వృద్ధుల్లోనూ పోషణలోపం

పోషణలోపం అనగానే ముందుగా చిన్నపిల్లలే గుర్తుకొస్తారు. కానీ ఇది వృద్ధుల్లోనూ తరచుగా కనబడుతుంది. దీనికి చాలా అంశాలు దోహదం చేస్తాయి. రుచి, వాసన, వినికిడి, చూపు తగ్గటం;

Published : 09 Aug 2016 01:21 IST

వృద్ధుల్లోనూ పోషణలోపం

పోషణలోపం అనగానే ముందుగా చిన్నపిల్లలే గుర్తుకొస్తారు. కానీ ఇది వృద్ధుల్లోనూ తరచుగా కనబడుతుంది. దీనికి చాలా అంశాలు దోహదం చేస్తాయి. రుచి, వాసన, వినికిడి, చూపు తగ్గటం; పదార్థాలను తెచ్చుకోవటానికి వెళ్లే శక్తిలేకపోవటం; నోరు, దంత సమస్యల మూలంగా ఆహారాన్ని నమలటంలో ఇబ్బంది పడటం; మానసికంగా కుంగిపోవటం; మతిమరుపు వంటివన్నీ పోషణలోపానికి దారితీసేవే. వృద్ధులు తగినన్ని పోషకాలు తీసుకోకపోతే బరువు తగ్గటం, కండరాలు కృశించటం, చర్మం కింద కొవ్వు క్షీణించటం వంటివి బయలుదేరతాయి. కొందరికి ఒంట్లో నీరు కూడా పోగుపడుతుంది. దీంతో బరువు తగ్గినా ఆ విషయం బయటపడదు. వృద్ధుల్లో శక్తి సన్నగిల్లితే రోజువారీ పనులు చేసుకోవటంలో ఇబ్బందులు పడతారు. పోషణలోపం అలాగే కొనసాగితే మంచాన పడటంతో పాటు మరణం ముప్పూ పెరుగుతుంది. జబ్బులతో ఆసుపత్రిలో చేరటం, పుండ్లు మానకుండా మొండికేయటం, శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తే త్వరగా కోలుకోలేకపోవటం వంటివీ వేధిస్తాయి. అటూఇటూ తేలికగా కదలలేకపోవటం, అదేపనిగా మంచానికి అతుక్కుపోవటం వల్ల చర్మం మీద ఒత్తిడి పడిన చోట పుండ్లు తలెత్తటం, మతిమరుపు వంటివీ తలెత్తుతాయి. అందువల్ల వృద్ధుల్లో పోషణలోపాన్ని వీలైనంత త్వరగా గుర్తించటం చాలా అవసరం. దీంతో మున్ముందు తీవ్రమైన సమస్యల బారినపడకుండా చూసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని