రం లోపలే ఉండిపోతుంది. కడుపు ఉబ్బటం, నొప్పి తలెత్తుతాయి. కొందరికి ఈ మూత్రం నిల్వ ఉండటమనేది నెమ్మదిగా, దీర్ఘకాలంగానూ కొనసాగుతూ రావొచ్చు. దీంతో క్రమంగా మూత్రాశయం సైజూ పెరుగుతూ వస్తుంది. సాధారణంగా మూత్రాశయం 300 నుంచి 500 మి.లీ. మూత్రాన్ని పట్టి ఉంచుతుంది. పెద్దగా అయితే లీటరు నుంచి రెండు లీటర్ల వరకూ పట్టి ఉంచొచ్చు. విసర్జన సమయంలో అది పూర్తిగా బయటకు రాకుండా కొంత లోపలే ఉండిపోతుంటుంది. ఇలాంటివారికి ధార సన్నబడుతుంది. పగటి పూట నియంత్రణలోనే ఉంటుంది గానీ రాత్రిపూట కండరాలు వదులు కావటం వల్ల పక్కలోనే విసర్జన కానిస్తుంటారు. మూత్రాశయంలో మూత్రం మిగిలిపోవటం వల్ల ఒత్తిడి వెనక్కి మళ్లి కిడ్నీల మీద భారం పడొచ్చు.  

చికిత్స

రాత్రిపూట విసర్జనకు ఎక్కువసార్లు లేవటం తప్పించి పెద్దగా ఇబ్బందులేమీ లేనివారికి ప్రత్యేకించి మందులు అవసరం లేదు. జీవనశైలిని మార్చుకుంటే చాలావరకూ ఫలితం కనిపిస్తుంది. సాయంత్రం వేళల్లో ద్రవాలు తక్కువగా తీసుకోవాలి. పడుకునే ముందు పాల వంటివి తాగేవారు కాస్త ముందుగానే తాగాలి. విసర్జన చేశాకే నిద్రకు ఉపక్రమించాలి. మధ్యలో ఎప్పుడైనా విసర్జన చేశాక నోరు తడారినట్టు అనిపిస్తే కాస్త గొంతు తడుపుకోవచ్చు గానీ ఎక్కువగా నీరు తాగొద్దు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులను నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహంతో, రక్తపోటును తగ్గించే కొన్ని మందులతోనూ ఎక్కువసార్లు మూత్రం రావొచ్చు. ప్రోస్టేట్‌ లక్షణాల విషయంలో వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 

మందులు: లక్షణాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టయితే మందులు వేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో ప్రధానమైనవి ఆల్ఫాబ్లాకర్లు, 5-ఆల్ఫా రెడక్టేజ్‌ ఇన్‌హిబిటార్స్‌ రకం మందులు. ఆల్ఫాబ్లాకర్లు ప్రోస్టేట్‌ గ్రంథిలోని మృదు కణజాలాన్ని వదులు చేసి మార్గం తెరచుకునేలా చేస్తాయి. దీంతో ధార మెరుగవుతుంది. ప్రోస్టేట్‌ సైజు పెద్దగా ఉన్నట్టయితే 5-ఆల్ఫా రెడక్టేజ్‌ ఇన్‌హిబిటార్స్‌ మేలు చేస్తాయి. అయితే ఇవి వెంటనే ప్రభావం చూపవు. ఆరు నెలలు వాడితే 50% వరకూ సైజు తగ్గే అవకాశముంది. మూత్రం తరచూ వచ్చేవారికి, ఆపలేనివారికి వీటితో పాటు యాంటీకొలనెర్జిక్‌ మందులు అవసరం. ఇవి మూత్రాశయం మీద ఒత్తిడిని తగ్గించటం ద్వారా విసర్జన మీద పట్టుండేలా చేస్తాయి. మందులను క్రమం తప్పకుండా వేసుకోవటం చాలా ముఖ్యం. వీటి ప్రభావం ఒక రోజు వరకే ఉంటుంది. కాబట్టి మధుమేహం, బీపీ మందుల మాదిరిగానే జీవితాంతం తీసుకోవాలి. మధ్యలో ఆపేస్తే దారి మూసుకుపోయి ఇబ్బందులు మళ్లీ మొదలవుతాయి. అయితే ఈ మందులతో సంభోగ సమయంలో వీర్యం వెనక్కి పోతుంటుంది. దీనికి కంగారు పడాల్సిన పనిలేదు. మూత్రంతో పాటు వీర్యమూ బయటకు వచ్చేస్తుంది. అరుదుగా కొందరికి రక్తపోటు తగ్గి తలతిప్పినట్టు అనిపించొచ్చు. అందువల్ల మందులను ఆరంభించిన తొలిరోజుల్లో కాస్త జాగ్రత్త అవసరం. తర్వాత అంతా సర్దుకుంటుంది.

శస్త్రచికిత్స: మందులు పనిచేయకపోయినా, మూత్రం పూర్తిగా ఆగినా, మూత్రాశయంలో ఎక్కువ మూత్రం మిగిలిపోతున్నా, మూత్ర ఇన్‌ఫెక్షన్లు వస్తున్నా, కిడ్నీ మీద ఒత్తిడి పడుతున్నా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. లోపలి వైపున పెరిగిన భాగాన్ని కత్తిరించేస్తే అడ్డంకి తొలగిపోతుంది. ఇప్పుడు ఎండోస్కోపీ పద్ధతితో మూత్రమార్గం లోపలి నుంచే శస్త్రచికిత్స చేస్తున్నారు. మోనోపోలార్‌ లేదా బైపోలార్‌ టీయూఆర్‌పీ పరికరంతో గ్రంథిని ముక్కలు చేసి, మూత్రమార్గం లోపలి నుంచే వాటిని తొలగించొచ్చు. దీన్ని లేజర్‌తోనూ చేయొచ్చు. ఇది సురక్షితమైన శస్త్రచికిత్స. త్వరగా కోలుకుంటారు. 

సమస్య ఎప్పుడు?

ప్రోస్టేట్‌ గ్రంథి పెరగటం రెండు దశల్లో సాగుతుంది. తొలిసారి యవ్వనం ఆరంభంలో దీని సైజు రెండింతలవుతుంది. మలి దశ ఎదుగుదల సుమారు 25 ఏళ్ల వయసులో ఆరంభమై, జీవితాంతం కొనసాగుతూ వస్తుంది. ఈ రెండో దశలోనే ప్రోస్టేట్‌ ఉబ్బూ తలెత్తుతుంది. యాపిల్‌ మధ్యలో చిన్న రంధ్రం చేసి, దానిలోంచి సన్నటి గొట్టాన్ని దూర్చితే ఎలా ఉంటుంది? ఒకరకంగా ప్రోస్టేట్‌ గ్రంథిని ఇలాగే పోల్చుకోవచ్చు. ఇది మూత్రమార్గం చుట్టూ కరచుకొని ఉండటం వల్ల లోపలి వైపు నుంచి సైజు పెరిగితే మూత్రమార్గం నొక్కుకుపోతుంది. లోపలి మార్గం సన్నబడుతుంది. ఫలితంగా విసర్జనతో ముడిపడిన లక్షణాలు మొదలవుతాయి. 

నిర్ధరణ ఎలా?

ముందుగా లక్షణాలను నిశితంగా పరిశీలించి సమస్యను అంచనా వేస్తారు. ప్రోస్టేట్‌ ఉబ్బినట్టు అనుమానిస్తే తగు పరీక్షలతో నిర్ధరిస్తారు.

  • మూత్ర ప్రవాహం: యూరోఫ్లోమెట్రీ పరికరం సాయంతో మూత్ర విసర్జన వేగం, మూత్రం పరిమాణం, విసర్జనకు పడుతున్న సమయం తెలుస్తాయి. వీటి ఆధారంగా అడ్డంకి ఉన్నదీ లేనిదీ నిర్ణయిస్తారు. 
  • అల్ట్రాసౌండ్‌ స్కాన్‌: దీన్ని మూత్రాశయం బాగా నిండినప్పుడు, విసర్జన అనంతరమూ చేస్తారు. ఇందులో మూత్రాశయ సామర్థ్యం, లోపల మిగిలిపోతున్న మూత్రం, ప్రోస్టేట్‌ గ్రంథి సైజుతో పాటు రాళ్ల వంటి ఇతరత్రా సమస్యలున్నా బయటపడతాయి. 
  • పీఎస్‌ఏ పరీక్ష: మామూలు ప్రోస్టేట్‌ ఉబ్బా? క్యాన్సర్‌ ఆనవాళ్లేమైనా ఉన్నాయా? అనేవి తెలుసుకోవటానికిది తోడ్పడుతుంది.  

ఇంటర్నేషనల్‌ ప్రోస్టేట్‌ సింప్టమ్‌ స్కోర్‌ (ఐపీఎస్‌ఎస్‌): ఇందులో విసర్జన తీరుతెన్నులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలను బట్టి స్కోర్‌ను కేటాయిస్తారు. ఇబ్బందుల తీవ్రత తెలుసుకోవటానికిది ఉపయోగపడుతుంది.


క్యాన్సర్‌ చిచ్చు 

పోస్టేట్‌ క్యాన్సర్‌ అరుదని అనుకుంటుంటారు. కానీ ప్రతి ఆరుగురు మగవారిలో ఒకరు దీనికి గురవు తున్నవారే! మనదేశంలో మొత్తం క్యాన్సర్లలో మూడు శాతం ఇదే ఆక్రమిస్తోంది. ఏటా సుమారు 42వేల మంది కొత్తగా దీని బారినపడుతున్నారు. వచ్చే 20 ఏళ్లలో వీరి సంఖ్య రెట్టింపు కావొచ్చని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది. మంచి విషయం ఏంటంటే- దీన్ని ముందుగానే గుర్తించే వీలుండటం. చికిత్స కూడా మిగతా క్యాన్సర్ల కన్నా ఒకింత తేలికైంది కావటం. తొలిదశలోనే గుర్తిస్తే చాలావరకూ పూర్తిగా నయమవుతుంది కూడా. 

ఉబ్బు క్యాన్సర్‌ వేర్వేరు

ప్రోస్టేట్‌ ఉబ్బు క్యాన్సర్‌కు దారితీస్తుందని అపోహ పడుతుంటారు. ఇది నిజం కాదు. మామూలు ప్రోస్టేట్‌ ఉబ్బుకూ క్యాన్సర్‌కూ సంబంధం లేదు. రెండూ వేర్వేరు సమస్యలు. ప్రోస్టేట్‌ గ్రంథిలో రెండు భాగాలుంటాయి. మూత్రమార్గం చుట్టూ కరచుకొని ఉండే ట్రాన్సిషనల్‌ జోన్‌లో ఉబ్బు తలెత్తుతుంది. వెలుపలి భాగమైన పెరిఫెరల్‌ జోన్‌లో క్యాన్సర్‌ మొదలవుతుంది. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ చాలా నెమ్మదిగా ముదురుతుంది. ఇతర భాగాలకు అంత త్వరగా వ్యాపించదు. చాలావరకూ 55, 60 ఏళ్లు దాటినవారిలోనే కనిపిస్తుంది. దీన్ని కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా చూస్తుంటాం. తండ్రి, సోదరుల్లో ఎవరికైనా క్యాన్సర్‌ ఉన్నట్టయితే వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల ఇలాంటి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. 

చికిత్సతో నిర్మూలన

క్యాన్సర్‌ పెరుగుతున్న వేగం, ఇతర భాగాలకు వ్యాపించటం, మొత్తంగా ఆరోగ్యం తీరును బట్టి చికిత్సను నిర్ణయిస్తారు. మామూలు క్యాన్సర్‌కు చాలావరకూ చికిత్స అవసర పడకపోవచ్చు. వీరిని నిరంతరం గమనిస్తుండాలి. క్యాన్సర్‌ వృద్ధి చెందుతున్నా, తీవ్రమవుతున్నా  చికిత్సలు చేయాల్సి ఉంటుంది.

శస్త్రచికిత్స, రేడియేషన్‌

క్యాన్సర్‌ గ్రంథికే పరిమితమైతే శస్త్రచికిత్సతో గానీ రేడియేషన్‌తో గానీ పూర్తిగా నిర్మూలించొచ్చు. శస్త్రచికిత్సను తట్టుకోగలిగితే రోబోటిక్‌ పద్ధతితో గ్రంథిని పూర్తిగా తొలగించొచ్చు (రోబోటిక్‌ ర్యాడికల్‌ ప్రోస్టేటెక్టమీ). ఇతరత్రా సమస్యలుండి, మత్తుమందును తట్టుకోలేనివారికి రేడియేషన్‌ చేస్తారు. సమస్య మళ్లీ తిరగబెడతున్న సూచనలు కనిపిస్తున్నా రేడియేషన్‌ అవసరం. 
ఒకసారి క్యాన్సర్‌ ఇతర భాగాలకు వ్యాపిస్తే పూర్తిగా నిర్మూలించటం కష్టం. కొంతవరకు నియంత్రణలో ఉంచొచ్చు. ప్రోస్టేట్‌ కణాలు టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ మీద ఆధారపడతాయి. కాబట్టి దీని సరఫరాను ఆపితే క్యాన్సర్‌ కణాలు చాలావరకూ చనిపోతాయి. దీన్ని రెండు రకాలుగా సాధించొచ్చు. టెస్టోస్టిరాన్‌ను తయారుచేసే వృషణాలను శస్త్రచికిత్సతో తొలగిస్తే (సర్జికల్‌ క్యాస్ట్రేషన్‌) హార్మోన్‌ ఉత్పత్తీ నిలిచిపోతుంది. ఇంజెక్షన్లతోనైనా హార్మోన్‌ ఉత్పత్తిని ఆపొచ్చు (మెడికల్‌ క్యాస్ట్రేషన్‌). వీటిని ప్రతి మూడు నెలలకోసారి తీసుకోవాలి. వీటితో చాలావరకూ మంచి ఫలితముంటుంది. ఒకటి ఆరా కణాలు మిగిలితే క్యాన్సర్‌ తిరగబెట్టే అవకాశముంది. ఇలాంటివారు దీర్ఘకాలం హార్మోన్ల మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇంజెక్షన్లు, కీమోథెరపీతో కొన్ని దుష్ప్రభావాలు పొడసూపొచ్చు గానీ హార్మోన్‌ చికిత్సతో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. 

కీమోథెరపీ 

క్యాన్సర్‌ మరీ తీవ్రంగా గలవారిలో కొందరికి కీమోథెరపీ అవసరం. గ్లీసన్‌ స్కోరు 8 కన్నా ఎక్కువగా ఉంటే క్యాన్సర్‌ చాలా తీవ్రంగా ఉందని అర్థం. ఇలాంటివారికి హార్మోన్‌ చికిత్సతో పాటు కీమోథెరపీ చేస్తే ఫలితాలు బాగుంటాయి. 

లక్షణాలు భిన్నం

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ లక్షణాలు కొన్ని ప్రోస్టేట్‌ ఉబ్బునూ పోలి ఉంటాయి. ఇందులోనూ విసర్జనలో ఇబ్బంది, ధార సన్నం కావటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే మూత్రంలో, వీర్యంలో రక్తం పడటం, ఎముక నొప్పి, స్తంభనలోపం, ఎలాంటి ప్రయత్నం చేయకుండా బరువు తగ్గటం వంటివి కనిపిస్తే మాత్రం అసలే నిర్లక్ష్యం చేయరాదు. 

నిర్ధరణ ఎలా?

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను అనుమానిస్తే ముందుగా మలద్వారం ద్వారా వేలును జొప్పించి (డిజిటల్‌ రెక్టల్‌) నిశితంగా పరిశీలిస్తారు. గ్రంథి సైజు, ఆకారం, తీరు మారినట్టు అనుమానిస్తే తదుపరి పరీక్షలు అవసరమవుతాయి. 
పీఎస్‌ఏ పరీక్ష: ప్రోస్టేట్‌ కణాల నుంచి తయారయ్యే పీఎస్‌ఏ చాలావరకూ వీర్యంలోంచి వచ్చేస్తుంది. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్టయితే కణాల గోడ చిట్లి, కొంత పీఎస్‌ఏ రక్తంలోకి లీకవుతుంది. పీఎస్‌ఏ పరీక్షతో రక్తంలో దీని మోతాదులు తెలుస్తాయి. ఇవి 4 కన్నా పెరిగితే క్యాన్సర్‌ ఉండొచ్చని అనుమానించాలి. అలాగని పీఎస్‌ఏ మోతాదు పెరిగిన అందరిలోనూ క్యాన్సర్‌ ఉండాలనేమీ లేదు. సుమారు 30-35 శాతం మందిలో మాత్రమే క్యాన్సర్‌ కనిపిస్తుంటుంది. 
ఎంపీ ఎంఆర్‌ఐ: క్యాన్సర్‌ను అనుమానిస్తే దీన్ని చేస్తారు. ఇందులో గ్రంథిలో అనుమానిత భాగాలేవైనా ఉంటే బయటపడుతుంది. అక్కడి నుంచి సన్నటి సూదితో చిన్న ముక్కను కత్తిరించి (బయాప్సీ) పరీక్షిస్తే, క్యాన్సర్‌ ఉందో లేదో కచ్చితంగా తెలుస్తుంది. అలాగే గ్లీసన్‌ స్కోరు ఆధారంగా తీవ్రతను లెక్కిస్తారు. ఈ స్కోరు 7 ఉంటే ఒక మాదిరిగా, 8 నుంచి 10 ఉంటే తీవ్ర క్యాన్సర్‌గా భావిస్తారు.

పీఎస్‌ఎంఏ పెట్‌ స్కాన్‌: క్యాన్సర్‌ నిర్ధరణ అయ్యాక దశలను చూడటం ముఖ్యం. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ అక్కడికే పరిమితమైతే తొలిదశగా.. పొట్టలో లింఫ్‌ గ్రంథులకు, ఎముకలకు కూడా వ్యాపిస్తే ముదిరిన దశగా భావిస్తారు. వీటిని గుర్తించటానికి పీఎస్‌ఎంఏ పెట్‌ సీటీస్కాన్‌ పరీక్ష తోడ్పడుతుంది. ఇందులో ప్రోస్టేట్‌ కణాలు ఎక్కడెక్కడున్నాయో తెలుస్తుంది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని