ఆ జంతువు పేరేంటబ్బా?

కుందేలుకు ఓ జంతువుపైన అసూయ కలిగింది. స్నేహం నటిస్తూ.. మృగరాజుతో ఎలాగైనా దానికి శిక్ష వేయించాలనుకుంది. ఒకరోజు చుట్టాలింటికి కుందేలు బయలుదేరుతున్న సమయంలో.. పక్క అడవి నుంచి ఒక చిలుకమ్మ వచ్చి, కొన్ని జామపండ్లను ఇచ్చింది. అవి తిన్నాక వెళ్తే, సమయం సరిపోదనుకుంది. ఇంతలో అది అసూయ పెంచుకున్న జీవి కనిపించడంతో, దానికో ఆలోచన వచ్చింది. ‘నేను చుట్టాలింటికి వెళ్తున్నా.

Updated : 18 Nov 2023 05:27 IST

కుందేలుకు ఓ జంతువుపైన అసూయ కలిగింది. స్నేహం నటిస్తూ.. మృగరాజుతో ఎలాగైనా దానికి శిక్ష వేయించాలనుకుంది. ఒకరోజు చుట్టాలింటికి కుందేలు బయలుదేరుతున్న సమయంలో.. పక్క అడవి నుంచి ఒక చిలుకమ్మ వచ్చి, కొన్ని జామపండ్లను ఇచ్చింది. అవి తిన్నాక వెళ్తే, సమయం సరిపోదనుకుంది. ఇంతలో అది అసూయ పెంచుకున్న జీవి కనిపించడంతో, దానికో ఆలోచన వచ్చింది. ‘నేను చుట్టాలింటికి వెళ్తున్నా. రెండ్రోజుల్లో తిరిగి వచ్చాక ఈ పండ్లు తీసుకుంటాను. అంతవరకు నీ దగ్గర ఉంచు’ అని ఇచ్చేసింది. అది కూడా సరేనని తీసుకుంది. రెండు రోజుల తర్వాత వచ్చిన కుందేలు.. నేరుగా ఆ జంతువు దగ్గరకెళ్లి జామపండ్లు అడిగింది. ‘నాకెప్పుడిచ్చావు?’ అంటూ తెల్లమొహం వేసిందది. ఆ మాటతో కుందేలుకు కోపమొచ్చింది. అదే సరైన సమయమనుకొని, ఫిర్యాదు చేయడానికి మృగరాజు దగ్గరకు వెళ్లింది.

‘మృగరాజా.. నేను ఒక జంతువుని నమ్మి, కొన్ని జామపండ్లను దాచిపెట్టమని ఇచ్చాను. ఇప్పుడు అడిగితే, ఎప్పుడిచ్చావంటూ అబద్ధమాడుతుంది. అదే తినేసిందని నా అనుమానం. నమ్మినందుకు నన్ను మోసం చేసింది. అబద్ధమాడేవారిని మీరు క్షమించరని నాకు తెలుసు. ఆ జంతువుకు శిక్ష విధించి, నేను ఇచ్చిన పండ్లను నాకు తిరిగి ఇప్పించండి’ అని విన్నవించుకుంది కుందేలు. ‘ఏ జంతువు?’ అడిగింది సింహం. శిక్ష విధించాకే దాని వివరాలు చెబుతానంది కుందేలు. ‘విచారణ చేయకుండా శిక్ష వేయడం సమంజసం కాదు. ఎవరో చెబితే తప్పొప్పులను తెలుసుకుంటాను. సరైన ఆధారాలు దొరికితే కచ్చితంగా శిక్షిస్తా’ అంటూ హామీ ఇచ్చింది సింహం. ‘దోషి ఎవరన్నది ముందే తెలిస్తే, మీకు సానుభూతి కలగొచ్చు. అప్పుడు శిక్షలో తేడా రావచ్చు. అందుకే నేను చెప్పదలుచుకోలేదు’ అంటూ కాస్త గట్టిగానే అంది కుందేలు.

‘నేరం నిరూపణ అయితే కదా.. ఆ జంతువుకు శిక్ష విధించేది? జామపండ్లను తిరిగిప్పించేది?’ అంటూ దాని ఆవేశాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది సింహం. ‘తప్పు చేసేవారి పట్ల ఉదాసీన వైఖరి పనికి రాదనే విషయం మీకు తెలియంది కాదు..’ అంటూ సింహానికి కోపం తెప్పించాలని చూసిందది. ‘ఆవేశం అనర్థాలకు మూలం. విచారణ చేయకుండా దండన విధించడం తప్పు’ అంది మృగరాజు. ‘ఆ పండ్లను పొరుగు అడవి నుంచి చిలుకమ్మ ఎంతో ప్రేమతో తెచ్చి ఇచ్చింది. మన అడవిలో అటువంటివి దొరకవు’ దిగులుగా అంది కుందేలు. ‘విచారణలో ఆ జంతువు నేరం రుజువైతే కచ్చితంగా శిక్ష విధిస్తాను’ అని ఊరడింపుగా చెప్పింది సింహం. ‘ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాను కానీ, నేను ఇచ్చిన జాతిపండ్లే కావాలి. నాకు పరిహారం కింద వాటిని అందజేయండి. శిక్ష మాత్రం మీ పంజా దెబ్బ రుచి చూపించండి’ అంటూ పట్టుబట్టింది.

‘నీ ఫిర్యాదులో న్యాయముంది కానీ, మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు కోరినట్టు ముందుగానే శిక్ష విధిస్తాను. ఆ జంతువు పేరు చెప్పవద్దు కానీ, నేనడిగే ప్రశ్నలకు జవాబులివ్వు చాలు’ అంది సింహం. సరేనంది కుందేలు. ‘నువ్వు ఫిర్యాదు చేసిన జంతువు తోక ఎలా ఉంటుంది?’ అడిగింది మృగరాజు. ‘దానిది కుచ్చుల తోక’ అంది కుందేలు. ‘అయితే, నీ మిత్రురాలు నక్కే కదా..’ అడిగింది సింహం. కాదన్నట్లు తలూపిందది. ‘శరీరం ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్నకు.. చారాలుంటాయంది కుందేలు. ‘అయితే పులా?’ అడిగింది సింహం. కాదని సమాధానమిచ్చిందది. ‘ఎలా నడుస్తుంది?’ అని అడిగితే, ‘అసలు దానికి నడక అంటేనే తెలియదు’ చెప్పింది కుందేలు. ‘అయితే, లేడిపిల్లే’ అని సింహం అనగానే.. కాదని జవాబిచ్చింది. చివరగా ‘చెట్టు ఎక్కగలదా?’ అని అడిగితే.. ఎక్కగలదంది. అయితే కోతి అయ్యుంటుందని ధీమా వ్యక్తం చేసింది సింహం.

‘ఇంకెన్ని ప్రశ్నలు వేస్తారు? మీరిచ్చిన మాట ప్రకారం శిక్ష విధించాల్సిందే’నని పట్టుబట్టింది కుందేలు. ‘సింహం నవ్వింది.. నీ జవాబులను బట్టి ఆ జంతువు ఉడుత అని అర్థమైంది. అంతేనా?’ అడిగింది సింహం. ‘నిజమే కానీ మీరు మాట తప్పారు. శిక్ష కంటే ముందే ఆ జంతువు పేరును నాతో ఒప్పించారు’ అంటూ అసహనాన్ని ప్రదర్శించింది కుందేలు. ‘ఉడుతలకు మతిమరపు ఉంటుందని తెలిసి కూడా పండ్లు దాచిపెట్టమని ఇవ్వడం నీదే తప్పు. ఇందులో నీకు దానిపైన ఉన్న కోపం మాత్రమే కనిపిస్తుంది’ అని గర్జించింది సింహం. అవాక్కైన కుందేలు.. ‘నాకు అసలా ఉద్దేశం లేదు ప్రభూ..’ అంటూ ప్రాధేయపడింది.

‘ఉడుతలకు మతిమరపు ఎక్కువ. భవిష్యత్తు కోసం గింజలను, పండ్లను దాచుకోవడం వాటి నైజం. నువ్విచ్చిన పండ్లను కూడా అది నివసించే ప్రాంతంలోనే ఎక్కడో ఒకచోట భూమి లోపల భద్రం చేసి మర్చిపోయి ఉంటుంది. కొద్దిరోజుల్లో అవి మొలకెత్తి చెట్లు అవుతాయి. అప్పుడు ఆ జాతి పండ్లను నీకు నచ్చినన్ని తినొచ్చు’ అంది మృగరాజు. మౌనంగా ఉండిపోయింది కుందేలు. ‘పరోక్షంగా పచ్చదనాన్ని పెంచే శక్తి ఉడుతలకు మాత్రమే ఉంది. ఈ అడవిలో లేని పండ్ల జాతిని నాటించి మేలే చేశావు. అందుకు నిన్ను అభినందిస్తున్నాను’ అని కుందేలును సముదాయించి పంపింది సింహం.

బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని