ఎంచక్కని మొక్కజొన్న!

చిటపట చినుకులు పడుతుంటే మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని వేడివేడిగా తింటుంటే ఆ మజానే వేరు. ఇవి రుచిగా ఉండటమే కాదు, ఎన్నో పోషకాలనూ అందిస్తాయి.

Updated : 24 Aug 2023 15:21 IST

చిటపట చినుకులు పడుతుంటే మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని వేడివేడిగా తింటుంటే ఆ మజానే వేరు. ఇవి రుచిగా ఉండటమే కాదు, ఎన్నో పోషకాలనూ అందిస్తాయి. మొక్కజొన్న గింజల్లో నీటిలో కరగని పీచు బోలెడంత ఉంటుంది. అందువల్ల ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కలుస్తుంది. మొక్కజొన్న కాల్చుకొని, ఉడికించి, పచ్చిగా ఎలాగైనా తినొచ్చు. కార్న్‌ ఫ్లేక్స్‌, పాప్‌కార్న్‌ రూపంలోనూ వీటిని లాగించేయొచ్చు. మరి మొక్కజొన్నలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దామా.

జీర్ణక్రియకు సాయం

మొక్కజొన్నలో కరగని పీచు దండిగా ఉండటం వల్ల మలం ఏర్పడేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. గింజల లోపలి పలుకుల్లో ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు, పీచు ఉంటాయి. వీటిని శరీరం బాగా జీర్ణం చేసుకుంటుంది. కానీ సెల్యులోజ్‌తో కూడిన వెలుపలి గట్టి భాగం జీర్ణం కాదు. ఇది పేగుల్లో పులిసిపోతుంది. అందుకే మొక్కజొన్న గింజలను ఎక్కువగా తిన్నప్పుడు పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంటుంది. మొక్కజొన్నలోని ఈ పీచు ప్రిబయాటిక్‌గా పనిచేసి పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఎదగటానికి తోడ్పడుతుంది. పేగుల్లోని బ్యాక్టీరియా మొక్కజొన్నను షార్ట్‌ చెయిన్‌ కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. ఇవి పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పునూ తగ్గిస్తాయి.

కంటికి మేలు

ఒక్క పొత్తులోని మొక్కజొన్న గింజల్లో సుమారు 900 మైక్రోగ్రాముల యాంటీఆక్సిడెంట్లు (ల్యుటీన్‌, జియాగ్జాంతీన్‌) ఉంటాయి. ఇవి చూపు మెరుగుపడటానికి, కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తున్నట్టు ఒక అధ్యయనం పేర్కొంటోంది. దీర్ఘకాల వాపు, గుండెజబ్బు, క్యాన్సర్ల వంటి వాటికి దారితీసే విశృంఖల కణాల బారి నుంచీ యాంటీఆక్సిడెంట్లు కాపాడతాయి. ఇవి రోగనిరోధకవ్యవస్థ సక్రమంగా పనిచేయటానికీ తోడ్పడతాయి. ఇలా వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పోరాడటంలోనూ సాయం చేస్తాయన్నమాట. వానకాలంలో ఇంతకన్నా ఇంకేం కావాలి?

గుండెకు రక్షణ

మొక్కజొన్న గింజలతో తయారుచేసే నూనెలో ఫైటోస్టెరాల్స్‌ అనే సహజ వృక్ష పదార్థముంటుంది. ఇది శరీరం కొలెస్ట్రాల్‌ను తక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. దీనిలో గుండెకు మేలు చేసే యుబిక్వినోన్‌ అనే విటమిన్‌ కూడా ఉంటుంది. ఇది గుండె దెబ్బతినకుండా కాపాడుతుంది. తక్కువ మోతాదులో వాడుకున్నంత వరకు మొక్కజొన్న నూనె ఆరోగ్యానికి మేలే చేస్తుంది. దీనిలోని ఆరోగ్యకరమైన బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు మంచి శక్తిని అందిస్తాయి కూడా.

గ్లూకోజుపై ప్రభావం తక్కువే

గింజల్లోని సహజ చక్కెరలే మొక్కజొన్నకు తీపి రుచిని తెచ్చిపెడతాయి. అయితే వీటిల్లో చక్కెర మోతాదు తక్కువే. ఒక మాదిరి పొత్తులో సుమారు 4 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. ఎర్రటి యాపిల్‌ పండుతో లభించే చక్కెరతో పోలిస్తే ఇది మూడో వంతు కన్నా తక్కువే.

గ్లుటెన్‌ రహితం

మొక్కజొన్నలో గ్లుటెన్‌ ఉండదు. అందువల్ల సీలియాక్‌ జబ్బు గలవారికిది మంచి ప్రత్యామ్నాయం. అయితే మొక్కజొన్న గింజలతో తయారు చేసే కొన్ని పదార్థాల్లో గ్లుటెన్‌ కలుపుతుండొచ్చు. కాబట్టి ఆయా ప్యాకెట్ల మీద పోషక వివరాలను పరిశీలించటం మంచిది.


పోషకాల గని

పీచు, యాంటీఆక్సిడెంట్లతో పాటు మొక్కజొన్న గింజల్లో చాలా విటమిన్లు, పోషకాలు దాగున్నాయి. వీటిల్లో కొలెస్ట్రాల్‌ అసలే ఉండదు. సుమారు అరకప్పు గింజలతో లభించే పోషకాలు..

  • 97 కేలరీలు
  • 23.5 గ్రా. పిండి పదార్థం
  • 0.78 గ్రా. కొవ్వు
  • 2 గ్రా. పీచు
  • 3 గ్రా. ప్రొటీన్‌
  • 5 మి.గ్రా. సోడియం
  • 4 మి.గ్రా. క్యాల్షియం
  • 40 మైక్రోగ్రాముల ఫోలేట్‌
  • 32 మి.గ్రా. మెగ్నీషియం
  • 294 మి.గ్రా. పొటాషియం
  • 244 ఐయూ విటమిన్‌ ఏ,
  • 7 మి.గ్రా. విటమిన్‌ సి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు