నాయనమ్మ చెప్పిన వాన పాఠం!

తొలకరి చినుకులు పడాల్సిన సమయం కంటే ఆలస్యమైంది. వర్షాలు పడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. జూన్‌ ముగియవస్తున్నా.. సూర్యుడు భగభగా మండుతున్నాడు.

Updated : 10 Aug 2023 00:50 IST

తొలకరి చినుకులు పడాల్సిన సమయం కంటే ఆలస్యమైంది. వర్షాలు పడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. జూన్‌ ముగియవస్తున్నా.. సూర్యుడు భగభగా మండుతున్నాడు. దాంతో ఇంట్లో నాయనమ్మ రోజూ.. ‘వాన దేవుడా.. నువ్వే కరుణించు.. చెరువులు నిండాలి- పంటలు పండాలి’ అంటూ దండం పెట్టుకోవడం మనవరాలు కుందన, మనవడు సుముఖ్‌ విన్నారు. పూజ అయ్యాక.. ‘అదేంటి తమ్ముడూ.. నాయనమ్మ పదే పదే అదే అంటుంది. మనకు పొలాలు లేవు. వ్యవసాయ కుటుంబం కూడా కాదు. మరి వర్షం పడితే ఏంటి? పడకపోతే ఏంటి? మన నాన్న పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. ఎంత డబ్బు ఇచ్చైనా బియ్యం, కూరగాయలు కొనగలరు కదా! అలాంటప్పుడు నాయనమ్మ వానలు, పంటల గురించి ఎందుకు ఆలోచిస్తుందో నాకు అర్థం కావడం లేదు’ అని తమ్ముడితో అంది కుందన. ‘అవునక్కా.. నాకూ అర్థం కావడంలేదు.. పదా.. వెళ్లి నాయనమ్మనే అడుగుదాం..’ అన్నాడు.

అక్కాతమ్ముడు కలిసి గబగబా పరుగెత్తుకుంటూ నాయనమ్మ దగ్గరకు వెళ్లారు. ఇద్దరూ ఒకేసారి పిలవడంతో నాయనమ్మ ఉలిక్కిపడి ‘ఏంట్రా?’ అంది. ‘మరేం లేదు నాయనమ్మా.. మాకో సందేహం వచ్చింది’ అంది కుందన. అవునంటూ మాట కలిపాడు సుముఖ్‌. ‘ఏమిటి మీ సందేహం.. భయపడకుండా అడగండి’ అంది నాయనమ్మ. అప్పుడు కుందన.. ‘చాలా రోజుల నుంచి నువ్వు వానలు కురవాలని దేవుడికి దండం పెట్టడం మేం చూస్తున్నాం. వర్షాలు పడినా పడకపోయినా మనకొచ్చిన ఇబ్బందేం లేదు.. ఎందుకంటే మనకు పొలాలు లేవు కదా.. మనమెందుకు భయపడాలి? ఎంత డబ్బు ఖర్చయినా నాన్న ఇంటికి సరిపడా సరకులు తీసుకురాగలరు.. నువ్వేం దిగులు పడకు’ అంది. కుందన ఓదార్పు మాటలు విని నాయనమ్మ నవ్వుకుంది. ‘ఓహో.. మీరు నా ప్రార్థనను అలా అర్థం చేసుకున్నారా? అయితే, మీకు వివరంగా చెబుతాను.. వరండాలోకి వెళ్దాం పదండి..’ అంటూ బయటకు తీసుకెళ్లింది.

నాయనమ్మ పక్కనే బుద్ధిగా చెరోవైపు కూర్చున్నారిద్దరూ. అప్పుడు నాయనమ్మ ‘మనకు పొలాలు లేకపోయినా.. బియ్యం, కూరగాయలు కొనాలంటే అవి దొరకాలి కదా.. అవి దొరకాలంటే ముందు పండాలి కదా.. వానలు పడకపోతే పంటలు ఎలా పండుతాయి? ఒకవేళ అక్కడక్కడా దొరికినా వాటి ధరలు కొండెక్కిపోతాయి. అంత రేటు పెట్టి మధ్య తరగతి, పేద ప్రజలు కొనలేరు. అందరూ వండుకుంటేనే కదా ఆనందం. మరొక విషయం చెబుతాను వినండి.. పంటల మీద ఆధారపడి మనుషులే కాదు, ఎన్నో రకాల ప్రాణులు బతుకుతున్నాయి’ అని వివరించింది. ‘ప్రాణులంటే..?’ సందేహం వెలిబుచ్చాడు సుముఖ్‌. ‘పక్షులు, పశువులు, ఎలుకలు, చీమలు, కుక్కలు, పిల్లులు ఇలా ఎన్నో రకాల ప్రాణులు మన చుట్టూ ఉంటాయి. పంటలు పండకపోతే ఆకలితో అవన్నీ విలవిల్లాడిపోతాయి’ అని చెప్పింది నాయనమ్మ. ‘అదెలా..?’ అని అక్కాతమ్ముడు మరో సందేహం అడిగారు.

అప్పుడు నాయనమ్మ.. ‘మీరు చిన్న పిల్లలు కాబట్టి కేవలం మన ఇంటి పరిస్థితినే తీసుకుంటున్నారు. మీ స్నేహితులు, వాళ్ల ఇళ్లలో పరిస్థితి, పనివాళ్ల గురించి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టు చెబుతాను.. వినండి.. పిచ్చుకల్లాంటి పక్షులు పొలాల్లో పంటలు పండినప్పుడు ఆ గింజలు, వాటి కోసం వచ్చే చిన్న చిన్న పురుగులను ఏరుకుని తిని కడుపు నింపుకొంటాయి. అదే పంటలు పండకపోతే గింజలు ఉండవు.. పురుగులు అసలే దొరకవు.. దాంతో వాటి ఆకలి తీరదు. ధాన్యం పండకపోతే పశువులకు గడ్డి, తవుడు కొరత వస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే.. వర్షాలు కురవకపోతే, వ్యవసాయం లేకపోతే.. ఆ రంగంపైన ఆధారపడిన కొన్ని వేల కూలీల కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రజల వద్ద డబ్బు లేనప్పుడు, ఊళ్లో కిరాణా దుకాణాల దగ్గర్నుంచి పట్టణాల్లోని వస్త్ర, బంగారు తదితర వ్యాపారాలు ఎలా నడుస్తాయి? ఇవన్నీ పండే పంటల మీదే ఆధారపడి జరుగుతాయి. అలాంటి కష్టాలు రాకూడదనే నేను వర్షాలు పడాలని రోజూ దండం పెట్టుకుంటున్నా. చెరువులు నిండితేనే.. పంటలు పండుతాయి. అన్ని జీవుల కడుపులు నిండితేనే భూమాతకు పరమానందం’ అని వివరంగా చెప్పింది నాయనమ్మ.

‘వర్షాలు పడకపోతే ఇన్ని కష్టాలుంటాయని మా చిన్ని బుర్రలకు ఇప్పుడే అర్థమైంది. నువ్వు మా మంచి నాయనమ్మవు. అందరి బాగు కోరుతున్నావు’ అన్నారా అక్కాతమ్ముడు. వెంటనే దేవుడి పటం దగ్గరికెళ్లి ‘చెరువులు నిండాలి- పంటలు పండాలి’ అని దండం పెట్టుకోసాగారు. ఆ పిల్లలను దగ్గరకు తీసుకుని మురిసిపోయింది నాయనమ్మ.

బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని