Published : 27 Sep 2016 02:09 IST

మతిమరుపుతో డ్రైవింగా?

మతిమరుపుతో డ్రైవింగా?

నిషి అంటేనే జ్ఞాపకాల గని. తినే తిండి, చేసే పని, స్నేహాలు, బంధుత్వాలు.. అన్నీ జ్ఞాపకాలతో ముడిపడినవే. ఇవి చెదిరితే అన్నీ తలకిందులవుతాయి. అందుకే డిమెన్షియా.. అల్జీమర్స్‌ జబ్బులనగానే ఎవరికైనా భయం పుట్టుకొస్తుంది. ఇవి ఒక్కొక్కటిగా మన జ్ఞాపకాలను చెరిపేస్తూ.. చివరికి మనమెవరమో, ఎక్కడున్నామో కూడా తెలియని స్థితికి తీసుకెళ్తాయి మరి. ఇలాంటివాళ్లను కనిపెట్టుకోవటం ఇంట్లో వాళ్లకు పెద్ద సవాలే అనుకోవచ్చు. డిమెన్షియా బారినపడ్డవారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయకుండా వారిని కాపాడుకోవటమంటే మాటలు కాదు. ముఖ్యంగా వాహనాలను నడిపే విషయంలో నచ్చజెప్పటం చాలా కష్టమైన పని. డ్రైవింగులో చిన్న పొరపాటు చేసినా ప్రాణాల మీదికి వస్తుంది కాబట్టి వాహనాలు వారి చేతికి ఇవ్వాలా వద్దా అనేది పెద్ద సమస్యగా మారుతుంది. కొద్దిపాటి మతిమరుపు ఉన్నవారి విషయంలో ఈ నిర్ణయం తీసుకోవటం మరీ కష్టం. ప్రమాదాలకు ఆస్కారమివ్వకుండా వాహనాలు నడిపినంత వరకు వారి గౌరవానికి భంగం కలిగించాల్సిన పనిలేదన్నది కొందరి వాదన. కానీ ప్రమాదాలు జరిగే అవకాశముందని ముందే గుర్తించటమెలా?

వాహనాలు నడిపేటప్పుడు మన కళ్లు, మెదడు, కండరాలు పరిసరాల సమాచారాన్ని విశ్లేషిస్తూ వేగంగా స్పందించాల్సి ఉంటుంది. అయితే అనూహ్యమైన సందర్భం ఎదురైనప్పుడు డిమెన్షియా బాధితులు భయపడిపోతుంటారు. నిర్ణయాలు తీసుకోకుండా స్తంభించిపోతుంటారు. స్వల్ప స్థాయి అల్జీమర్స్‌ గలవారిలో వాహనాలు నడిపే నైపుణ్యాలు గణనీయంగా తక్కువగా ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలాంటివారిని గుర్తించటానికి వారి ప్రవర్తన బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల అల్జీమర్స్‌ బాధితుల ప్రవర్తనను ఇంట్లోవాళ్లు, స్నేహితులు జాగ్రత్తగా గమనిస్తుండటం మంచిది. తమ చుట్టుపక్కల జరుగుతున్నవాటిని పెద్దగా పట్టించుకోకపోవటం, సందర్భాలకు తగినట్టు నిర్ణయాలు తీసుకోలేకపోవటం, తికమక పడటం, వేగంగా స్పందించకపోవటం వంటి లక్షణాలను గుర్తిస్తే వారి చేతికి వాహనాలు ఇవ్వకపోటమే ఉత్తమం. అదే సమయంలో వారి ఆత్మ విశ్వాసం దెబ్బతినకుండా చూసుకోవటమూ కీలకమే. ఇందుకు తెలివిగా, గౌరవంతో నచ్చజెప్పాల్సి ఉంటుంది. కారు రిపేరు చేయించాలనో, రిజిస్ట్రేషన్‌ గడువు ముగిసిందనో చెబితే కొందరు అంగీకరిస్తారు కూడా. అల్జీమర్స్‌ బాధితుల్లో కొందరు డాక్టర్లు చెప్పిన విషయాలను తప్పకుండా వింటారు. కాబట్టి డాక్టర్లతోనే ఒక మాట చెప్పించాలి. అవసరమైతే ప్రిస్కిప్షన్‌ కాగితం మీదే ‘వాహనాలు నడపొద్దు’ అనీ రాయించుకోవాలి. ఇలా నెమ్మదిగా, మర్యాదగా నచ్చజెబుతూ వాహనాల జోలికి వెళ్లకుండా చూస్తే అల్జీమర్స్‌ బాధితులతో పాటు ఇతరులనూ ప్రమాదాల బారి నుంచి రక్షించినవారవుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు