మరపు పోయి.. మతాబుల మెరుపొచ్చె..!

‘నాన్నా.. ఈరోజే దీపావళి పండుగ’ అని వరండాలో కూర్చున్న తండ్రితో అన్నాడు నితిన్‌. ‘సరే.. నీకేం కావాలో చెప్పు?’ నవ్వుతూ అడిగారాయన. ‘భారీ శబ్దాలు రాని.. మతాబులు, కాకర పువ్వొత్తులు, భూచక్రాలు కావాలి..’ అంటూ తనకిష్టమైన వాటి పేర్లన్నీ చెప్పాడు.

Updated : 12 Nov 2023 06:37 IST

‘నాన్నా.. ఈరోజే దీపావళి పండుగ’ అని వరండాలో కూర్చున్న తండ్రితో అన్నాడు నితిన్‌. ‘సరే.. నీకేం కావాలో చెప్పు?’ నవ్వుతూ అడిగారాయన. ‘భారీ శబ్దాలు రాని.. మతాబులు, కాకర పువ్వొత్తులు, భూచక్రాలు కావాలి..’ అంటూ తనకిష్టమైన వాటి పేర్లన్నీ చెప్పాడు. ‘అవన్నీ నేను నీకు కొనిపెట్టాలంటే.. నువ్వో పని చేయాలి’ అంటూ నితిన్‌కు షరతు పెట్టారు నాన్న. ‘ఏమిటా షరతు?’ అంటూ కాస్త బెరుగ్గా అడిగాడతను. ‘భయపడకు.. దీపావళి పండుగను ఎందుకు జరుపుకొంటామో చెప్పు.. ఇప్పటికిప్పుడే కాకపోయినా మధ్యాహ్నం వరకూ నీకు సమయం ఇస్తున్నా. సరేనా?’ కొడుకు భుజం తడుతూ చెప్పారాయన.

‘వారం క్రితమే మా టీచర్‌ దీపావళి పాఠం చెప్పారు కానీ, మర్చిపోయాను’ అంటూ తలపట్టుకున్నాడు నితిన్‌. ‘కంగారుపడకు. నీ మెదడుకు పని చెప్పు. మతాబుల మెరుపు కావాలంటే, నీ మతిమరపు పోవాలంతే..’ అంటూ ప్రోత్సహించారాయన. అప్పుడే అదే వీధి చివరలో ఉంటున్న మిత్రుడు అజయ్‌ రావడంతో ఇంట్లోకి తీసుకెళ్లాడు నితిన్‌. నాన్న పెట్టిన షరతు గురించి మిత్రుడితో చెప్పాడు. ‘మరేం ఫర్వాలేదు.. టీచర్‌ చెప్పిన దీపావళి పాఠం మళ్లీ చదువు. నేను కూడా నీకు సాయం చేస్తాను. బాగా గుర్తుంటుంది’ అంటూ భరోసానిచ్చాడు అజయ్‌. దాంతో నితిన్‌కు ధైర్యం వచ్చింది.

మధ్యాహ్న భోజనం తర్వాత బయటికెళ్లిన నాన్న అప్పుడే ఇంటికి తిరిగొచ్చారు. నితిన్‌ హుషారుగా ఎదురెళ్లి, ‘నాన్నా.. దీపావళి పండుగ గురించి చెప్పనా?’ అని ఉత్సాహంగా అడిగాడు. ‘నీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తోంది. త్వరగా చెప్పు..’ అంటూ కొడుకును దగ్గరకు తీసుకున్నారాయన. ‘పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. తన రాజ్యంలోని ప్రజలను అనేక బాధలు పెట్టేవాడు. వాటిని భరించలేక, ప్రజలు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లారు. నరకాసురుడు పెడుతున్న బాధలను తప్పించమని వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేసి ఆ రాక్షసుడిని సంహరించాడు. అలా ప్రజలకు నరకాసురుడి నుంచి విముక్తి లభించింది. దాంతో ప్రజలంతా తమ జీవితాల్లో చీకట్లు తొలగిపోయి, వెలుగులు వచ్చాయని ఎంతో సంతోషించారు. గోరంత దీపమైనా కొండంత చీకటిని తరిమేస్తుంది. అందుకే తమ కష్టాలు తొలగిపోయినందుకు గుర్తుగా ఆ రాజ్యంలోని ప్రజలందరూ దీపాలను వెలిగించారు. చీకటి అంటే అజ్ఞానమని, వెలుగు అంటే జ్ఞానమని అర్థం. దీపావళి అంటే దీపాల వరస అని కూడా అంటారు’ అని గుక్కతిప్పుకోకుండా వివరించాడు నితిన్‌.

‘ఏదడిగినా గుర్తులేదు.. మర్చిపోయానని చెప్పే నువ్వు.. ఈ పండుగ గురించి ఇంత బాగా ఎలా చెప్పావు?’ అని అడిగాడు. ‘నాకు బాగా వచ్చేవరకూ ఆ పాఠాన్ని ఎక్కువసార్లు చదివాను నాన్నా’ అన్నాడు నితిన్‌. ‘ఇష్టంగా నేర్చుకుంటే ఏదీ కష్టం కాదు. ఒకసారి చదివితేనే ఏదీ వచ్చేయదు. దాని ముందూ వెనకా జరిగిన అంశాలతో క్రోడీకరించుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. మతాబుల మెరుపు కోసం నీ మెదడుకు పని చెప్పావు.. శెభాష్‌’ అంటూ కొడుకు వైపు మెచ్చుకోలుగా చూశారాయన. సాయంత్రం కావడంతో అజయ్‌ను కూడా వెంట తీసుకొని తండ్రీకొడుకులిద్దరూ బాణసంచా దుకాణాల వద్దకు వెళ్లారు. ఇష్టమైన టపాసులన్నీ కొనుక్కొని వేగంగా ఇంటికొచ్చేశారు. ఈలోగా అమ్మ దీపాలను సిద్ధం చేసేసింది. అందరూ ఎంచక్కా తయారై.. ఎంతో సంతోషంతో టపాసులు కాల్చారు. ఆ వెలుగుజిలుగులు చూసి మురిసిపోయారు.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు