logo

ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు

పులివెందులలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు.

Updated : 26 Apr 2024 07:25 IST

సీఎం ప్రసంగంపై మండిపడుతున్న జనం

 

ఈనాడు, కడప, వేంపల్లె, లింగాల, వేముల, చక్రాయపేట, సింహాద్రిపురం, తొండూరు: పులివెందులలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. పులివెందుల బిడ్డనంటూ ఎంతో గొప్పగా చెప్పుకొనే జగన్‌ మాట్లాడిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్నాచెల్లెళ్ల అనుబంధంపై వ్యవహరించాల్సిన తీరు ఇది కాదనే చర్చ నడుస్తోంది. పసుపు చీర కట్టుకుని వెళ్లి వైయస్‌ఆర్‌ శత్రువులను ఆహ్వానించారంటూ జగన్‌ పరోక్షంగా షర్మిలపై విమర్శల వర్షం కురిపించారు. నిజానికి షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరిలో పలువురు అగ్రనేతలను వారి ఇళ్లకు వెళ్లి తన ఇంట జరిగే వివాహానికి ఆహ్వానించారు. ఇందులో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికతోపాటు మిఠాయిలు, కానుకలు అందజేశారు. ఈ సమయంలో షర్మిల పసుపు రంగు చీరను ధరించారు. ఎవరూ దీనిపై ఇప్పటి వరకూ వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా సీఎం జగన్‌ తన చెల్లెలు కట్టుకున్న చీరపై వ్యాఖ్యలు చేశారు. పసుపు రంగు చీర కట్టుకుని వైయస్‌ఆర్‌ శత్రువులకు ఆహ్వాన పత్రికలు అందించారంటూ నాటి ఘటనను పులివెందుల సభలో తెరపైకి తీసుకొచ్చారు.

సీఎం జగన్‌ ప్రసంగిస్తుండగానే బయటకు వెళ్లిపోతున్న ప్రజలు


ఖాళీగా ఉన్న బహిరంగ సభ మైదానం

జగన్‌ వ్యాఖ్యలపై మండిపాటు: తన అన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలపై ఆయన సోదరి షర్మిల తీవ్రంగానే స్పందించారు. సొంత చెల్లెలు ధరించిన దుస్తులపై నిండు సభలో మాట్లాడతారా?.. ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. పసుపు రంగు తెదేపాకు ఏమైనా పేటెంట్‌ రైటా? అని ఆమె ప్రశ్నించారు. ఇదే అంశంపై చంద్రబాబు సైతం స్పందించారు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుకపైనా.. మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? ఎంత నీచం అంటూ నిప్పులు చెరిగారు. అటు పులివెందుల... ఇటు కడపలో సైతం ఇదే అంశంపై సర్వత్రా చర్చ జరిగింది. మరోపక్క రాజన్న బిడ్డనంటూ తరచూ చెప్పుకొనే షర్మిలపై జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసులు చెప్పాల్సింది.. ప్రజలంటూ జగన్‌ అన్నారు. రాజన్నకు జన్మించినప్పుడు వారసులు పరంగా వచ్చే సందేహం ఏమిటి.. ఇతరులు చెప్పాల్సిన అవసరమేమిటనే ప్రశ్నలు చర్చకు వచ్చాయి. జగన్‌కు తన చెల్లెళ్లు షర్మిల, సునీత మధ్య యుద్దపరమైన వాతావరణమే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల సైతం రాష్ట్ర పర్యటన ముగించుకుని కడపకు చేరుకోవాలని భావిస్తున్నారు. పది రోజుల పాటు పులివెందులతో సహా అన్ని నియోజకవర్గాలు మరోమారు తిరగాలని భావిస్తున్నారు. వైకాపా తీరును అందులోనూ జగన్‌ శైలిని ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పోటీపై జగన్‌లో కొంత భయంగా కనిపిస్తున్ననట్లు ఆయన ప్రసంగం బట్టి తెలుస్తోంది. ఇదే సభలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైకాపాలో జగన్‌ సమక్షంలో చేరారు. ఈయన ఇటీవల తెదేపాలో చేరారు. తిరిగి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.  


సీఎం ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన జనం : పులివెందులలో సీఎం జగన్‌ నామినేషన్‌ కార్యక్రమానికి మండలాల వారీగా లక్ష్యం విధించి కార్యకర్తలు, నాయకులను గురువారం ప్రైవేటు పాఠశాలల బస్సుల్లో బలవంతంగా తరలించారు. పులివెందుల బహిరంగ సభలో ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించగానే కార్యకర్తలు సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారు. సీఎం జగన్‌ ప్రసంగం ప్రారంభం కాగానే 200 మంది కార్యకర్తలు బయటకు వెళ్తుంటే 10 మంది లోపలికి వస్తున్న దృశ్యాలు కనిపించాయి. మైదానం ఖాళీగా ఉన్నా బయటకు వెళ్తున్నవారు ఎక్కువ సంఖ్యలో కనిపించారు. కార్యకర్తలు కర్రలతో సభా ప్రాంగణం వద్దకు రావడంతో స్థానికులు భయాందోళన చెందారు. స్థానిక పూలంగళ్ల వద్ద వాహనాలు నిలిపేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూలంగళ్ల నుంచి సభా ప్రాంగణం వరకు ప్రధాన వీధుల నుంచి వచ్చేవారిని బారికేడ్లు అడ్డుగా ఉంచి గంటల తరబడి ఆపేయడంతో పట్టణవాసులు, వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి వచ్చినవారు ఇబ్బందులు పడ్డారు. యువత బైకు ర్యాలీలు చేయడంతో మహిళలు, వృద్ధులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని