దెబ్బకు ఠా.. నక్క, తోడేలు ముఠా!

వర్షాలు అధికంగా కురవడంతో అడవి మొత్తం పచ్చదనం సంతరించుకుంది. శాకాహార జంతువుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తిండికి తిండి, శత్రువుల కంట పడకుండా దాక్కొనేందుకు గుబురు పొదలు వాటికి కలిసొచ్చాయి.

Updated : 27 Sep 2023 06:56 IST

ర్షాలు అధికంగా కురవడంతో అడవి మొత్తం పచ్చదనం సంతరించుకుంది. శాకాహార జంతువుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తిండికి తిండి, శత్రువుల కంట పడకుండా దాక్కొనేందుకు గుబురు పొదలు వాటికి కలిసొచ్చాయి. వానాకాలం మొత్తం హాయిగా బతకొచ్చని కుందేళ్లు మరింత సంతోషించాయి. కానీ, జిత్తులమారి నక్కకు మాత్రం వేట కష్టమైపోయింది. కుందేళ్లు పొదల్లో దాక్కుంటూ తప్పించుకుంటున్నాయని దిగులుపడింది. వాటిని తొలగిస్తేనే, కుందేళ్లను వేటాడటం సాధ్యమని అనుకుంది. అందుకు అడవిలో ఉన్న ఇతర శాకాహార జంతువుల సాయం తీసుకుందామంటే, తనను ఏవీ నమ్మవని నక్కకు తెలుసు. సమీపంలోనే ఉన్న గ్రామానికి వెళ్లి, తన తెలివిని ఉపయోగించి గడ్డి తినే బలమైన జంతువును కలవాలనుకుంది.

అనుకున్నదే ఆలస్యం.. నిమిషాల్లో ఊరిబాట పట్టింది. ఆ గ్రామ శివారులో గడ్డి మేస్తున్న ఓ జంతువు దానికి కనిపించింది. హమ్మయ్యా.. అనుకుంది. రెప్పపాటులో ‘మిత్రమా’ అంటూ దాని దగ్గరకు వెళ్లింది. నక్కను ఎప్పుడూ చూడకపోవడంతో, ఎగాదిగా చూసిందా జంతువు. ‘నేను అడవి జంతువుని. మృగరాజు పంపిస్తే వచ్చాను. మా ప్రభువుకు నమ్మినబంటుని’ అంటూ గొప్పగా పరిచయం చేసుకుంది నక్క. ‘ఎందుకు?’ అన్నట్టు చూసిందా జంతువు. ‘అడవిలో ఉండాల్సిన జంతువులను... మానవులు మచ్చిక పేరుతో పెంపుడు జీవులుగా మార్చారు. అది మా మృగరాజుకి నచ్చలేదు. జంతుజాతి అంతా ఒక్కటిగా ఉండాలన్నదే సింహం ఉద్దేశం. అందుకే, జంతువులన్నింటినీ ఒక దగ్గరకు చేరుస్తుంది. మీకోసం అడవిలో గడ్డిని కూడా పెంచుతుంది. మన ఐక్యత వర్ధిల్లాలి’ అని అబద్ధాన్ని అందంగా చెప్పిందా నక్క.

‘నిజమా?’ అంటూ నోరెళ్లబెట్టింది ఆ జంతువు. ‘నిజమే.. మన జంతు జాతి బలంగా ఉండాలన్నది మా మృగరాజు కోరిక.. అడవికి వెళ్దాం పద’ అంటూ తొందరపెట్టింది నక్క. ఆ జంతువు కూడా ఆలోచనలో పడింది. బరువులు మోయడం, పనులు చేయడం కంటే, మృగరాజు కోరిక మేరకు అడవిలో బతకడమే మంచిదని అనుకుంది. నక్కతోపాటు ఆ జంతువూ అడవిలోకి అడుగుపెట్టింది. నక్క ఆ జంతువును నేరుగా కుందేళ్లున్న పొదల దగ్గరకు తీసుకువెళ్లింది. ‘ఈ పొదలను చీల్చుకొని లోపలికి వెళ్తే బోలెడంత గడ్డి దొరుకుతుంది. మృగరాజు మాటను గౌరవించిన నిన్ను పరిచయం చేయడానికి, ఆ సింహాన్నే ఇక్కడకు పిలుచుకొని వస్తాను’ అని చెప్పి వెళ్లిపోయింది నక్క.

పదునైన దంతాలతో ఆ జంతువు పొదలను చీల్చే పనిలో మునిగిపోయింది. ఆ శబ్దానికి కుందేలొకటి కంగారుగా బయటకు వచ్చి ‘మా రక్షణ కోటను పాడుచేస్తున్నదెవరు?’ అని అడిగింది. ‘మృగరాజు పిలుపు మేరకు గడ్డి తినడానికి వచ్చిన పెంపుడు జంతువును’ అని సమాధానమిచ్చిందది. ‘మృగరాజు నిన్ను పిలవడమేంటి? ఇంతకీ అలా చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిందెవరు?’ అని తెలివిగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేసిందా కుందేలు. ‘మృగరాజు నమ్మినబంటునని పరిచయం చేసుకుంది. నేరుగా సింహాన్నే ఇక్కడికి తీసుకొచ్చేందుకు వెళ్లింది’ అని చెప్పిందా జంతువు. ‘మృగరాజుని గతంలో ఎప్పుడైనా చూశావా?’ అని అడిగింది కుందేలు. ‘ఇంతవరకు చూడలేదు. మృగరాజు నాలా ఉంటుందా?’ అని అమాయకంగా అడిగిందా జంతువు.

‘నీ అమాయకత్వానికి నవ్వొస్తుంది. నీలా, నాలా ఉంటే అది మృగరాజు కాదు. భారీగా, ఎత్తుగా, జూలు కలిగిన బలమైన జంతువు. ఇందులో ఏదో మోసం దాగి ఉంది. నీతో పొదలను నాశనం చేయించి, మమ్మల్ని వేటాడే ఉద్దేశం ఒకటైతే, మాయ మాటలతో నిన్ను చంపి తినేందుకు వేసిన ఎత్తు మరొకటై ఉంటుంది. ఇప్పటికైనా నిన్ను నువ్వు కాపాడుకోడానికి సిద్ధపడు’ అంటూ లోపలికి పారిపోయింది కుందేలు. అపరిచితుల మాటలను నమ్మరాదనీ, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనీ దానికి అప్పుడు అర్థమైంది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే కాబోలు.. ఇప్పటికైనా తెలివిగా తప్పించుకోవడమే శరణ్యం’ అని మనసులోనే అనుకొని వెనక్కు వెళ్లబోయిందా జంతువు. ఇంతలో నక్క, తోడేలును వెంటబెట్టుకుని అక్కడకు వచ్చింది.

‘ఇదిగో మృగరాజు.. నిన్ను ప్రశంసించడానికే వచ్చింది’ అంటూ తోడేలును చూపించింది. కుందేలు చెప్పిన ఆకారం తోడేలులో కనిపించకపోవడంతో ఆ జంతువు అవాక్కయింది. కుందేలు చెప్పినట్టు నక్క తనను మోసగిస్తున్నట్టు నిర్ధారణ చేసుకుంది. ‘నేను చెప్పినట్టు ఇక్కడకు వచ్చి మన జంతుజాతి అంతా ఒక్కటేనని నిరూపించినందుకు నిన్ను ప్రశంసిస్తున్నాను’ అంది తోడేలు. ‘మీరు చెప్పినట్లు వచ్చాను. పొదలు తొలుచుకుంటూ వెళ్తుంటే, వెనక కాలికి ముళ్లు గుచ్చుకుంది. ఆ బాధ భరించలేకపోతున్నాను’ అంటూ కాలిని కొద్దిగా ఎత్తి పెట్టిందా జంతువు. ‘నిజమా.. మా పని సులువైంది’ అని అవి లొట్టలేసుకుంటూ ఆ జంతువు వెనకకు వెళ్లి ఎత్తిన కాలిని లాగేందుకు సిద్ధపడ్డాయి.

ఇదే అదునుగా అది దాని రెండు కాళ్లు ఎత్తి, ఆ రెండు జంతువులను ఒకేసారి తన్నింది. ఆ దెబ్బకు రెండూ ఎగిరి అంతదూరాన పడ్డాయి. వెనక కాలి దెబ్బంటే గాడిదదేనని మా అమ్మమ్మ చెబుతుండేది. అనవసరంగా దీనితో పెట్టుకున్నాం’ అని మూలుగుతూ అంది తోడేలు. ‘గడ్డి తినే జంతువుకి అంత శక్తి ఉండదనుకున్నాను. గాడిదని తెలిస్తే దాని జోలికి వెళ్లకపోయేదాన్ని’ అంటూ స్వరం కలిపింది నక్క. కుందేలు మాట సాయానికి కృతజ్ఞతలు చెప్పుకొంటూ.. ఇక ఏమాత్రం ఆగకుండా గ్రామం వైపు పరుగు పెట్టిందా గాడిద.

బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని