ఆటిజాన్ని కనిపెట్టండి!

ఇతర పిల్లలతో కలవటానికి, మాట్లాడటానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండటానికి, ఆడుకోవటానికి ప్రయత్నిస్తారు. తమకేం కావాలో చెప్పలేరు. భావాలను వ్యక్తం చేయలేరు. ఇలాంటి లక్షణాలతోనే వేధిస్తుంది ఆటిజమ్‌.

Published : 10 May 2016 00:56 IST

ఆటిజాన్ని కనిపెట్టండి!

ఇతర పిల్లలతో కలవటానికి, మాట్లాడటానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండటానికి, ఆడుకోవటానికి ప్రయత్నిస్తారు. తమకేం కావాలో చెప్పలేరు. భావాలను వ్యక్తం చేయలేరు. ఇలాంటి లక్షణాలతోనే వేధిస్తుంది ఆటిజమ్‌. మాట, చూపు, ఆలోచన, ప్రవర్తన.. ఇలా రకరకాల విభాగాల్లో ఎదుగలను ప్రభావితం చేసే సమస్య ఇది. పాశ్చాత్యదేశాలకే పరిమితమనుకున్న ఆటిజమ్‌ ఇప్పుడు మనదేశంలోనూ ఎక్కువగానే కనబడుతోంది. కాబట్టి దీని లక్షణాలపై అవగాహన పెంచుకొని, ముందుగానే జాగ్రత్త పడటం మంచిది.

నదేశంలో ప్రతి 85 మందిలో ఒక పిల్లాడు ఆటిజమ్‌ బారినపడుతున్నట్టు అంచనా. ఇది ఆడపిల్లల్లో కన్నా మగపిల్లల్లో ఎక్కువ. ప్రతి 5 మంది ఆటిజమ్‌ బాధితుల్లో నలుగురు మగపిల్లలే! నిజానికి ఈ సమస్య చిన్నప్పటి నుంచే ఉంటున్నా.. చాలామందిలో మూడేళ్ల వయసు తర్వాతే గుర్తిస్తున్నారు. ఈ వయసులో పిల్లలు బడిలో చేరటం, తోటి పిల్లలతో మాట్లాడాల్సి రావటం.. ఇలాంటివన్నీ ఆటిజమ్‌ ప్రవర్తన స్పష్టంగా బయటపడేలా చేస్తున్నాయి. దీని లక్షణాల తీవ్రత కూడా ఒకొకరిలో ఒకోలా ఉండటం కూడా సమస్య నిర్ధరణ ఆలస్యమవుతోంది. ఆటిజమ్‌ లక్షణాలు చిన్నప్పటి నుంచే కనబడతాయి. కాకపోతే మనం గుర్తించేంత స్థాయిలో ఉండవు. ఇలాంటి పిల్లలు అందరిలా నవ్వకపోవచ్చు. కళ్లలోకి కళ్లు పెట్టి చూడకపోవచ్చు. నోటితో తాత్తాత్తా.. అత్తాత్తాత్త.. వంటి ముద్దుముద్దు శబ్దాలు చేయకపోవచ్చు. ఎవరైనా ఎత్తుకున్నా, ముద్దు పెట్టుకున్నా వెనక్కి నెట్టేస్తుంటారు. చుట్టుపక్కల పరిసరాలను అంతగా పట్టించుకోరు. ఆటబొమ్మల విషయంలోనూ ఏదో ఒక భాగం మీదే (ఉదా: కారు చక్రం) ఎక్కువగా దృష్టి పెడతారు. చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. విపరీతమైన కోపంతోనూ ప్రవర్తిస్తుంటారు. వస్తువులను చిందరవందర చేసేస్తుంటారు. కొందరికి వచ్చిన మాటలు కూడా పోతుంటాయి.

ఆటిజమ్‌ పిల్లలను బడిలో చేర్చినపుడు నేర్చుకోవటంలో ఇబ్బంది పడతారు. ఏదైనా నేర్చుకుంటే దాన్ని పదే పదే చెబుతుండటం, త్వరగా గ్రహిస్తున్నట్టు కనబడినప్పటికీ.. అసలు విషయాన్ని గానీ హేతువును గానీ అర్థం చేసుకోలేరు. అందువల్ల నేర్చుకున్న విషయాలను రోజువారీ పనుల్లో అన్వయించుకోలేరు. కొన్ని అంశాలనైతే అసలు అర్థమే చేసుకోలేరు. కొందరు ఆటిజమ్‌ పిల్లలు సంగీతం, గణితం వంటి వాటిల్లో విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. దీంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బాగా తెలివైన వారని పొరపడుతుంటారు. ఇలాంటి లక్షణాలను గమనిస్తే ఆటిజమ్‌ను అనుమానించి, నిపుణులను సంప్రదించాలి.

నిజానికి ఆటిజమ్‌కు కచ్చితమైన కారణమేంటో తెలియదు. దీనికి జన్యువుల దగ్గర్నుంచి పర్యావరణ ప్రభావం వరకు రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. ఇలాంటి పిల్లల కుటుంబాలను పరిశీలిస్తే చాలామంది కుటుంబ సభ్యుల్లో ఏదో ఒక ఆటిజమ్‌ లక్షణం కనబడుతుంది కూడా. స్త్రీలు గర్భం ధరించినపుడు పురుగుమందులు, ఇతర కాలుష్య కారకాల ప్రభావానికి గురికావటం వల్ల పిల్లల్లో ఆటిజమ్‌ తలెత్తొచ్చనీ అనుమానిస్తున్నారు. పెద్దవయసు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు ఈ సమస్య వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆటిజమ్‌ను నయం చేయటానికి మందులేవీ లేవు. కానీ దీని మూలంగా తలెత్తే ఇతరత్రా సమస్యలకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల పెంపకంలో, చదువుల్లో జాగ్రత్తలు తీసుకోవటం వల్ల చాలామందిలో లక్షణాలు కుదురుకుంటాయి. ప్రవర్తన సంబంధ చికిత్సతోనూ మంచి ఫలితం కనబడుతుంది. కొద్దిపాటి ఆటిజమ్‌ లక్షణాలు గల పిల్లలకు అవసరమైన విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటే.. యుక్తవయసు వచ్చేసరికి చాలావరకు కుదురుకుంటారు.


ఈ లక్షణాలు కనబడితే జాగ్రత్త పడాలి..

* 6 నెలల వయసు వచ్చేవరకైనా నవ్వకపోతే

* 9 నెలల వరకు శబ్దాలను, ముఖ కవళికలను అనుకరించక

* ఏడాది వరకైనా తత్తాత్తా.. అత్తాత్తా.. అనకపోతే

* 16 నెలల వరకు ఎలాంటి మాటలూ రాకపోతే

* 24 నెలల వరకు రెండు పదాలను కలిపి మాట్లాడకపోతే


 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని