‘అహంకారంతో హేళన చేయను!’

వంశీ, కీర్తి తమ అమ్మానాన్నలతో బీచ్‌కు వచ్చారు. సముద్ర కెరటాలను చూస్తూ ఆడుకుంటున్నారు. వారి కోసం అమ్మ ముందు రోజు తయారు చేసిన చేగోడీలు, పెద్ద మంచినీళ్ల సీసా కూడా తెచ్చింది. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత.. ‘అమ్మా!’ అంటూ పిల్లలిద్దరూ అమ్మ దగ్గరకు చేరారు.

Updated : 04 Sep 2023 06:24 IST

వంశీ, కీర్తి తమ అమ్మానాన్నలతో బీచ్‌కు వచ్చారు. సముద్ర కెరటాలను చూస్తూ ఆడుకుంటున్నారు. వారి కోసం అమ్మ ముందు రోజు తయారు చేసిన చేగోడీలు, పెద్ద మంచినీళ్ల సీసా కూడా తెచ్చింది. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత.. ‘అమ్మా!’ అంటూ పిల్లలిద్దరూ అమ్మ దగ్గరకు చేరారు. ‘అర్థమైంది, ఇవిగో చేగోడీలు’ అంటూ నవ్వుతూ ఇద్దరికీ అందించింది. అవి తింటూ కబుర్లు చెప్పుకొంటున్నారు పిల్లలు.

ఇంతలో దాహం వేయడంతో, సీసాలోని మంచినీళ్లు గ్లాసుల్లో ఒంపుకోసాగారు. అదే సమయంలో ఓ పెద్ద సముద్ర కెరటం పరుగులు తీస్తూ ముందుకొచ్చింది. దాన్ని చూసి సీసాలోని నీరు ఎగతాళిగా నవ్వింది. సముద్రానికి కోపం వచ్చింది.

‘ఎందుకు నవ్వుతున్నావ్‌?’ అని అడిగింది అది. సీసాలో నీరు మళ్లీ నవ్వుతూ.. ‘నువ్వెంత ఉరికొచ్చినా నీ వల్ల ఉపయోగం లేదు. మనిషితో సహా సకల ప్రాణులకు దాహం తీర్చేది నేనే. మనిషి.. నీ మీదే ప్రయాణిస్తున్నా, గుక్కెడు మంచి నీళ్లు విడిగా తెచ్చుకోవాల్సిందే. నది నీరే మంచి, తీయని నీరు. నువ్వు ఉప్పు కషాయానివి, పుణ్యం కోసం పర్వదినాల్లో నీ నీళ్లలో స్నానం చేస్తారు. కానీ నిజానికి నీ నీళ్లు స్నానానికి కాదు కదా! దుస్తులు ఉతకడానికి కూడా పనికి రావు’ అంది.

అది విని, సముద్రం మరింత కోపంగా... ‘అంతగా విరగబడి నవ్వకు, మంచినీళ్లు ప్రాణులకు అవసరమే కానీ, నా అవసరమూ ఉంది. ఎన్నో రకాల, అసంఖ్యాక జీవులు నాలోనే నివసిస్తున్నాయని తెలుసుకో. మా నీటిని ఉప్పన అని తీసిపారేశావు కానీ, మనిషి ఉప్పు లేనిదే బతకలేడు. ఉప్పు నా వల్లే తయారవుతోంది’ అంది సముద్రం.  

మంచినీటికి ఏమనాలో తెలియలేదు. అంతలో వంశీ.. ‘సముద్రంలో ఇన్ని నీళ్లున్నా..., ఉప్పు నీళ్లతో ఏం ఉపయోగం, సముద్రం వల్ల ఏం లాభం లేదు కదా నాన్నా?’ అన్నాడు వంశీ. ‘ఎందుకు లేదు? ఎంచక్కా ఓడలు ఎక్కొచ్చు కదా..’ వెంటనే అంది కీర్తి. నాన్న నవ్వి.. ‘ఓడలు, ప్రయాణాల మాట అలా ఉంచి, సముద్ర నీటితో ఉపయోగం లేదనడం పొరపాటు. దాన్నుంచే కదా ఉప్పు తయారు చేసేది. ఉప్పు లేకుండా నువ్వు కూర, పప్పు, పచ్చడి, ఇంకా పిండివంటలు తినగలవా? ప్రకృతిలో ఆరు రకాల రుచులున్నా, ఉప్పు ప్రత్యేకతే వేరు. అయినా ఉప్పు నీటిని కూడా మంచి నీటిగా మార్చే ప్రయత్నాలు మనిషి చేస్తున్నాడు. అన్నట్లు ఎందరో మత్స్యకారులు సముద్రంలోని చేపలు పట్టే బతుకులు వెళ్లదీస్తున్నారు. మాంసాహారంలో చేపలు గణనీయ పాత్ర పోషిస్తున్నాయి. సముద్ర ఉత్పత్తులతో ఎంతో ఆదాయం లభిస్తోంది కూడా’ అన్నాడు నాన్న.

సముద్రం, మంచినీటి వంక.. ‘విన్నావా?’ అన్నట్లు చూసింది. మంచినీరు విన్నానంటుండగానే, ‘వంశీ! నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. భారత స్వాతంత్యోద్య్రమ చరిత్రలో గాంధీగారు చేసిన ఉప్పు సత్యాగ్రహం ఓ కీలక ఘట్టం. దాన్నే ‘దండి యాత్ర’ అని కూడా అంటారు. బ్రిటీష్‌ వారు, ప్రజలందరికీ అవసరమైన ఉప్పు మీద పన్ను వేశారని ప్రజలు ఆగ్రహించి పోరాటం చేశారు’ అని చెప్పాడు.

‘అవును నాన్నా... మా పాఠంలో కూడా ఉంది’ అని వంశీ అంటుంటే, సముద్రం సంతోషంతో ఉవ్వెత్తున అలలై లేచింది. మంచినీరు ఆశ్చర్యంగా చూస్తుండగా, ‘ఇంకో సంగతి తెలుసా? వాతావరణంపై కూడా సముద్ర ప్రభావం ఎంతగానో ఉంటుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల వర్షం కురుస్తుందని వాతావరణ హెచ్చరికలు వింటుంటాం కదా’ అన్నాడు నాన్న. ‘అవునవును’ అన్నారు పిల్లలు.

‘మరో విషయం, చివరకు నదులన్నీ కలిసేది సముద్రంలోనే’ అన్నాడు నాన్న. ‘అలాగా..’ అని వంశీ అంటుంటే,  ‘తెలుసుకో...’ అన్నట్లు సముద్రం, మంచినీటి వంక చూసింది. అంతలో ‘చేగోడీలు బాగున్నాయా? నిన్న హడావుడిగా చేశాను’ అని అడిగింది అమ్మ. ‘ఉప్పు కొంచెం తక్కువయింది అమ్మా!’ పిల్లలిద్దరూ ఒకేసారి అన్నారు. ‘అలాగా.. పోనీలే, ఉప్పు కొద్దిగా తక్కువైతే తినవచ్చు కానీ ఎక్కువైతే కష్టం’ అంది అమ్మ.

‘విన్నావా?’ అన్నట్లు చూసింది సముద్రం, మంచినీటి వైపు. ‘అమ్మో! ఉప్పుతో జాగ్రత్తగా ఉండాలన్నమాట’ అని అంది మంచినీరు. కాసేపటి తర్వాత... ‘నీ ప్రత్యేకత అర్థమైంది. ఇంకెప్పుడూ నిన్ను హేళన చేయను. నిన్నే కాదు, అహంకారంతో ఎవ్వరినీ హేళన చేయను. మనం ఇక నుంచి మిత్రులం’ అంది మంచి నీరు. ‘అలాగే నేస్తం’ అంది సముద్రం. ‘పిల్లలూ! ఇంక ఇంటికి వెళదాం పదండి’ అన్నారు అమ్మానాన్న. వెంటనే వంశీ మంచినీటి సీసా పట్టుకుని లేచాడు. ‘వస్తా మిత్రమా!’ అని మంచినీరు, సముద్రానికి వీడ్కోలు చెప్పింది. ‘మంచిది మిత్రమా!’ అని ఆత్మీయంగా అంది సముద్రం. పిల్లలిద్దరూ, సముద్రానికి టాటా చెప్పారు. సముద్రం సంతోషంతో ఎగిసిపడింది.
జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు