నడకలో మరుపు జాడ

మునుపటిలా వేగంగా నడవలేకపోతున్నారా? అంగలు దూరంగా పడటం లేదా? నడుస్తున్నప్పుడు తూలిపోతున్నారా? అయితే జ్ఞాపకశక్తి తగ్గుతుందేమో కూడా ఒకసారి గమనించుకోండి.

Published : 18 Apr 2017 01:33 IST

నడకలో మరుపు జాడ

మునుపటిలా వేగంగా నడవలేకపోతున్నారా? అంగలు దూరంగా పడటం లేదా? నడుస్తున్నప్పుడు తూలిపోతున్నారా? అయితే జ్ఞాపకశక్తి తగ్గుతుందేమో కూడా ఒకసారి గమనించుకోండి. నడక సమస్యలతో బాధపడేవారికి జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గుముఖం పడుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి మరి. మనం యథాలాపంగా నడిచేస్తుంటాం గానీ ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. కాళ్ల మీద లేచి నిలబడటం, శరీరం తూలిపోకుండా స్థిరంగా ఉండటం ఒక ఎత్తయితే.. ఎక్కడికి వెళ్లాలో, ఎంత వేగంతో వెళ్లాలో, అందుకు ఎంత పెద్ద అంగలు వేయాలో నిర్ణయించుకోవటం మరో ఎత్తు. వీటన్నింటినీ మెదడు లిప్తకాలంలోనే గ్రహించేస్తుంది. వాటిని గుర్తుపెట్టుకొని అవసరమైనప్పుడు తిరిగి జ్ఞాపకం వచ్చేలా చేస్తుంది. ఎక్కడికంటే అక్కడికి నడిచి వెళ్లటానికి తోడ్పడుతుంది. అంటే ఒకరకంగా నడక మన జ్ఞాపకశక్తికి మంచి కొలమానం అన్నమాట. అందుకే విషయగ్రహణ, జ్ఞాపకశక్తి తగ్గే ముప్పు గలవారిని గుర్తించేందుకు మేయో క్లినిక్‌ పరిశోధకులు నడక తీరుపై దృష్టి సారించారు. అంగల దూరం, కదిలే వేగం, లయ, నడిచిన దూరం, చేతులు ముందుకీ వెనక్కీ కదిలించటం.. వంటి వాటిని కంప్యూటర్‌ దృశ్యాల ద్వారా నిశితంగా పరిశీలించారు. జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, భాషా నైపుణ్యాలు తగ్గటానికీ నడిచే తీరులో మార్పులకూ సంబంధం ఉంటున్నట్టు తేల్చారు. వయసు మీద పడుతున్నకొద్దీ నడిచే తీరులో మార్పులు సైతం ఎక్కువవుతున్నాయని, ఇవి రోజువారీ పనులపై.. ముఖ్యంగా వృద్ధులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి నడక తీరులో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదిచటం మంచిదని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని