నొప్పుల పని పట్టండి!

కాలుకో, చేయికో దెబ్బ తగులుతుంది. లేదూ మడమ బెణుకుతుంది. వెంటనే నొప్పి, వాపు మొదలవుతాయి...

Published : 10 Apr 2018 01:40 IST

జీవనశైలి
నొప్పుల పని పట్టండి!

  కాలుకో, చేయికో దెబ్బ తగులుతుంది. లేదూ మడమ బెణుకుతుంది. వెంటనే నొప్పి, వాపు మొదలవుతాయి. అప్పటికప్పుడు హఠాత్తుగా తలెత్తే ఇలాంటి నొప్పులు మందులు వేసుకుంటే కొద్దిరోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ దీర్ఘకాల నొప్పులు అలాకాదు. వస్తూ పోతూ.. విడవకుండా, దీర్ఘకాలం వేధిస్తుంటాయి. రోజువారీ పనులనూ దెబ్బతీస్తాయి. దీనికి తోడు ఒత్తిడి, ఆందోళన వంటివీ మొదలవుతాయి. సాధారణంగా 12 వారాలకు పైగా వేధించే నొప్పులను దీర్ఘకాల నొప్పులుగా భావిస్తారు. వీటికి కారణమేంటో కచ్చితంగా తెలియకపోవటం మరో సమస్య. అందువల్ల వీటిని నిర్ధరించటమే కాదు, చికిత్స చేయటమూ కష్టమే. చాలామంది నొప్పి మందులతో ఉపశమనం పొందుతుంటారు. అయితే వీటిని దీర్ఘకాలం వాడితే దుష్ప్రభావాలకు దారితీయొచ్చు. కాబట్టి దీర్ఘకాల నొప్పులకు జీవనశైలి మార్పులు, ఇతరత్రా పద్ధతుల వైపు దృష్టి పెట్టటం మంచిది.

వ్యాయామం: అసలే నొప్పితో బాధపడుతుంటే వ్యాయామం చేయటమంటే ఎవరికైనా కష్టంగానే అనిపిస్తుంది. నిజానికి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. కానీ దీర్ఘకాల నొప్పులకు వ్యాయామం, శారీరక శ్రమ ఎంతో మేలు చేస్తాయి. వీటితో నొప్పి తగ్గటంతో పాటు శరీర సామర్థ్యం మెరుగువుతుంది. అలాగని దూరదూరాలు పరుగెత్తాల్సిన పనేమీ లేదు. తేలికపాటి వ్యాయామాలు చేస్తే చాలు. ఫిజియోథెరపీతో మరింత మంచి ఫలితం కనబడుతుంది. వారానికి రెండు సార్ల చొప్పున 6-8 వారాలు ఫిజియోథెరపీ చేసినా నొప్పులు తగ్గుముఖం పడతాయి. బరువు అదుపు: అధిక బరువుతో నొప్పులు ఎక్కువవుతాయి. కదలికలూ తగ్గిపోతాయి. అందువల్ల బరువును అదుపులో ఉంచుకోవటం ఉత్తమం. అధిక బరువు మూలంగా కీళ్లు, డిస్కులపై భారం పెరగటం ఒక్కటే కాదు. ఒంట్లో ఎక్కువగా పోగుపడిన కొవ్వు కణజాలం వాపు ప్రక్రియనూ ప్రేరేపిస్తుంది. ఇదీ నొప్పికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, సాల్మన్‌ వంటి చేపలు, గింజపప్పులు, ఆలివ్‌ నూనె వంటివి వాపు ప్రక్రియ తగ్గటానికీ తోడ్పడతాయి. అలాగే వాపు ప్రక్రియకు దోహదం చేసే పొట్టుతీసిన పిండి పదార్థాలు, వేపుళ్లు, మాంసం, మాంసాహార ఉత్పత్తులకు దూరంగా ఉండటమూ మంచిది.
ప్రవర్తనా చికిత్సలు: నొప్పులకు అన్నిసార్లూ శారీరక మార్పులే మూలం కాకపోవచ్చు. మానసిక భావనలూ నొప్పులను ప్రేరేపిస్తుండొచ్చు. అందువల్ల మన ఆలోచనా ధోరణులను, ప్రవర్తనలను మార్చేసే మానసిక చికిత్స కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది దీర్ఘకాల నొప్పి గురించి మనం ఆలోచించే ధోరణిని మారుస్తూ నొప్పి తగ్గటానికి తోడ్పడుతుంది. మానసిక విశ్రాంతికి తోడ్పడే పద్ధతులను పాటించేలా చూడటం.. నొప్పి లక్షణాలను ఉద్ధృతం చేసే కుంగుబాటు, ఆందోళన, నిద్రలేమి వంటి వాటిని ఎదుర్కొనేలా చేయటం వంటివి ఈ చికిత్సలో నేర్పిస్తారు. ధ్యానం, మర్దన: మనసును ఒక అంశం మీద కేంద్రీకరించేలా చేసే ఏకాగ్రతతో కూడిన ధ్యానం నొప్పి తగ్గటానికీ తోడ్పడుతుంది. హాయి భావనను పెంపొందిస్తుంది. నొప్పి కలుగుతున్న చోట నెమ్మదిగా మర్దం చేస్తే తాత్కాలికంగానే అయినా మంచి ఉపశమనం కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని