దంతమెంత బలమో!

పళ్లు తళతళా మెరవటానికి, అందంగా కనిపించటానికి కేవలం బ్రష్‌ చేసుకుంటేనే సరిపోదు. దంతాల మీదుండే ఎనామిల్‌ పొర దృఢంగా ఉండేలా చూసుకోవాలి కూడా. పళ్లు దెబ్బతినకుండా కాపాడటంలో ముందు వరుసలో నిలిచేది ఇదే.

Published : 12 Mar 2024 00:52 IST

పళ్లు తళతళా మెరవటానికి, అందంగా కనిపించటానికి కేవలం బ్రష్‌ చేసుకుంటేనే సరిపోదు. దంతాల మీదుండే ఎనామిల్‌ పొర దృఢంగా ఉండేలా చూసుకోవాలి కూడా. పళ్లు దెబ్బతినకుండా కాపాడటంలో ముందు వరుసలో నిలిచేది ఇదే. తినే ఆహారం, తాగే పానీయాలు, కొన్నిరకాల మందులు, జబ్బులు ఎనామిల్‌ పొరలోని ఖనిజాలను క్షీణింపజేసే అవకాశముంది. కాబట్టి దంతాలను బలహీనం చేసేవేంటి? బలంగా ఉంచేవేంటి? అనేవి తెలుసుకొని ఉండటం మంచిది.

పుట్టిన తర్వాత ఆరేడు నెలలకు పాల పళ్లు మొలుస్తుంటాయి గానీ వీటి దృఢత్వానికి పునాది తల్లి కడుపులో ఉన్నప్పుడే పడుతుంది. తల్లిలో విటమిన్‌ డి లోపం, గర్భధారణ సమయంలో మధుమేహం రావటం వంటి వాటికీ పిల్లల్లో ఎనామిల్‌ లోపాలకూ సంబంధం ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. బాల్యంలో పోషణలేమి, తట్టు, న్యుమోనియా, తరచూ తీవ్రమైన జ్వరం రావటం వంటివీ ఎనామిల్‌ దృఢత్వాన్ని దెబ్బతీయొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది క్షీణిస్తున్నకొద్దీ పళ్లు జివ్వుమనటం తలెత్తుతుంది. పళ్లూ పుచ్చిపోవచ్చు. యుక్తవయసులో, పెద్దయ్యాక ఎనామిల్‌ దెబ్బతినటానికి చాలావరకూ పుల్లటి పండ్ల రసాలు, స్పోర్ట్స్‌ డ్రింకులు, సోడాలు.. పచ్చళ్ల వంటి వెనిగర్‌తో కూడిన పదార్థాల వంటివే కారణం. కాఫీ కూడా ఆమ్లగుణం కలిగిందే అయినా పుల్లటి పానీయాలు, సోడాలంత హాని చేయదు. కానీ కాఫీలో చక్కెర కలపటం వల్ల నోట్లో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదముంది. ఇది ఆమ్లాన్ని ఉత్పత్తి చేసి, దంతాలను దెబ్బతీయొచ్చు. దంతాలకు అంటుకునే పదార్థాలూ ఇలాగే చేటు చేస్తాయి. వీటిని తరచూ తీసుకుంటే ఎనామిల్‌ నెమ్మదిగా క్షీణిస్తూ రావొచ్చు. పుచ్చిపోయే ముప్పూ పెరుగుతుంది. చాలాకాలంగా జీర్ణరసాలు గొంతులోకి ఎగదన్నుకొని రావటం, తరచూ వాంతులు కావటమూ ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. నోరు ఎండిపోయే సమస్యా తక్కువేమీ కాదు. సాధారణంగా లాలాజలం ఆమ్లాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఆకుకూరల్లోని క్యాల్షియం.. గింజపప్పులు, చిక్కుళ్లు, మాంసంలోని ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు తిరిగి దంతాల్లో పోగుపడటానికీ తోడ్పడుతుంది. కొన్ని జబ్బులు, మందుల మూలంగా నోరు ఎండిపోయేవారిలో ఈ రక్షణ కొరవడుతుంది. దీంతో ఎనామిల్‌, పళ్లు బలహీనమయ్యే ప్రమాదముంది.

 ఎలా బలపరచుకోవాలి?

  • ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకునే ముందు బ్రష్‌తో పళ్లు తోముకోవటం, అలాగే పళ్ల మధ్య సన్నటి దారంతో శుభ్రం చేసుకోవటం (ఫ్లాజింగ్‌) చాలా ముఖ్యం. కానీ తిన్న, తాగిన వెంటనే.. ముఖ్యంగా పుల్లటి పదార్థాలు, పానీయాలు తీసుకున్న వెంటనే బ్రష్‌ చేసుకోవద్దు. కనీసం అరగంట, గంట సేపైనా ఆగాలి. ఎందుకంటే నోట్లోని ఆమ్లాలు ఎనామిల్‌ను బలహీనం చేస్తాయి. పుల్లటి పదార్థాలు తీసుకున్న వెంటనే బ్రష్‌ చేస్తే ఎనామిల్‌ దెబ్బతినే ప్రమాదముంది.
  •  ఫ్లోరైడ్‌తో కూడిన టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకోవాలి. ఇది లాలాజలంలోని క్యాల్షియం, ఫాస్ఫరస్‌లను దగ్గరకు చేర్చి ఎనామిల్‌ దృఢంగా ఉండేలా చేస్తుంది. దంతక్షయం నుంచి కాపాడుతుంది.
  •  తీపి పానీయాలను మరీ ఎక్కువసేపు తాగొద్దు. అలాగే ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో వేసుకొని నమలటం మానెయ్యాలి. తరచూ ఏదో ఒకటి తింటుంటే దంతాలు ఆమ్ల ప్రభావానికి గురవుతాయి. బ్యాక్టీరియా వృద్ధి చెందటానికీ ఆస్కారం కలుగుతుంది. ఏదైనా తిన్నా, తాగినా వెంటనే నీటితో పుక్కిలించాలి. ఇది లాలాజలం ఉత్పత్తి పెరగటానికి, ఎనామిల్‌ క్షీణించకుండా ఉండటానికి తోడ్పడుతుంది.
  •  క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించటమూ ముఖ్యమే. పళ్లు దెబ్బతింటుంటే ముందే పట్టుకోవచ్చు. ఎనామిల్‌ నిరంతరం క్షీణిస్తూ వస్తుంటే దెబ్బతిన్న భాగాన్ని తిరిగి సరిచేయటం సాధ్యం కాదు. సన్నటి పగుళ్లు, రంధ్రాలు అలాగే ఉండిపోతాయనీ తెలుసుకోవాలి. అవసరమైతే వీటిని ఫిల్లింగ్‌తో పూడ్చుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు