గర్భసంచికి గడ్డల ముప్పు!

గర్భసంచికి ఎలాంటి సమస్య వచ్చినా ఇబ్బందే. ఇక గడ్డల్లాంటి ఫైబ్రాయిడ్లు ఏర్పడితే? ఎవరికైనా కంగారు పుడుతుంది....

Published : 26 Sep 2017 01:28 IST

గర్భసంచికి గడ్డల ముప్పు!

ర్భసంచికి ఎలాంటి సమస్య వచ్చినా ఇబ్బందే. ఇక గడ్డల్లాంటి ఫైబ్రాయిడ్లు ఏర్పడితే? ఎవరికైనా కంగారు పుడుతుంది. క్యాన్సర్‌ కణితులేమోనని ఆందోళన మొదలవుతుంది. నిజానికి గర్భసంచిలో తలెత్తే ఫైబ్రాయిడ్లలో చాలావరకు క్యాన్సర్‌తో సంబంధం లేనివే. ఇవి మహిళల్లో తరచుగా కనబడేవే అయినా కేవలం కొద్దిమందిలోనే లక్షణాలు బయటపడుతుంటాయి. గడ్డలు చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి బాధలూ ఉండవు. కానీ కొందరిలో వీటి సైజు బాగా పెరుగుతూ వస్తుంది. పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఇలా సైజు పెరుగుతూ.. పక్కభాగాలకు నొక్కుకుపోతుంటే రకరకాల ఇబ్బందులు బయలుదేరతాయి. ముఖ్యంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా అవుతుంటుంది. గర్భాశయం గుంజినట్టవుతుంది. నడుంనొప్పి, పొత్తికడుపు నొప్పి, మలబద్ధకం, మూత్రం ఎక్కువసార్లు రావటం వంటివీ ఉండొచ్చు. ఫలోపియన్‌ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బందులు, గర్భం నిలవకపోవటం వంటి సమస్యలూ తలెత్తొచ్చు.
లక్షణాలను బట్టి చికిత్స
ఫైబ్రాయిడ్లు కొందరిలో వేగంగానూ.. కొందరిలో నెమ్మదిగానూ పెరుగుతుంటాయి. కొందరిలో ఎప్పుడూ ఒకే సైజులో ఉండొచ్చు. లేదూ వాటంతటవే కుంచించుకొనిపోనూ వచ్చు. అందువల్ల లక్షణాల తీవ్రత, మహిళల వయసు, సంతానం కావాలనుకుంటున్నారా? వద్దా? అనే దాన్ని బట్టి చికిత్సను నిర్ధరిస్తారు. ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ను విడుదల చేసే ఐయూడీలు, గర్భనిరోధక మాత్రలతో లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దగా ఉండి, లక్షణాలు ఇబ్బందికరంగా పరిణమిస్తే ఆపరేషన్‌ చేసి తొలగించాల్సి ఉంటుంది. సంతానం కలగనివారికి కేవలం గడ్డలనే తొలగించి, గర్భసంచి అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం అబ్లేషన్‌ ప్రక్రియతో గడ్డలకు రక్త సరఫరా చేసే నాళాన్ని మూసేసే పద్ధతి కూడా అందుబాటులో ఉంది. దీంతో రక్తసరఫరా ఆగిపోయి గడ్డలు క్రమేపీ చిన్నగా అవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని