logo

కొడాలి నాని నామినేషన్‌.. వెలవెల

గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్‌ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా..

Updated : 26 Apr 2024 08:54 IST

డబ్బులిచ్చి తెచ్చినా.. ఫలితం లేదు
తెదేపా కార్యాలయం వైపు వెళ్లాలని ప్రయత్నం
అడ్డుకున్న అధికారులతో.. నేతల వాగ్వాదం

నామినేషన్‌ దాఖలు చేస్తున్న నాని

ఈనాడు, అమరావతి: గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్‌ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఎంత పోరాడినా జనం మాత్రం రాలేదు. గత ఐదేళ్లుగా గుడివాడలో నాని చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడమే దీనికి కారణం. జనానికి మంచినీటి అవస్థలు, రహదారులపై వెతలు కనీస స్థాయిలోనూ నాని పరిష్కరించలేకపోయారు. ఆయన ప్రచారానికి వెళితే.. నిలదీతలు తప్ప.. ఎక్కడా స్వాగతాలు లేవు. అందుకే.. సొంతంగా డబ్బులు పెట్టుకుని మరీ హారతులిప్పించుకోవడం, పూలు చల్లించుకోవాల్సి వస్తోందని.. వైకాపా నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాని గురువారం వేసిన నామినేషన్‌ కూడా జనాలు కరవై.. పేలవంగా మారింది.

గొడవకు కాలు దువ్వినా.. అధికారులు కొడాలి నాని ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా నామినేషన్‌ కేంద్రానికి వెళ్లే రూట్‌మ్యాప్‌ ఇచ్చారు. తెదేపా కార్యాలయం వైపు రాకుండా.. వేరే మార్గంలో వెళ్లేలా అనుమతి ఇచ్చారు. కానీ.. ఈ మార్గాన్ని మార్చి ఏలూరు రోడ్డులోని తెదేపా కార్యాలయం మీదుగా వెళ్లాలని నాని వర్గం ప్రయత్నించింది. తెదేపా కార్యాలయం వద్దకు వెళ్లి గొడవకు కాలు దువ్వాలని అనుకున్నారు. కానీ.. గుడివాడలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారేందుకు అవకాశం ఉందని పోలీసులు ముందే అప్రమత్తమై.. అటువైపు వెళ్లకుండా ర్యాలీని అడ్డుకున్నారు. అయినా పట్టువదలకుండా.. రాజేంద్రనగర్‌ ఎస్‌బీఐ బ్యాంకు మీదుగా.. ఏలూరు రోడ్డులోని తెదేపా కార్యాలయం వైపు ప్రవేశించేందుకు.. వైకాపా మూక ప్రయత్నించింది. ఎవరు అడ్డుకున్నా ఆగేదే లేదంటూ.. గొడవకు కాలు దువ్వారు. పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి, వారితో వాగ్వాదానికి దిగారు. అయినా.. పోలీసులు అంగీకరించకపోవడంతో.. నాని అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట పడింది. దీంతో ఏలూరు రోడ్డు, మార్కెట్‌ సెంటర్‌, పాత మున్సిపల్‌ కార్యాలయం మీదుగా ర్యాలీ ఆర్డీవో కార్యాలయానికి చేరింది.  

వారమంతా ఊదరగొట్టి.. డబ్బులిచ్చినా.. పెద్ద సంఖ్యలో జనాన్ని తెచ్చి ర్యాలీగా తీసుకొస్తుండగా.. నెహ్రూచౌక్‌కు చేరుకునేసరికి.. వాళ్లంతా వెనక్కి వెళ్లిపోయారు. వారిని ర్యాలీలో ఉండాలని, వెళ్లిపోవద్దంటూ వైకాపా నేతలు బతిమాలినా.. ఎవరూ వినలేదు. గత వారం రోజులుగా నాని నామినేషన్‌ ఉందంటూ.. గుడివాడ నియోజకవర్గంలో మైకుల్లో ఊదరగొట్టి మరీ.. ప్రచారం చేశారు. గురువారం ఉదయం నుంచి మనిషికి రూ.300, మద్యం, బిర్యానీ ఇస్తామని చెప్పి జనాన్ని తీసుకొచ్చారు. ట్రాక్టర్లు, ఆటోలు పెట్టి మరీ జనాన్ని తీసుకొచ్చినా.. వాళ్లు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడం గమనార్హం.

మహిళతో అసభ్య ప్రవర్తన..?: కొడాలి ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు కార్యకర్తలు.. శరత్‌ థియేటర్‌ ప్రాంతంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ర్యాలీలో జెండా పట్టుకునేందుకు వచ్చిన మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఆమె వర్గీయులు వచ్చి.. వారిద్దరికీ దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన బయటకు రాకుండా.. నేతలు జాగ్రత్త పడినట్లు సమాచారం.

నెహ్రూచౌక్‌లో ప్రజలు లేక పేలవంగా ఉన్న ర్యాలీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని