వూపిరితీసే కాస.. శ్వాస.. హిక్క

ఆయుర్వేదం ఉబ్బసం.. అలర్జీల వంటివన్నీ మనం ఆధునిక కాలపు జబ్బులనుకుంటూ ఉంటాం...

Published : 16 Jan 2016 19:24 IST

వూపిరితీసే కాస.. శ్వాస.. హిక్క

 ఆయుర్వేదం ఉబ్బసం.. అలర్జీల వంటివన్నీ మనం ఆధునిక కాలపు జబ్బులనుకుంటూ ఉంటాం! వాహన కాలుష్యం.. ఇంధన కాలుష్యం.. పర్యావరణ కాలుష్యం.. ఇలా ఈ పారిశ్రామికీకరణ కాలంలో మన జీవితాలను కాలుష్యం ఆవరించి.. శాసిస్తోందని భావిస్తుంటాం. నిజమేగానీ.. ఈ శ్వాసకోశ వ్యాధులు ఇప్పటివి కావు. అనాదిగా మానవాళిని వేధిస్తూనే ఉన్నాయి. కాకపోతే వాటి విస్తృతీ, తీవ్రతా నానాటికీ పెరుగుతున్నాయి. అందుకే అనాదిగా.. ఆయుర్వేదంలో కూడా ఈ ‘శ్వాస’ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. కాస-శ్వాస-హిక్కగా విభజించి కారణాలు, చికిత్సలను వివరించారు. వీటికి అజరామరమైన ఔషధాలనూ వెలుగులోకి తెచ్చారు. అలర్జీ, దగ్గు, ఉబ్బసం.. వంటివాటికే కాదు. ఎక్కిళ్ల వంటి సమస్యలకు కూడా చక్కగా పనిచేసే ఔషధాలను ఆయుర్వేద సూత్రకారులు సవివరంగా చర్చించారు. ఈ నేపథ్యంలో సుఖీభవ అందిస్తున్న సమగ్ర కథనం..  ప్రత్యేకం!

వేధించే కాస కాస అంటే.. దగ్గు! ఆయుర్వేద సూత్రకారులు దీన్ని ‘కాసతే అనేన ఇతి కాసః’ అని నిర్వచించారు. అంటే.. నోటి నుంచి ఒక రకమైన కుత్సిత శబ్దం చేస్తూ వచ్చేది అని. ‘కసతి కంఠాత్‌ ­ర్ధ్వం గచ్ఛతి’ అనీ అంటారు. కంఠంలోంచి పైకి వెలువడే కుత్సిత శబ్దమని అర్థం. వాడుక భాషలో ‘దగ్గు’గా పిలిచే, విడవకుండా వేధించే ఈ సమస్యకు- ప్రధానంగా పొగ, దుమ్ము, ధూళి కారణం. ఇవి శ్వాసనాళంలో అడ్డుపడ్డప్పుడు ఆ భాగంలో చికాకు కలిగిస్తాయి. వాటిని బయటకు విసర్జించే క్రమంలో దగ్గు వస్తుంది.

కారణాలు:
* పొగను నోటి నుంచి గానీ ముక్కు నుంచి గానీ ఎక్కువగా పీల్చటం.
* శక్తికి మించిన శారీరక శ్రమ చేయటం.
* పూర్తిగా ఎండిన, తడిలేని పొడి (డ్రై) పదార్థాలు తీసుకోవటం.
* ఆహారం తినేప్పుడు పదార్థాలు పొరపాటున శ్వాసనాళంలోకి వెళ్లటం. దీన్నే పొలమారటం/కొరబోవటం/పొరపోవటం అంటారు.
* తుమ్ము, దగ్గుల వంటివి వచ్చినప్పుడు బలవంతంగా ఆపుకోవటం (వేగ నిరోధం).

దగ్గినపుడు వచ్చే శబ్దం ఎలా ఉంటుందో ఆయుర్వేదంలో చెబుతూ.. ‘సంభిన్న కాంస్యస్‌ సమతుల్య ఘోషః’ అని పేర్కొన్నారు. అంటే కంచు పాత్ర కింద పడిపోతే వచ్చే శబ్దంలా ఉంటుదన్నమాట. కాస రావటానికి ముందు.. కంఠంలో ముళ్లు గుచ్చినట్టు అనిపిస్తుంది. దురద, కొన్నిసార్లు అన్నం, నీటిని మింగటంలో ఇబ్బంది కూడా ఇబ్బందిగా ఉంటుది. ఆయా దోషాలు, ధాతు క్షీణతను బట్టి కాసను ఐదు రకాలుగా విభజించారు. 1. వాత కాస 2. పిత్త కాస 3. కఫ కాస 4. క్షతం 5. క్షయం.

* వాత కాస: ఇందులో గొంతు మారుతుంది (స్వరభేదం). కణతలు, తల నొప్పి పెడతాయి. భోజనం జీర్ణమైన వెంటనే దగ్గు తగ్గిపోతుంది. గొంతు ఎండిపోవటం వల్ల (రూక్షం) దగ్గుతున్నప్పుడు కంగుమని ధ్వని వెలువడుతుంది.
* పిత్త కాస: దగ్గుతో పాటు ఛాతీలో మంట, జ్వరం, నోరు ఎండిపోవటం, దాహం ఉంటాయి.
* కఫ కాస: ఇందులో తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. వేడి నీళ్లు తాగితే తగ్గుతుంది. దగ్గుతో పాటు వాంతి వస్తున్నట్లు అనిపిస్తుంది. అన్నహితవు ఉండదు. శరీరమంతా భారంగా అనిపిస్తుంది. గొంతులో దురద ఎక్కువగా ఉంటుంది.
* క్షతం: క్షతం అంటే దెబ్బ తగలటం. వీటి మూలంగా ధాతువులు క్షీణించి కాసకు దారితీస్తుంది. ఇది ఓజో క్షయం వల్ల వస్తుంది. ఎక్కువగా స్త్రీ సంభోగం చేయటం, అధిక భారాలు మోయటం, ఎక్కువ దూరం నడవటం, ఎక్కువగా ప్రయాణాలు చేయటం వల్ల ఇలాంటి కాస వస్తుంది. గొంతులో సూదితో గుచ్చినట్టు నొప్పి కలుగుతూ దగ్గు రావటం దీని ప్రత్యేక లక్షణం. జ్వరం కూడా ఉంటుంది. కొన్నిసార్లు బాగా దగ్గటం వల్ల శరీరం రంగు కూడా మారొచ్చు.
* క్షయం: ధాతువులు పూర్తిగా క్షీణించటం వల్ల వచ్చే ఇది క్షయను పోలి ఉంటుంది. సరిపడని ఆహార, విహారాలు దీనికి దోహదం చేస్తాయి. అధికంగా సంభోగంలో పాల్గొనటం, మల మూత్రాలను బలవంతంగా ఆపుకోవటం కూడా కారణమవుతాయి. ఈ రకం కాసలో దగ్గినపుడు కళ్లె ఎక్కువగా పడుతుంది. కళ్లె పసుపు పచ్చగా, దుర్గంధంతో కూడి ఉంటుంది. ఒకోసారి రక్తం కూడా కనబడొచ్చు.

చికిత్స : రోగ బలం, రోగి బలం మీద కాస చికిత్స ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మనిషి బలంగా ఉన్నప్పుడు ఎలాంటి కాసైనా తగ్గుతుంది. బలహీనంగా ఉంటే చిన్నపాటి కాస కూడా అసాధ్యమైందిగా తయారవుతుంది. వాత, పిత్త, కఫ కాసలు చికిత్సకు తేలికగా లొంగుతాయి గానీ.. క్షత, క్షయ కాసలు మాత్రం కాస్త కష్టం. కాబట్టి దోషాలు, రోగబలం, రోగి బలాన్ని బట్టి ఔషధాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

* కాస మందుల్లో.. వాసా అవలేహ్యం, కంఠకారి అవలేహ్యం, సూతసేకర రసం, ద్రాక్షాసవం, లక్ష్మీ విలాస రసం, చ్యవనప్రాశ అవలేహ్యం చాలా ముఖ్యమైనవి. ఇవి అన్ని కాసలు తగ్గటానికి పనికొస్తాయి.
* వాత, పిత్త, కఫంతో కూడిన కాసలకు శీతోఫలాది చూర్ణం, తాళిసాది చూర్ణం, లవంగాదివటి బాగా ఉపయోగపడతాయి.
* భృంగరాజాసవాన్ని 30 ఎం.ఎల్‌. చొప్పున రోజుకి మూడు సార్లు తీసుకుంటే క్షతం, క్షయంతో కూడిన కాసలు చాలావరకు తగ్గుతాయి. అగస్త్య రసాయనం కూడా వీటికి బాగా ఉపయోగపడుతుంది.
* క్షతం, క్షయతో కూడిన కాసల్లో ధాతువులు క్షీణిస్తాయి కాబట్టి వీటితో పాటు రసాయనాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో ముఖ్యమైనవి భృంగరాజ రసాయనం, సిద్ధ మకరధ్వజం, లక్ష్మీవిలాస రసం.
* బూడిద గుమ్మడికాయ వేళ్లను పొడిచేసి, గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకుంటే కాస చాలావరకు తగ్గుతుంది.
* తీవ్రమైన దగ్గుతో శరీరం కృశించి పోయినవారికి అజామాంస రసాయనం ఎంతగానో ఉపయోగపడుతుంది.

పథ్యం :.. తినాల్సినవి: పెసలు, మినుములు, ఉలవలు, వెల్లుల్లి, దానిమ్మ తీసుకోవాలి. మేకపాలు, మేకనెయ్యి కూడా మంచివి. ఇవి ఔషధంగానూ పనిచేస్తాయి.
తినకూడనివి: పెరుగు, చన్నీళ్లు తీసుకోకూడదు. తీపితో కూడిన పాయసాల వంటివి కఫం పెంచుతాయి. అందువల్ల వీటిని తినకూడదు. పగటి నిద్రతో కఫం పెరుతుంది కాబట్టి పగటిపూట నిద్ర పోవటం మంచిది కాదు. అలాగే చలిగాలిలో తిరగకూడదు.

పీడించే శ్వాస  జబ్బు అంటే..

వూ­పిరి ­ తీసుకోవటంలో, వదలటంలో ఇబ్బంది కలగటం. దీని బారినపడ్డవారిలో గుండె బరువుగా ఉంటుంది. పిల్లికూతలు కూడా కనిపిస్తాయి. ఉబ్బసం కూడా ఈ శ్వాసలో ఒక రకం జబ్బే.

 కారణాలు వేడిగా ఉన్న ఎండు మిరపకాయల వంటివి ఎక్కువగా తినటం, చల్లటి పదార్థాలు అధికంగా తీసుకోవటం, చల్లటి ప్రదేశాల్లో ఎక్కువగా తిరగటం, ధూళి పొగ ఎక్కువగా పీల్చుకోవటం, పెద్ద పెద్ద బరువులు మోయటం, ఎక్కువసేపు నడటం, మల మూత్రాలను బలవంతంగా ఆపుకోవటం, ఎక్కువగా ఉపవాసం చేయటం వంటివి.

శ్వాస రకాలు మహాశ్వాస: ఇందులో చాలా కష్టపడుతూ, దీర్ఘంగా ­పిరి తీసుకోవటం కనిపిస్తుంది. శ్వాస తీసుకునేప్పుడు శబ్దమూ వస్తుంది. నోరు తెరచుకొని గాలి ఎక్కువగా పీలుస్తుంటారు. ఈ సమయంలో చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపై ధ్యాస కూడా ఉండదు. మల మూత్రాలు ఆగిపోతాయి. మాట సరిగా రాదు. వీటితో మానసిక వ్యథకు లోనవుతారు. దీనికి చికిత్స అసాధ్యం.
*వూ ­ర్ధ్వశ్వాస: పీల్చుకునే గాలి తక్కువగా, విడిచే గాలి దీర్ఘంగా సాగుతుంది. నోరంతా తెల్లగా అవుతుంది, రుచి ఉండదు. అప్పుడప్పుడు మూర్ఛపోతుంటారు. ఛాతీలో బాధ కలుగుతుంది. ­ర్ధ్వశ్వాస చికిత్సకు నెమ్మదిగా లొంగుతుంది (కష్టసాధ్యం).

ఛిన్న శ్వాస: ఇందులో శ్వాస మధ్య మధ్యలో ఆగిపోతుంటుంది. చెమట అధికంగా పోయటం, కడుపు ఉబ్బరం, మూర్ఛ, నోరు ఎండుకుపోవటం, శరీరం కృశించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికీ చికిత్స కష్టసాధ్యమే.

  తమక శ్వాస: దీన్నే సాధారణ భాషలో ఉబ్బసం అంటారు. ఎక్కువమందిలో కనబడే సమస్య ఇదే. కూచుంటే హాయిగా ఉంటుంది (ఆసీనే లభతే సౌఖ్యం). పడుకుంటే ఆయాసం ఎక్కువవుతుంది. తమకశ్వాస గలవారు పరిసరాలు వేడిగా ఉండాలని, వేడి నీరు, కాఫీ వంటివి తాగాలని కోరుకుంటారు (ఉష్ణంచైవాది నందతే). శ్వాస అధికంగా తీసుకుంటున్నప్పుడు పిల్లికూతలు, ఆయాసం కూడా వస్తాయి. విపరీతంగా దగ్గినపుడు కఫం బయటకు పోతే ఉబ్బసం తగ్గుతుంది. శరీరమంతా కృశించి పోతుంది (శ్లేష్మనః ఆముచ్యమానేతు.. కృశం భవతి దుఃఖితః). తమకశ్వాస వస్తూ పోయే సమస్య. అందువల్ల ఈ జబ్బు కనపడ్డప్పుడల్లా చికిత్స తీసుకోవాల్సి (యాప్యం) ఉంటుంది.

క్షుద్ర శ్వాస: ఇది అలర్జీ దగ్గు వంటిదని చెప్పుకోవచ్చు. కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఒకోసారి దానంతట అదే తగ్గిపోతుంది కూడా. ఇందులో ఆయాసం వంటివేవీ ఉండవు. శ్వాస తీసుకోవటంలో కొంత ఇబ్బంది కనబడుతుంది. క్షుద్రశ్వాస చికిత్సకు పూర్తిగా నయమవుతుంది.

చికిత్స
*శ్వాస సమస్యకు దశమూలారిష్ట, కనకాసవం, శ్లేష్మాంతకరసం, శృంగిభస్మం, శుభ్రభస్మం, శ్వాసకుఠార రసం, చిత్రపుంజ కల్పం చాలా బాగా పనిచేస్తాయి. అయితే వీటిని వైద్యుల సూచనల మేరకే తీసుకోవాల్సి ఉంటుంది.

* 15 ఎం.ఎల్‌. అల్లం రసంలో 3 గ్రాముల తేనెను కలిపి.. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకుంటే శ్వాస చాలావరకు తగ్గుతుంది.
* శొంఠి, గైరికం పొడులను ఒక గ్రాము చొప్పున సమాన భాగాలుగా తీసుకొని తేనెతో కలిపి రోజూ రెండుసార్లు తీసుకుంటే అలర్జీతో కూడిన దగ్గు, ఆస్థమా బాగా తగ్గుతాయి.
* తీవ్రమైన ఉబ్బసంతో బాధపడే వారికి సమీర పన్నగరసంతో మంచి ఫలితం కనబడుతుంది.
* గ్రాము తామ్రభస్మంలో తిప్పతీగె చూర్ణం గానీ శిలాజిత్తుగానీ కలిపి 40 భాగాలు చేసి.. రోజుకి రెండు భాగాల చొప్పున 20 రోజుల పాటు తేనేతో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది.

పథ్యం
 తినాల్సినవి: గోధుమ అన్నం, ముల్లంగి, పొట్లకాయ, వెలంగపండు తినాలి. ఇవి ఆహారాలు మాత్రమే కాదు. ఔషధాలుగానూ పనిచేస్తాయి. మాంసాహారులు శొంఠి, మిరియాలు, అల్లం కలిపిన మాంసరసం కూడా తీసుకోవచ్చు.

తినకూడనివి: పుల్లగా, చల్లగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. పుల్లటి పెరుగు పూర్తిగా మానేస్తే మంచిది. పగటినిద్ర, వర్షంలో తడవటం పనికిరావు.

రసాయనాల మేలు

సాయన ఔషధాలతో శరీరం బలం పుంజుకుంటుంది. దీంతో వ్యాధులను తట్టుకోగల సామర్థ్యం చేకూరుతుంది. ఫలితంగా వ్యాధులు రాకుండానూ కాపాడుకోవచ్చు. ఒకవేళ వ్యాధులు వచ్చినా త్వరగా నయమవుతాయి కూడా. ఈ రసాయన ఔషధాల్లో భృంగరాజాసవం చాలా ముఖ్యమైంది. దీన్ని 30 ఎం.ఎల్‌. చొప్పున రోజుకి మూడుసార్లు తీసుకుంటే దగ్గు, ఉబ్బసం (కాస, శ్వాస) వంటివాటిని తగ్గించటంతో పాటు రసాయనంగానూ పనిచేస్తుంది. ఇది ­పిరితిత్తులు బలం పుంజుకునేలా చేసి.. దుమ్ము, ధూళిని తట్టుకునేలా తీర్చిదిద్దుతుంది. అగస్త్య రసాయనం, చ్యవనప్రాశ కూడా ఇలాగే పనిచేస్తాయి. స్వర్ణం, అభ్రకం, స్వర్ణ మాక్షిక భస్మం వంటివీ బాగా ఉపయోగపడతాయి. బాధించే హిక్క హినత్థీతి ఇతి హిక్కా..

అంటే తరచుగా గాలి పీల్చుకుంటున్నప్పుడు బాధ ఎక్కువయ్యేది అని అర్థం. వాత, కఫ దోషాలు అధికమైనప్పుడు, శరీరం తీవ్రంగా శ్రమకు గురైనప్పుడు ఇది వస్తుంది. సాధారణ భాషలో దీన్నే ఎక్కిళ్లు అని పిలుస్తారు. శరీర పైభాగంలోని ప్రాణవాయువు.. ఉదానవాయుతో కలిసి పైకి వస్తూ ఎక్కిళ్లుగా మారతాయి. ఇది లోపల్నుంచి అయవాలన్నీ బయటకు వస్తాయేమో అనేంత తీవ్రంగా బాధిస్తుంది. కొన్నిరకాల ఎక్కిళ్లు విడవకుండా నెలల పాటు వేధిస్తాయి కూడా. ఎక్కిళ్లకు ముందు కంఠంలో, ఛాతీలో భారంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నోరు వగరుగా ఉంటుంది. కడపులో గుడగుడ శబ్దాలు వస్తాయి. పూర్తిగా పథ్యం చేస్తూ.. సరైన మందులు పూర్తికాలం వాడుతూ.. దోషాలను సరిచేస్తే.. ఎక్కిళ్లు త్వరగా తగ్గుతాయి. కానీ ఎక్కిళ్లను తొలిదశలో నిర్లక్ష్యం చేస్తే మహా హిక్కగా మారుతుంది. దీంతో శరీరంలోని అవయవాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అందువల్ల కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చని గుర్తుంచుకోవాలి.

హిక్క రకాలు
*అన్నజ హిక్క: ఇది మద్యం అధికంగా తీసుకోవటం, తీవ్ర కోపం, ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా ప్రయాణాలు చేయటం, అధికంగా నవ్వటం వల్ల వస్తుంది. ఇది చికిత్సకు సాధ్యం.
* యమల హిక్క: ఇందులో రెండేసి ఎక్కిళ్లు వచ్చి ఆగిపోతుంటాయి. తిరిగి కొంతసేపయ్యాక మళ్లీ వస్తాయి. ఇది కూడా చికిత్సకు సాధ్యమే.
* క్షుద్ర హిక్క: ఇది పెద్దగా బాధించదు గానీ చాలా చికాకు కలిగిస్తుంది.
* గంభీర హిక్క: ఒకోసారి ­పిరి తీసుకోలేకపోవటం, చాలా కష్టంగా ­పిరి తీసుకోవటం వంటివి ఇందులో కనిపిస్తాయి. ఇది చికిత్సకు అసాధ్యం.
* మహా హిక్క: ఇందులో ఎక్కిళ్లు వచ్చీ వచ్చీ అన్ని అవయవాలు క్షీణించిపోతాయి. తలనొప్పి, కడుపునొప్పి తీవ్రంగా ఉంటాయి. ఇది చికిత్సకు అసాధ్యం.

చికిత్స
దోషాలు అధికంగా, అన్నంపై ద్వేషం ఉండి.. శరీరం కృశించి పోవటం మూలంగా వచ్చిన హిక్కకు చికిత్స చేయటం సాధ్యం కాదు. తొలిదశలో హిక్కను నిర్లక్ష్యం చేసి, సరైన చికిత్స తీసుకోకపోతే గంభీర హిక్కగానూ, ఆ తర్వాత మహా హిక్కగానూ మారిపోవచ్చు. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు (హిక్కా హంతిః ఆశుః జీవితం).

* కరక్కాయ ముక్కను నోట్లో పెట్టుకొని చప్పరిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి.
* వాముని కొద్దికొద్దిగా నములుతూ రసాన్ని మింగితే హిక్క తగ్గుతుంది.
* మందుల్లో త్రిఫలా మిశ్రణం, ప్రవాళ భస్మం, శృంగ భస్మం బాగా పనిచేస్తాయి.
* నెమలి ఈకల (మయూర పింఛం) మసిని తేనెలో కలిపి రోజూ రెండుసార్లు తీసుకుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి.

* హిక్కను తగ్గించటానికి మందులతో పనిలేని చికిత్సలు కూడా ఉన్నాయి. మనిషిని భయపెడితే (తర్జనం), ఆశ్చర్యానికి గురిచేస్తే (విస్మాపనం), చిత్రమైన కథలు చెబుతూ మనసును మళ్లిస్తే (విస్మరణం), దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు చెబితే (మనో విఘాతం) కూడా ఎక్కిళ్లు తగ్గే అవకాశముంది.

పథ్యం
  తినాల్సినవి: వెల్లుల్లి, లేత ముల్లంగి కూర, మేక నెయ్యి, మేక పాలు, తేనె తీసుకోవాలి. నిద్ర పోవటం అన్నింటికన్నా ముఖ్యం.
తినకూడనివి: చల్లటి నీరు, పుల్లటి పదార్థాలు తీసుకోకూడదు. నూనెతో వేడిచేసిన అన్నం (ఫ్రైడ్‌ రైస్‌) అసలే తీసుకోరాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని