దృఢమైన కండరాలు.. పటిష్ఠమైన ఎముకలు.. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని స్థిరంగా నిలబడే సామర్ధ్యం.. వీటన్నింటినీ సాధించేందుకు తేలికైన మార్గం.. వ్యాయామం! బద్ధకించకుండా రోజూ కాస్సేపు ఒళ్లు వంచితే రోజంతా హుషారుగా గడవటమే కాదు.. మన ఆయుష్షూ పెరుగుతుంది! * వ్యాయామంతో ఒకవైపు ఎముకలు, కండరాలు దృఢతరమవుతూనే.. మరోవైపు క్యాలరీలు ఖర్చవుతాయి కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవచ్చు. బరువు ఎక్కువ ఉంటే తగ్గనూ వచ్చు. * వ్యాయామంతో చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు, పక్షవాతం, కాలేయానికి కొవ్వు పట్టటం వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. * వ్యాయామ సమయంలో మెదడులో విడుదలయ్యే రసాయనాలు మానసిక ఉల్లాసాన్ని, హుషారును తెచ్చిపెడతాయి. శరీరాకృతి మెరుగు పడి.. ఆత్మ విశ్వాసం సైతం పెంపొందుతుంది. * నిత్య వ్యాయామంతో నిద్ర ఇబ్బందులు దరిజేరవు. శృంగారంపై ఆసక్తి, పటుత్వం రెండూ పెంపొందుతాయి.
|
కూరగాయలు, పండ్లు చక్కటి పోషకాల గనులు. వీటిలో పొటాషియం, ఫోలేట్, విటమిన్-ఎ, విటమిన్-సి వంటి విటమిన్లు, ఖనిజలవణాలు దండిగా ఉంటాయి. మన ఆరోగ్యం దెబ్బతినకుండా చూడటంలో వీటిదే కీలక పాత్ర. * కూరగాయలు, పండ్లలో కొవ్వు, క్యాలరీలు చాలా తక్కువ. కొలెస్ట్రాలైతే అసలుకే ఉండదు. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పూ తగ్గుతుంది. * కూరగాయలు, పండ్లలో పీచు దండిగా ఉంటుంది. దీంతో జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. మలవిసర్జన సమస్యల వంటివి తలెత్తవు. వీటిలో నీటి శాతం ఎక్కువ. అందువల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపించి.. బరువు నియంత్రణకు దోహదం చేస్తాయి. దీంతో మధుమేహం, వూబకాయం వంటి సమస్యల ముప్పూ తగ్గుతుంది. * కూరగాయల్లో పాలీఫెనాల్స్ దండిగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు.. ఒంట్లో క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. * పొటాషియంతో నిండిన కూరగాయలు రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తాయి. వీటితో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, ఎముక క్షీణత ముప్పూ తగ్గుతుంది. * ఆకు కూరల్లోని బీటా కెరటిన్లు ఒంట్లో విటమిన్-ఎ రూపంలోకి మారతాయి. దీంతో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
|
ఒంటికే కాదు.. మనసుకు కూడా మంచిది యోగా! శరీరంలోని కణాలన్నింటికీ ఉత్తేజాన్నిస్తూ.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తూ.. శారీరక, మానసిక ఆరోగ్యాలు రెంటినీ కాపాడుతుంది. * ఆరంభంలో కఠినంగా అనిపించినా.. రోజూ యోగ సాధన చేస్తే కండరాల కదలికలు మెరుగుపడతాయి. క్రమంగా రకరకాల నొప్పులూ, బాధలూ కనుమరుగవుతాయి. * శారీరక ఆకృతి, భంగిమ చక్కబడి.. వెన్ను, మెడ నొప్పులూ తగ్గుముఖం పడతాయి. కీళ్లూ పూర్తిస్థాయిలో కదులుతాయి కాబట్టి మృదులాస్థి క్షీణత, కీళ్లు అరిగిపోటమూ తగ్గుతుంది. * యోగాసనాలతో రక్తప్రసరణ మెరుగవుతుంది. కండరాలు సాగటం, ముడుచుకోవటం వల్ల లింఫ్ నాళాల్లోనూ ద్రవ ప్రవాహం పెరుగుతుంది. ఇది రకరకాల ఇన్‌ఫెక్షన్లతో పోరాటానికి, క్యాన్సర్ కణాల నిర్మూలనకు తోడ్పడుతుంది. * యోగ సాధనతో ఏకాగ్రత కూడా సాధ్యమవుతుంది. మానసికంగా స్వస్థ భావన పెరిగి.. కుంగుబాటు వంటి మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె జబ్బుల వంటి వాటి నుంచి నివారణా సాధ్యమవుతుంది.
|
నీరు లేకపోతే జీవం లేదు. మన ఒంట్లో అత్యధిక భాగం ఉండేది నీరే. తిన్న ఆహారం సరిగా జీర్ణం కావాలన్నా, వ్యర్థాలు బయటకు విసర్జితం కావాలన్నా శరీరంలో తగినంత నీరు అవసరం. లేకపోతే తగినంత నీరు శరీరంలోని వ్యవస్థలన్నీ చతికిలపడతాయి. * మన శరీరంలో 60 శాతం నీటితో కూడిన ద్రవాలే ఉంటాయి. ఇవి ఆహారం జీర్ణం కావటానికి, పోషకాలను గ్రహించుకోవటానికి, రక్త సరఫరా సాఫీగా జరగటానికి, లాలాజలం ఉత్పత్తికి.. రకరకాలుగా తోడ్పడతాయి. తగినంత నీరు తాగితే ఈ ద్రవాలన్నీ సరైన పాళ్లలో, చక్కటి నియంత్రణలో ఉంటాయి. * నీరు బరువు తగ్గటానికీ తోడ్పడుతుంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి క్యాలరీలు ఉండవు. కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కాబట్టి కూల్‌డ్రింకుల వంటివాటి బదులు మంచినీరు తాగితే క్యాలరీలను తగ్గించుకోవచ్చు. ఇలా బరువు పెరగకుండా చూసుకోవచ్చు. * నీరు కండరాలు సరిగా, సమర్థంగా పనిచేయటానికీ తోడ్పడుతుంది. తగినంత నీరు అందకపోతే కండరాలు అలసిపోయి, వెంటనే నిస్సత్తువ ఆవరిస్తుంది. * నీరు.. చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు కనబడవు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపేస్తుంది కాబట్టి మొటిమల వంటి సమస్యలు దూరమవుతాయి. * పిక్కలు, కండరాలు, కీళ్లు పట్టేయకుండా సాఫీగా పని చేయటానికి నీరు ఎంతగానో తోడ్పడుతుంది.
|
కుటుంబంతో, సమాజంతో ఆత్మీయమైన బంధాన్ని పెంచుకోవటం ఆరోగ్యానికీ, ఆయుర్దాయానికీ చాలా మంచిది. నలుగురితో కలిసిమెలసి తిరగటం మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుంది. మనకు ఒకరు తోడుగా ఉన్నారన్న భావనే కొండత బలాన్ని అందిస్తుంది. ఇది జబ్బుల బారినపడకుండానే కాదు.. జబ్బుల నుంచి త్వరగా కోలుకోవటానికీ దోహదం చేస్తుంది. * ఒంటరితనం మనకు తెలియకుండానే మనసు, శరీరం మీద విపరీత ప్రభావాలు చూపుతుంది. నలుగురితో కలిసిమెలసి తిరిగితే రోగనిరోధకశక్తి పుంజుకుంటుంది. ఇది త్వరగా జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. * నిరాశగా, నిస్పృహగా అనిపించినపుడు స్నేహితులను కలుసుకోవటం ఎంతో ఉపశమనాన్నిస్తుంది. ఇలా నలుగురి మధ్య గడపటం వల్ల మానసికోల్లాసం వెల్లివిరుస్తుంది. కుంగుబాటు, ఆందోళన దూరమవుతాయి. * చక్కటి సామాజిక సంబంధాలు నెరపే వారికి రాత్రిపూట నిద్ర పట్టకపోవటం వంటి సమస్యలేవీ దరిజేరవు. ఇది ఇతరత్రా ఆరోగ్య ప్రయోజనాలకూ దారితీస్తుంది. * మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సన్నిహితుల తోడ్పాటు సానుకూల ప్రభావం చూపుతుంది. ఇది ఆయుర్దాయం పెరగటానికీ దారితీస్తుంది.
|
రోజంతా రకరకాల పనుల్లో కూరుకోవటం మూలంగా తలెత్తే అలసటను తొలగిస్తుంది.. రాత్రి నిద్ర! అందుకే ఉదయం హుషారుగా లేవటమేకాదు.. రోజంతా అంతే ఉత్సాహంగా ఉండేందుకు కూడా నిద్ర కీలకం. అంతేకాదు, గుండె, మెదడు వంటి కీలక అవయవాలు సరిగా పనిచేసేలా చూస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాలను పరిరక్షిస్తుంది. * నిద్ర జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. మనం రోజంతా చూసిన సంఘటనలు, నేర్చుకున్న విషయాలు.. నిద్రలోనే జ్ఞాపకాలుగా స్థిరపడతాయి! * కంటి నిండా నిద్రతో వూబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, ఆందోళన, కుంగుబాటు గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. నిద్ర మూలంగా పురుషుల్లో టెస్టోస్థిరాన్ స్థాయులు మెరుగవుతాయి. కాబట్టి నిద్ర చక్కటి శృంగారానికీ కీలకమే. * కంటి నిండా నిద్రతో ఏకాగ్రత పెరుగుతుంది. ఫలితంగా వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాల బెడద తగ్గుతుంది. చక్కటి నిద్ర వల్ల మన ఆహారపుటలవాట్లు గాడి తప్పకుండా ఉంటాయి. కంటి నిండా నిద్ర లేకపోతే- కడుపు నిండిన భావన కలిగించే ఘ్రెలిన్ అనే హార్మోన్ స్థాయులు అస్తవ్యస్తమై రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉంటాం. దానివల్ల బరువు పెరిగిపోతాం. చక్కటి నిద్రతో ఈ ఇబ్బంది తలెత్తదు.
|