ఉత్తమ విద్యార్థి!

పక్కపక్కనే ఉన్న మూడు రాజ్యాల రాకుమారులు సుధీరుడు, మాధవుడు, విద్యాధరుడు. వీరందరూ దాదాపు ఒకే వయసు వారు.

Updated : 25 Aug 2023 04:43 IST

క్కపక్కనే ఉన్న మూడు రాజ్యాల రాకుమారులు సుధీరుడు, మాధవుడు, విద్యాధరుడు. వీరందరూ దాదాపు ఒకే వయసు వారు. ఒకే గురుకులంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. రాకుమారులు చదువులో పోటీపడే తీరు గురువుకు బాగా నచ్చడంతో, వారిని మరింత ప్రోత్సహించసాగారు. అప్పుడప్పుడు గురుకులానికి వచ్చే వారి తల్లిదండ్రులు కూడా కొడుకుల తెలివితేటలు చూసి అబ్బురపడేవారు. ఒకరోజు ముగ్గురూ గురువును కలిసి.. ‘మా ముగ్గురిలో మొదటిస్థానం ఎవరిదో తెలుసుకోవాలని ఉంది’ అని అడిగారు. ‘చదువులో మీ ముగ్గురుది ఒకే స్థాయి’ అని సర్దిచెప్పాడు గురువు. ‘అలా కాదు గురువు గారూ.. అన్ని విషయాలు పరిశీలించి ఎవరో ఒకరి పేరే చెప్పాలి’ అంటూ సుధీరుడు, మాధవుడు మరోసారి అడిగారు.

‘ఈ సంవత్సరాంతానికి మీ చదువులు పూర్తవుతాయి. అప్పుడు మీకు ఓ మంత్రాన్ని చెబుతాను. అది చదివి మీ కోరిక నెరవేర్చుకోవచ్చు. దాన్నిబట్టి మీ స్థాయిని అంచనా వేసుకోండి’ అంటూ హామీ ఇచ్చాడు గురువు. చూస్తుండగానే వారి చదువు ముగిసింది. ఆ ముగ్గురు శిష్యులనూ గురువు పిలిచి.. ‘నా మాట ప్రకారం మీకు మంత్రోపదేశం చేసే సమయం ఆసన్నమైంది. ఒకసారి మాత్రమే దాన్ని ఉపయోగించగలరు. మంత్రం ప్రయోగించాక.. దాని ఫలితం నచ్చకపోతే, నా దగ్గరకు వస్తే విరుగుడు మంత్రం చెబుతాను. మీలో ఎవరైతే నా దగ్గరకు రాకుండా ఉంటారో వాళ్లే ఉత్తములు’ అంటూ మంత్రాన్ని ఉపదేశించాడు గురువు.

ఆ ముగ్గురూ వారి వారి రాజ్య బాధ్యతలను చేపట్టారు. కొద్దిరోజులకే వాతావరణంలో మార్పుల కారణంగా మూడు రాజ్యాల్లో కరవు వచ్చింది. దాంతో గురువు చెప్పిన మంత్రం సాయంతో ప్రజల కష్టాలు తీర్చాలని అనుకున్నారా ముగ్గురు. ముందుగా సుధీరుడు మంత్రశక్తితో అక్షయపాత్రను పొందాడు. ఆ రోజు నుంచి ప్రజలకు నిత్యాన్నదానం చేయసాగారు. ఆ తర్వాత మాధవుడు బాగా ఆలోచించి.. ప్రతి పది రోజులకోసారి ఆహారధాన్యాల వర్షం కురవాలని కోరుతూ మంత్రాన్ని జపించాడు. చివరగా విద్యాధరుడు కూడా మంత్రశక్తితో ఒక వరాన్ని కోరుకున్నాడు. ఆ కోరిక విన్న ఆ రాజ్య ప్రజలు పెదవి విరిచారు. ఇరుగు పొరుగు రాజ్య ప్రజలతోపాటు రాకుమారులు కూడా విద్యాధరుడి కోరిక విని తెలివితక్కువ వాడిగా చూశారు.

అలా రోజులు గడుస్తున్నాయి. అక్షయపాత్ర పుణ్యమా అని సుధీరుడి రాజ్య ప్రజలకు ఆకలి బాధలు తప్పాయి. ఏ కష్టం లేకుండా తిండి దొరుకుతుండటంతో వారంతా సోమరులుగా మారారు. ఒక్కరూ పనికెళ్లేవారు కాదు. శారీరక శ్రమ లేకపోవడంతో కొద్దిరోజులకు ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. వారికి వైద్యసేవలు అందించలేక సుధీరుడు, అతని పరివారం తలలు పట్టుకున్నారు. సుధీరుడి ఇబ్బందులు చూసి మాధవుడు, తానే కాస్త నయమనుకున్నాడు. ఆహార ధాన్యాల వర్షంతో అక్కడి ప్రజలకు కొంత ఉపశమనం దొరికింది. పని చేయడమూ బాగా తగ్గింది. కొందరు ఈ ఆహార ధాన్యాలను విద్యాధరుడి రాజ్యానికి తీసుకెళ్లి వ్యాపారం చేయసాగారు. ఇది మాధవుడికి కొంతమేర సంతృప్తినిచ్చింది.

రోజులు గడుస్తున్న కొద్దీ విద్యాధరుడి రాజ్యంలో పంటలు బాగా పండాయి. దాంతో మాధవుడి రాజ్య వ్యాపారుల లావాదేవీలు నిలిచిపోయాయి. దాంతో ఆ ప్రాంతంలోనూ అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పుడు తన వంతు వచ్చిందని వాపోయాడు. ఈ పరిణామాలతో కలత చెందిన మాధవుడు, సుధీరుడు.. గురువు దగ్గరికి వెళ్లి విరుగుడు మంత్రం అడగాలని అనుకున్నారు. అదే జరిగితే.. ప్రజలు తిండి దొరక్క అల్లాడిపోతారేమోనని భయపడ్డారు. ఏం చేయాలో తోచక.. ఇద్దరూ కలిసి విద్యాధరుడి దగ్గరకు వెళ్లారు. ‘మిత్రమా.. నువ్వు తెలివితక్కువగా మంత్రాన్ని ఉపయోగించావనుకున్నాం. కానీ, మాదే అసలైన మూర్ఖత్వమని, ప్రస్తుత మా రాజ్య పరిస్థితులు రుజువు చేశాయి. గురువు గారి దగ్గరకు వెళ్లి విరుగుడు మంత్రం తెలుసుకుందామని అనుకుంటున్నాం. ఆ తరువాత నీ సాయంతో మా ప్రాంతాలను సస్యశ్యామలం చేసుకుంటాం. అందుకు నీ సాయం కావాలి’ అంటూ మిత్రుడిని ఆలింగనం చేసుకున్నారిద్దరూ.

నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చాడు విద్యాధరుడు. అక్కడి నుంచి బయలుదేరి, గురువును కలిసి విరుగుడు మంత్రం ద్వారా తమ మంత్రమహిమను కోల్పోయారు. కరవు పరిస్థితుల నుంచి బయటపడేందుకు తన రాజ్యం నుంచి నీరు తీసుకెళ్లేందుకు విద్యాధరుడు అనుమతి ఇచ్చాడు. కరవుతో అల్లాడుతున్న ప్రజలు కాలువలు తవ్వేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కొద్ది రోజులకు ఆ రెండు రాజ్యాల్లోని చెరువులు, కుంటలు నిండటంతో సాగుకు మార్గం సుగమమైంది. అవసరమైనప్పుడల్లా రాజ్యంలో వర్షాలు కురవాలన్న విద్యాధరుడి కోరిక.. ఇప్పుడు మిత్రుల రాజ్యాల ప్రజలకూ వరంగా మారింది. ‘మనలో ఉత్తమ విద్యార్థి నువ్వే’ అంటూ విద్యాధరుడిని స్నేహితులు సుధీరుడు, మాధవుడు అభినందించారు. ‘మన మధ్య ఉండాల్సింది సహాయ సహకారాలు మాత్రమే.. ఇక నుంచైనా కరవు పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్తపడదాం’ అంటూ మిత్రులను ఆలింగనం చేసుకున్నాడు విద్యాధరుడు.

బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు