పిల్లాడు మట్టి తింటున్నాడు..

మా బాబు వయసు 20 నెలలు. మట్టి, రాళ్లు నోట్లో పెట్టుకుంటున్నాడు.

Published : 21 Aug 2018 01:44 IST

సమస్య - సలహా
పిల్లాడు మట్టి తింటున్నాడు..

సమస్య: మా బాబు వయసు 20 నెలలు. మట్టి, రాళ్లు నోట్లో పెట్టుకుంటున్నాడు. గోడలనూ నాకుతుంటాడు. దీనివల్ల మున్ముందు ఏమవుతుందోనని మాకు భయంగా ఉంది. మట్టి, రాళ్లు మింగితే ఏమైనా ప్రమాదమా? పెద్దయ్యాక ఏవైనా సమస్యలు వస్తాయా?

- బాలు నాయక్‌, సోమ్లాతండ, డిండి

సలహా: మీ బాబు మాదిరిగా పిల్లలు మట్టి, రాళ్ల వంటివి నోట్లో పెట్టుకోవటం మామూలే. సహజంగానే పిల్లల్లో సృజనాత్మకత, పరీక్ష గుణం ఎక్కువ. ప్రతి దాంట్లోనూ ఏముందోనని తరచి చూడాలనే తహతహ ఉంటుంది. అన్నింటినీ ముట్టుకోవాలని, నోట్లో పెట్టుకోవాలని చూస్తుంటారు. ఇలా ఎప్పుడో అప్పుడు చేస్తే భయపడాల్సిన పనేమీ లేదు గానీ ఎప్పుడూ అదే యావలో ఉంటుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. తినకూడని వస్తువులను తినే అలవాటును వైద్యపరంగా ‘పైకా’ అంటారు. దీనికి ప్రధాన కారణం- ఒంట్లో ఐరన్‌ లోపించటం. ఇలాంటివాళ్లు మట్టి, బొగ్గు, రాళ్ల వంటి వాటిని తినటానికి ప్రయత్నిస్తుంటారు. కొందరు దొరకవలసిన ప్రేమ దొరక్కపోవటం వంటి వాటికి నిరసనగా ఇతరుల దృష్టిని ఆకర్షించటానికి కూడా ఇలా చేస్తుండొచ్చు. బుద్ధికుశలత లోపం వంటి మానసిక సమస్యలు కూడా ఇలాంటి ప్రవర్తనకు దారితీస్తుండొచ్చు. మట్టి, రాళ్ల వంటివి నోట్లో పెట్టుకున్నప్పుడు సూక్ష్మక్రిములు కడుపులోకి వెళ్లి ఇన్‌ఫెక్షన్లు తెచ్చిపెట్టే ప్రమాదముంది. ఇది విరేచనాలు, వాంతులకు దారితీయొచ్చు. రాళ్ల వంటివి అన్నవాహికను దాటుకొని వెళ్తే పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. మలంతో పాటు బయటకు వచ్చేస్తాయి. అయితే అరుదుగా కొందరికివి అన్నవాహికలో చిక్కుకుపోవచ్చు. పేగుల్లో చిక్కుకొని అడ్డంకిగా పరిణమించొచ్చు. పదునైన వస్తువులు నోట్లో పెట్టుకుంటే లోపల గాయాలు కావొచ్చు. గోడలకు, తలుపులకు వేసే రంగుల్లోని సీసం కడుపులోకి వెళ్లి విషతుల్యంగా పరిణమించొచ్చు. మట్టిలో ఏలికపాములు, బద్దెపురుగులు, నులిపురుగుల వంటి వాటి గుడ్లు కూడా ఉంటాయి. ఇవి కడుపులోకి వెళ్తే పేగుల్లో నులిపురుగుల సమస్య మొదలు కావొచ్చు. కాబట్టి అదేపనిగా మట్టి, రాళ్లు తింటుంటే తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. ఇలాంటి పిల్లలకు ముందుగా తెలివితేటలు ఎలా ఉన్నాయనేది చూడాల్సి ఉంటుంది. బుద్ధిమాంద్యం వంటి సమస్యలకు పెద్దగా చేసేదేమీ లేదు. ఐరన్‌ లోపం ఉన్నట్టయితే మందులు, పోషకాహారం ద్వారా తగ్గించొచ్చు. ఒకవేళ ప్రేమ, ఆప్యాయతలు దొరక్కపోవటం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నట్టయితే మీకు.. అంటే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ అవసరమవుతుంది. ఏదేమైనా సమస్యగా మారకుండా చూసుకోవటంలోనే గొప్పతనముందని గుర్తించాలి.

* మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా,
* సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం,
* రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
* email:  sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని