రాజుగారి చేపల వేట!

అవంతీపురాన్ని గుప్తుడు పాలించేవాడు. అతని మంత్రి సుశర్మ. కోశాగారంలో ధనం తగ్గుతోందని చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వృత్తుల వారి పైన పన్నుల భారాన్ని పెంచాడు రాజు.

Published : 05 Oct 2023 00:08 IST

అవంతీపురాన్ని గుప్తుడు పాలించేవాడు. అతని మంత్రి సుశర్మ. కోశాగారంలో ధనం తగ్గుతోందని చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వృత్తుల వారి పైన పన్నుల భారాన్ని పెంచాడు రాజు. పాలన బాగోలేదని ప్రజలు చెవులు కొరుక్కోసాగారు. ఆ వార్తను వేగులు రాజుకు చేరవేశారు. రాజు, మంత్రి స్వయంగా విషయాలు తెలుసుకోవడానికి మారువేషాల్లో గ్రామాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు.
ఒకరోజు సీతాపురం చేరుకుని, గుర్రాలను చెట్ల మాటున కట్టేశారు. తర్వాత ఒక చిన్న చెరువు వద్ద చేపలు పడుతున్న వ్యక్తి వద్దకు వెళ్లారు. అతణ్ని.. ‘నీ పేరేంటి?’ అని అడిగాడు రాజు. ‘అయ్యా! నా పేరు రామయ్య. ఇంతకూ మీరెవరు? ఎక్కడ నుంచి వస్తున్నారు?’ అన్నాడు ఆ వ్యక్తి. ‘మేము పొరుగూరు నుంచి వస్తున్నాం’ బదులిచ్చాడు మంత్రి. ‘నాకు కూడా సరదాగా చేపలు పట్టాలని ఉంది. నీ దగ్గర చేపలు పట్టే ఇంకో గేలం ఉంది కదా నాకిస్తావా? ధర చెల్లిస్తాను’ అన్నాడు రాజు.

‘ధర అవసరం లేదు. మీరు చేపలు పట్టిన తరువాత గేలాన్ని నాకు ఇచ్చి వెళ్లండి. అన్నట్లు మీరు కొత్తవారైనా సరే... చేపలు పట్టాలంటే గ్రామాధికారి అనుమతి తీసుకోవాలి’ అన్నాడు రామయ్య. ‘అదంతా మేం చూసుకుంటాం. గ్రామాధికారి మాకు తెలిసినవాడే’ అన్నాడు మంత్రి. ‘అయితే ఆ వైపు వెళ్లండి. పెద్ద చెరువు ఉంది. పడవలో వెళ్లి, వల వేసి చేపలు పట్టవచ్చు. అద్దెకు పడవ, వల ఇస్తారు’ అన్నాడు రామయ్య.  

‘ఇక్కడే కాసేపు ఉండి తరువాత అటు వైపు వెళతాం. అన్నట్టు నీ దుస్తులు మరీ చిరుగులతో ఉన్నాయి. మంచివి లేవా?’ అన్నాడు రాజు. ‘ఏం చెప్పమంటారయ్యా! నాలుగు పెద్ద చేపలు పట్టి వాటిని సంతలో అమ్మితే, సగం ధనం పన్ను కట్టడానికి.. మిగతాది కుటుంబ పోషణకు అరకొరగా సరిపోతోంది. ఇక మంచి దుస్తులు వేసుకునే పరిస్థితి మాకెక్కడిది!’ అన్నాడు రామయ్య. ‘అటు పక్కగా పెద్ద చెరువులు ఉన్నాయన్నావు... మరి అక్కడ ఎక్కువ చేపలు పట్టొచ్చు కదా?’ అన్నాడు మంత్రి. ‘పెద్ద చెరువుకు ఎక్కువ పన్ను కట్టాలి. అందుకే ఈ చిన్న చెరువుతోనే తృప్తి పడుతున్నాను. రాజు గారు కొంత పన్ను వేస్తే, వసూలు చేసే అధికారులు మరింత జోడిస్తున్నారు. మా ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ప్రతి మాసం పన్ను కట్టమనడం మరీ విడ్డూరంగా ఉంది. అవ్వ తీసిన గంధం తాత పిలకకు సరిపోయినట్టు ఉంది మా బతుకు’ అన్నాడు రామయ్య. ‘మహారాజు దగ్గరకు వెళ్లి మొర పెట్టుకోవచ్చు కదా?’ అన్నాడు మంత్రి. ‘ఒక్క నిమిషం..’ అని నీటిలోని గేలాన్ని పైకి లాగి దానికి చిక్కుకున్న ఒక పెద్ద చేపను తీసి బుట్టలో పెట్టి, మూత మూసి మళ్లీ గేలాన్ని నీటిలోకి వేశాడు రామయ్య. ‘అయ్యా! మాలాంటి వారిని కోటలోకి అడుగు పెట్టనిస్తారా? అందరికీ అన్నం పెట్టే రైతన్నకు వందనం! వ్యవసాయం చేసే వారికి పన్ను మినహాయింపు ఇవ్వడం మంచి పద్ధతే. కానీ, మాలాంటి మత్స్యకారులతో సహా ఇతర చిన్న, చిన్న వృత్తుల్లో ఉన్న వారికి కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని మహారాజుకు తెలియక పోవడం చాలా బాధాకరమైన విషయం!’ అన్నాడు రామయ్య.

ఈ మాటలతో రాజుకు జ్ఞానోదయమైంది. ‘రామయ్యా! నీ కష్టసుఖాలు తెలుసుకున్నాం. వెళ్లి వస్తాం’ అని గేలాన్ని తిరిగి ఇచ్చాడు రాజు. ‘ఒక్క చేప కూడా పట్టకుండానే వెళుతున్నారే?’ అన్నాడు రామయ్య. ‘మాకు వేరే పని ఉంది’ అని సమాధానం ఇచ్చాడు రాజు. అక్కడ నుంచి బయలుదేరుతుండగా... ‘మహారాజా! చేపల వేటకు పెద్ద చెరువు వైపు వెళదామా?’ అన్నాడు మంత్రి. ‘ఎక్కడకూ వద్దు. నేరుగా కోటకు వెళదాం పద’ అన్నాడు రాజు.

మరుసటి రోజు, రామయ్యను కోటకు రమ్మని రాజు కబురుపెట్టాడు. రామయ్య తెలిసిన వారి నుంచి కాస్త మంచి దుస్తులు తీసుకుని, వాటిని ధరించి కోటకు చేరుకున్నాడు. రాజు సభలో కొలువుదీరి ఉన్నాడు. ‘వందనం మహారాజా!’ అని చేతులు జోడించి... ‘నన్ను పిలిపించిన కారణం?’ అన్నాడు రామయ్య. ‘నువ్వు ముందుగా ఆసనం మీద కూర్చో’ అన్నాడు రాజు. ‘నిన్న మారువేషంలో వచ్చి నిన్ను కలిసింది నేను, రాజు గారే’ అన్నాడు మంత్రి.

‘మహారాజా! తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి’ అన్నాడు రామయ్య. ‘లేదు రామయ్యా! నా కళ్లు తెరిపించావు. ఇక మీదట చిన్న వృత్తుల వారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తున్నాను. అంతే కాదు.. ఇంతకు ముందు మీలాంటి వారి వద్ద పన్ను రూపంలో వసూలు చేసిన సొమ్మును మొత్తం తిరిగి ఇచ్చేస్తున్నాను’ అన్నాడు మహారాజు. ‘చాలా సంతోషం మహారాజా!’ అన్నాడు రామయ్య. ‘సభికులందరికీ ఒక విన్నపం, మన ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలో తగిన సూచనలు చేయండి’ అన్నాడు రాజు.
‘పెద్ద వ్యాపారుల నుంచి వారి లాభాలను బట్టి పన్నులు విధించడం ఒక మార్గం’ అని ఒకరు చెప్పారు. రాజు రామయ్య వైపు చూశాడు ‘చిన్న వృత్తుల వారికి పూర్తిగా అవసరమైన సాధనాలను కొనుగోలు చేయడానికి వడ్డీ లేని రుణాలు ఇప్పించండి. వారు తయారు చేసిన వస్తువులను గిట్టుబాటు ధరతో మీరే కొనుగోలు చేసి, చుట్టు పక్కల రాజ్యాలతో ఒప్పందం చేసుకోండి. నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించి, వాటిని అమ్మే ఏర్పాట్లు చేయాలి’ అన్నాడు రామయ్య.

‘కొన్ని గ్రామాల్లో మంచి నేలలు ఉన్నాయి. అవి పూలు, పండ్లు పండించడానికి ఎంతో అనువుగా ఉంటాయి. మొక్కలను నాటి, రాబోయే రోజుల్లో వాటి ఉత్పత్తులను కూడా పొరుగు రాజ్యాల్లో అమ్మవచ్చు’ అని ఇంకొకరు సూచించారు. రాజు అందరికీ ధన్యవాదాలు తెలిపి, అన్నింటికీ ఆమోద ముద్ర వేశాడు. తరువాత మంత్రితో చెప్పి, రామయ్యకు కొత్తవస్త్రాలు ఇవ్వమన్నాడు.
‘మహారాజా! పన్ను మినహాయింపు ఇచ్చారు. నాకు అవసరమైన సాధనాలూ రాబోతున్నాయి. నా సంపాదనతోనే కొత్త వస్త్రాలు కొనుగోలు చేస్తాను. వెళ్లి వస్తాను...’ అని వందనం చేసి సభ నుంచి రామయ్య సెలవు తీసుకున్నాడు.                                    
యు.విజయశేఖరరెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు