రంగయ్య... భీమయ్య.. సీతయ్య!

హేలాపురిలో నివసిస్తున్న రంగయ్యకు మట్టిపాత్రల తయారీలో మంచి పేరుంది. అతని తాత ముత్తాతల కాలం నుంచీ ఆ కుటుంబీకులు నాణ్యమైన మట్టిని ఉపయోగించి వివిధ పరిమాణాల్లో కుండలు, నీటి తొట్టెలు, దీపం ప్రమిదలు, మూకుళ్లు, పిడతలు మొదలైన గృహోపకరణాలు తయారు చేసి అమ్మేవాళ్లు.

Updated : 01 Dec 2023 04:35 IST

హేలాపురిలో నివసిస్తున్న రంగయ్యకు మట్టిపాత్రల తయారీలో మంచి పేరుంది. అతని తాత ముత్తాతల కాలం నుంచీ ఆ కుటుంబీకులు నాణ్యమైన మట్టిని ఉపయోగించి వివిధ పరిమాణాల్లో కుండలు, నీటి తొట్టెలు, దీపం ప్రమిదలు, మూకుళ్లు, పిడతలు మొదలైన గృహోపకరణాలు తయారు చేసి అమ్మేవాళ్లు. ప్రస్తుత కాలంలో రంగయ్య కూడా అన్ని రకాల మట్టి ఉపకరణాలు తయారు చేసి అమ్ముతున్నాడు. చాలా కాలం పాటు అతని వ్యాపారం సజావుగా, లాభాల బాటలో నడిచింది. కానీ కొన్నిరోజులుగా మందగించసాగింది. ఒకసారి అతని దుకాణంలో కొన్న వాళ్లు, తిరిగి రావడం మానేశారు!   దీనికి విరుద్ధంగా రంగయ్య దుకాణానికి ఎదురుగా ఉన్న భీమయ్య దుకాణం దగ్గర, ఎప్పుడూ జన సందోహం ఉంటోంది. కారణం.. రంగయ్య కంటే భీమయ్య తక్కువ ధరకే మట్టిపాత్రలు అమ్మేవాడు. కానీ అవి నాసిరకంగా ఉండేవి. ఒకసారి అతని దగ్గర మట్టి పాత్రలు మొదలైనవి కొన్నవాళ్లు మళ్లీ మళ్లీ కొనడానికి వచ్చేవాళ్లు. తన దుకాణానికి కొనడానికి వచ్చే వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోవడానికి గల కారణాలు రంగయ్యకు అంతుబట్టడం లేదు. తను అమ్మే పాత్రలు భీమయ్య అమ్మే వాటి కంటే నాణ్యమైనవే కదా! అని తలుచుకుని బాధపడేవాడు. ఈ విషయం ఒకసారి తమ ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన, తనకు వరుసకు బావ అయ్యే సీతయ్యతో చెప్పుకొని బాధపడ్డాడు రంగయ్య.

సీతయ్య తన బావ రంగయ్య తయారు చేసిన మట్టి సామగ్రిని, భీమయ్య సామగ్రితో పోల్చి చూశాడు. రంగయ్య దుకాణంలోని ఉపకరణాలు అన్నీ.. ఎంతో దృఢంగా, చాలాకాలం మన్నేలా తయారయ్యాయి. వాటిని తయారు చేసిన పద్ధతి, కాల్చిన విధానంలోనే వాటి గట్టితనం, నాణ్యత ఇమిడి ఉన్నాయని గ్రహించాడు సీతయ్య.

భీమయ్య సరుకు అంతా.. నాసిరకం మట్టితో తయారైందని, పైగా అవి సరిగ్గా కాల్చడం లేదని కూడా గ్రహించాడు. వాటి నునుపుదనం కూడా రంగయ్య సామగ్రి అంత మెరుపుగా లేకపోవడం కూడా గమనించాడు సీతయ్య. అతనికి పరిస్థితి అంతా అర్థమైంది.

‘బావా! నువ్వు తయారు చేస్తున్న సామగ్రి నాణ్యంగా, దృఢత్వం సంతరించుకుని ఉండడంతో అవి చాలా కాలం మన్నుతున్నాయి. అందుకే నీ దగ్గర వస్తువులు కొన్నవాళ్లు మళ్లీ ఎంతో కాలానికి కానీ రావడం లేదు. కానీ భీమయ్య తయారు చేస్తున్న సామగ్రి నాసిరకానివి కావడంతో, అంటే సరైన మట్టి వాడకపోవడం, సరిగ్గా కాలనివ్వక పోవడంతో అవి త్వరగా పగిలి పోతున్నాయి. కాస్త తక్కువ ధరకే వస్తుండటంతో అతని వద్దకు ఎప్పుడూ వచ్చే ఖాతాదారులు, మళ్లీ వెంట వెంటనే కొత్త పాత్రలు కొనడానికి వస్తున్నారు. నీ దుకాణంలో పాత్రలు కొన్నవాళ్లెవరూ వెంట వెంటనే నీ దగ్గర కొనడానికి రాకపోవడానికి కారణం.. నువ్వు పాత్రలను ఎంతో నాణ్యంగా, నైపుణ్యంగా తయారు చేయడమే..’ అని నవ్వుతూ చెప్పాడు సీతయ్య.

‘అంటే ఇప్పుడు నన్ను కూడా నాణ్యత లేని సామగ్రి తయారు చెయ్యమంటావా సీతయ్య బావా?!’ అని ఆశ్చర్యంగా అడిగాడు రంగయ్య అయోమయంగా. ‘అలా ఎందుకు అంటాను? నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడవద్దు. నీ సామగ్రి అంత త్వరగా పాడైపోదు. ఓపిక పట్టు.. నీకు అంతా మంచే జరుగుతుంది’ అని చెప్పాడు సీతయ్య.

కొద్ది రోజుల తరువాత తుపాను ప్రభావంతో ఓ రెండు రోజుల పాటు కుండపోతగా వర్షాలు కురిశాయి. ఆ వానలకు భీమయ్య తయారు చేసి పేర్చిన మట్టి పాత్రలన్నీ నాని, మట్టి ముద్దలై పోయాయి. కానీ వర్షంలో తడిచి పోయినా కూడా రంగయ్య తయారు చేసిన సామగ్రి మాత్రం చెక్కు చెదరకుండా దృఢంగా అలాగే నిలిచి ఉంది.

ఈ తేడా గమనించిన కొనుగోలుదారులు అందరూ.. ఇప్పుడు భీమయ్య దుకాణంలో కాక రంగయ్య దుకాణంలోనే, తమ ఇంటి అవసరాలకు కావాల్సిన కుండలూ, నీటి తొట్టెలు మొదలైన సామగ్రి కొనుగోలు చేయసాగారు. త్వరలోనే రంగయ్య వ్యాపారం పుంజుకుని లాభాలు వచ్చాయి.  

కోనే నాగ వెంకట ఆంజనేయులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని